ప్రజా పోరాటానికి దూరమైన జనసేనాని

పాతికేళ్ల పోరాటం, ఆరాటం పవన్ మాటల్లోనే కానీ, చేతల్లో కనిపించడం లేదు. ఒకవేళ అదే నిజమైతే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టేవారు కాదు. ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో జనసేనకు…

పాతికేళ్ల పోరాటం, ఆరాటం పవన్ మాటల్లోనే కానీ, చేతల్లో కనిపించడం లేదు. ఒకవేళ అదే నిజమైతే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టేవారు కాదు. ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో జనసేనకు బలముంది. అందులోనూ గాజువాకను పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంగా కూడా చేసుకున్నారు.

అలాంటి జనసేనాని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో ఎందుకు నిలబడలేకపోయారు? ప్రధానిని కలుస్తా, అన్నీ వివరిస్తా, కార్మికుల తరపున నిలుస్తానంటూ భారీ డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు. 

పవన్ కల్యాణ్ చేతుల్ని బీజేపీ కట్టేసిందా? సొంత పార్టీ ప్రయోజనాల కంటే, మిత్రపక్షం రాజకీయ అవసరాలే పవన్ కల్యాణ్ కి ఎక్కువయ్యాయా? ఉక్కు పోరాటానికి పవన్ నాయకత్వం వహించి ఢిల్లీ గద్దెను ఎదిరిస్తే పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుంది? పవన్ పొలిటికల్ మైలేజీ ఏ స్థాయిలో పెరుగుతుంది?

ఇవన్నీ బేరీజు వేసుకున్నారో లేక, ప్యాకేజీ స్టార్ అంటూ పదే పదే వైరిపక్షాలు, గిట్టనివాళ్లు చేసే విమర్శల్ని నిజం చేస్తున్నారో తెలియదు కానీ, పవన్ మాత్రం ఉక్కు దీక్ష నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత దాదాపుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు స్పందించాయి కానీ పవన్ మాత్రం నోరు మెదపలేదు.

అప్పుడు కూడా ఇంతే..

గతంలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో, అప్పటి అధికార, ప్రతిపక్షాల కంటే ధీటుగా స్పందించారు పవన్ కల్యాణ్. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీని విమర్శించి ఏపీలో హీరో అయ్యారు. అలాంటి పవన్ కల్యాణ్ ఆ తర్వాత పూర్తిగా గాలి తీసిన బుడగలా మారిపోయారు. ప్రత్యేక హోదా అంటేనే.. ప్రజలకే లేదు, నాకెందుకు అనే పరిస్థితికి వచ్చేశారు. బీజేపీతో చేతులు కలపడం వల్ల పవన్ ఇకపై ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశమే లేదు. ఉక్కు సంగతి కూడా దాదాపుగా అంతే.

టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న వేళ, ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ ఉక్కు పోరాటానికి నాయకత్వం వహించి, గల్లీ నుంచి, ఢిల్లీదాకా ఉద్యమం చేస్తే, ఫలితం ఎలాగున్నా కచ్చితంగా జనసేనానికి పొలిటికల్ మైలేజీ దక్కుతుందనేది జనసైనికుల వాదన. అయితే ఇక్కడ కూడా బీజేపీయే పవన్ చేతులు కట్టేసింది. విశాఖలో అంత పెద్ద ఆందోళన జరుగుతున్నా పవన్ కనీసం నోరు మెదపలేదంటే ఆయన నిస్సహాయతను అర్థం చేసుకోవచ్చు.

ఈ నిస్సహాయత, నిర్లిప్తత వల్ల ఎవరికి లాభం అనే విషయమే ఇప్పుడు చర్చనీయాంశం. ఉక్కు పోరాటం చల్లబడాలనేది బీజేపీ ఆలోచన, దానికోసం పవన్ నోరు మూసేశారు. అయితే దాని వల్ల పవన్ కి ఏంటి లాభం? ఏదేమైనా.. బీజేపీతో చేరిక వల్ల పవన్ కి రాజకీయంగా నష్టమే కానీ, లాభం ఏదీ లేదని జనసైనికుల అభిప్రాయం. బీజేపీ వల్లే పవన్ ప్రజా పోరాటాలకు దూరమవుతున్నారనే వాదన కూడా బలంగా వినపడుతోంది.

ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..