తమిళనాడు పాలిటిక్స్ లో కొన్ని కామెడీలు మామూలుగా ఉండవు. దాదాపు 15 యేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కాంత్ పాలిటిక్స్ లో కామెడీలు చేస్తూ ఉన్నారు. తొలి సారి భారీ ఎత్తున పార్టీని స్థాపించి, రాష్ట్రమంతా పోటీ చేసిన విజయ్ కాంత్ తను ఒక్కడు మాత్రమే గెలవగలిగాడు. పవన్ కల్యాణ్ కన్నా కాస్త మెరుగు విజయ్ కాంత్. తొలిసారి పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోతే, తొలి సారి పోటీ చేసినప్పుడు కనీసం తను పోటీ చేసిన చోట అయినా విజయ్ కాంత్ నెగ్గాడు.
మొదట్లో విజయ్ కాంత్ పోరాట పంథా అందరికీ నచ్చింది. కరుణానిధి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పుడు.. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసి విజయ్ కాంత్ పార్టీ సంచలనం రేపింది. డీఎంకేను మించి సీట్లను సాధించింది విజయ్ కాంత్ పార్టీ.
తను మాత్రమే గెలవడం అనే దశ నుంచి ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా నిలిచేంత వరకూ వచ్చింది ఆ పార్టీ. అక్కడ నుంచి విజయ్ కాంత్ అధికారం అందుకోవడమే తరువాయి అనేంత ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే డీఎంకేపై వ్యతిరేకత, అన్నాడీఎంకేతో దోస్తీ మాత్రమే విజయ్ కాంత్ ను ఛాంపియన్ గా నిలిపిందని ఆతర్వాతి ఎన్నికల్లో స్పష్టం అయ్యింది.
క్రితం సారి ఎన్నికల్లో విజయ్ కాంత్ స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా ఏ మూడోస్థానంలోనో నిలిచినట్టుగా ఉన్నాడు! ఇదీ విజయ్ కాంత్ ప్రస్తుత పరిస్థితి.
ఇక అన్నాడీఎంకే కూటమికి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డీఎంకే వ్యతిరేక గాలిలో, అన్నాడీఎంకేతో జత కడితే విజయ్ కాంత్ కు లాభం చేకూరింది. ఇక అన్నాడీఎంకే పదేళ్ల పాలనతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని ఉండవచ్చు. అందునా జయలలితను చూసి గత పర్యాయం ఈ పార్టీని గెలిపించారు కానీ, పన్నీరు సెల్వాన్నో, పళనిస్వామినో, బీజేపీనో చూసి కాదు!
ఆ విషయం లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడే రుజువయ్యింది. వీళ్లంతా కూటమిగా వెళ్లి సాధించింది ఒక్కటంటే ఒక్క లోక్ సభ సీటు! ఇలాంటి నేపథ్యంలో.. అన్నాడీఎంకే కూటమి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించడానికి మరీ రాజకీయ పాండిత్యం ఏమీ అక్కర్లేదు. అన్నాడీఎంకే కూటమిలో ఎవరున్నా, ఎవరు లేకపోయినా.. ఈ సారి డీఎంకే కు అధికారం పల్లెంలో పెట్టి అప్పగిస్తున్నారని స్పష్టం అవుతోంది.
అయితే అన్నాడీఎంకే కూటమి కామెడీలు మాత్రం తగ్గట్లేదు. మొదటేమో శరత్ కుమార్ తను కోరినన్ని సీట్లు ఇవ్వలేదంటూ బయటకు వెళ్లారు. ఇప్పుడు విజయ్ కాంత్ వంతు! ఈయన 49 అడుగుతున్నారట. 15 అని అన్నాడీఎంకే అంటోందట. అలిగి విజయ్ కాంత్ బయటకు వెళ్లిపోతుంటే.. బీజేపీకి బాధేస్తోందట. విజయ్ కాంత్ ను ఎందుకు కూటమి నుంచి బయటకు పంపుతున్నారంటూ బీజేపీ వాళ్లు అన్నాడీఎంకే మీద కోప్పడుతున్నారట! ఇలా సాగుతోంది తమిళ రాజకీయ కామెడీ!