చట్టం అందరిదీ, కానీ కొందరికి మాత్రం అది చుట్టమైపోతోంది. అందుకే పెద్దలకు అది పనికిరాని మందు అవుతోంది. చట్టం పేరు చెప్పి సామాన్యుడిని కట్టడి చేయడం తప్ప తమదాకా రానిచ్చుకునేందుకు మన పొలిటీషియన్లు ఒప్పరంటే ఒప్పరు.
అందుకే ఏమైనా ఆరోపణ వచ్చినా, నింద పడినా వెంటనే ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. దానికి కులం, మతం, రంగు, రుచి ఇలా అనేక కార్డులు వాడేస్తారు. సిక్కోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీద ఇలా ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయో లేదో అలా టీడీపీ వెంటనే రియాక్ట్ అయింది. అచ్చెన్న బీసీ కాబట్టే ఇలా వేధిస్తున్నారంటూ కులం కంపు కొట్టించే ప్రయత్నం స్టార్ట్ చేసేశారు.
దీనిమీద మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. బీసీలు, కులాలెందుకు తీసుకువస్తున్నారు బాబు గారు అంటూ గట్టిగానే తగులుకున్నారు. తప్పు చేస్తే శిక్షించాలంటే కులం చూసి కేసులు పెట్టాలా అని బొత్స ప్రశ్నించారు.
అలా అయితే కులానికో చట్టాన్ని తెచ్చుకోలేకపోయారా బాబూ అంటూ సెటైర్లు వేశారు. తాను బీసీ మంత్రినేనని, కానీ నాడు ఎలాంటి తేడా లేకుండా అసెంబ్లీ లోపలా బయటా కూడా తనని టీడీపీ పెద్దలు ఓ ఆట ఆడుకున్నారు కదా అంటూ బొత్స బాబు మీద గుస్సా అయ్యారు.
అంటే టీడీపీలో ఉంటేనే బీసీ మంత్రులు అవుతారా. బయట బీసీలు అవసరం లేదా అని పసుపు పార్టీ అధినేతను కడిగేశారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా తప్పించుకోలేరని కూడా ఆయన అంటున్నారు.
మా మీద ఏ దర్యాప్తు అయినా చేయించుకోండి అంటూ నాడు జబ్బలు చరచి సవాల్ చేసిన టీడీపీ పెద్దలు తమ ప్రభుత్వం సిట్ వేస్తే కక్ష సాధింపు చర్యలు అని రివర్స్ లో రావడమేంటని కూడా బొత్స మండిపడ్డారు. మొత్తం మీద టీడీపీకి కావాల్సిన జవాబులే మంత్రి ఇచ్చారనుకోవాలి.