దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఎదురైన చేదు అనుభవాల తర్వాత ఇప్పుడు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విజయావకాశాలపై చాలామందిలో అనుమానాలున్నాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ.. సిట్టింగ్ స్థానంతో సహా.. తమకు అసలు కలసి రాని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాన్ని కూడా చేజిక్కించుకోడానికి కేసీఆర్ బృహత్తర ప్రణాళిక రచించారు. ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించారు. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ ఫిట్ మెంట్ ని అనధికారికంగా ప్రకటించేశారు.
ఇటీవల పీఆర్సీ కమిటీ తెలంగాణ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంతో అన్నిచోట్లా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ సర్కారు ఉద్యోగుల్ని చిన్నచూపు చూస్తోందని వివిధ సంఘాలు మండిపడ్డాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న పక్క రాష్ట్రం ఏపీ ఉద్యోగులకు 27శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన నేపథ్యంలో రిచ్ స్టేట్ తెలంగాణలో 7.5 శాతం ఫిట్ మెంట్ అనేసరికి ఉద్యోగులంతా డీలా పడ్డారు. కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ తుది నిర్ణయం తీసుకోలేదు. సరిగ్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ అదను చూసి దెబ్బకొట్టారు. పక్క రాష్ట్రం కంటే 2 లేదా 3 శాతం ఫిట్ మెంట్ ఎక్కువగానే ఇస్తాం అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా.. ఏవేవో కారణాలు చెప్పి ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా ఫిట్ మెంట్ అంశం చర్చకు రాగా దాన్ని చిటికెలో పరిష్కరించారు. ఇంకా వివిధ హామీలు కూడా ఇచ్చేశారు.
వీఆర్వో వ్యవస్థ రద్దుతో అవినీతి జాడ్యం వదిలిస్తామని చెప్పుకున్న కేసీఆర్ కి అది సాధ్యపడలేదు. పవర్ కోల్పోయిన వీఆర్వోలంతా దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీఆర్వోల సమస్యకి కూడా పరిష్కారం చూపారు కేసీఆర్. వారందర్నీ తిరిగి రెవెన్యూ డిపార్ట్ మెంట్ లోకే తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61ఏళ్లకు పెంచడం, సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మరణిస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్ ఇవ్వడం, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై కీలక నిర్ణయం, స్పౌజ్ కేటగిరీ బదిలీలు, కారుణ్య నియామకాలపై చర్యలు, హెర్త్ కార్డులతో కోరుకున్న ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్య సౌకర్యం వంటి నిర్ణయాలపై కూడా ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చి పంపించారు కేసీఆర్.
అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా కేసీఆర్ ఎక్కడా అధికారిక ప్రకటన చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఉద్యోగులకు శుభవార్త చెవిలో చెప్పి పంపించేశారు. పరోక్షంగా ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని గుర్తు చేశారు. దీంతో తెలంగాణలో ఎమ్మెల్సీ వార్ వన్ సైడ్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.