బాబును ఏదైనా చేస్తే తప్ప లోకేష్ వదలడు

రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఏర్పడిన మొట్ట మొదటి ప్రభుత్వం విధాన పరంగా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది అనేది.. చాలా కాలంగా ఉన్న ఆరోపణలు. వాటిని నిగ్గు తేల్చడానికి రెండోసారి గద్దె మీదకు వచ్చిన…

రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఏర్పడిన మొట్ట మొదటి ప్రభుత్వం విధాన పరంగా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది అనేది.. చాలా కాలంగా ఉన్న ఆరోపణలు. వాటిని నిగ్గు తేల్చడానికి రెండోసారి గద్దె మీదకు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు పాలన మీద జగన్ సర్కారు ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయితే కేవలం తమ ఆరోపణలులాగా కాకుండా, వాటిని సాధికారికంగా నిరూపించడానికి తొలుత ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. దాని నివేదికలోని అంశాలను తేల్చడానికి పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటుచేశారు.

ఈ సిట్‌పై తెలుగుదేశం నాయకుల నుంచి సహజంగానే విమర్శలు, విరుద్ధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెదేపా జాతీయ కార్యదర్శి లోకేష్ మాత్రం చిత్రంగా స్పందిస్తున్నాడు. ట్విటర్ పులి అయిన లోకేష్.. ఈ విషయంపై కూడా ట్వీటు తోనే సరిపెట్టుకున్నాడు. రేషన్ కార్డులు, పింఛన్లలో కోతలు అంశాలపై ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికే సిట్ వేశారని లోకేష్ కు అర్థమైనట్లుగా ఉంది. అయినా తమ అవినీతి ఆరోపణలపై దృష్టి మళ్లించడానికి , ఎదుటివారి అవినీతిపై సిట్ వేశారని చెప్పినా సబబుగా ఉండేది గానీ.. లోకేష్ పింఛన్లతో ముడిపెట్టి ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు.

అంతకంటె తమాషా ఏంటంటే.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా.. విచారణలు, కమిటీలతో చంద్రబాబును ఏమీ చేయలేకపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ కూడా తొమ్మిది నెలల్లో ఎన్నో కమిటీలు వేశారని.. వాటితో సాధించేమీ లేక ఇప్పుడు సిట్ వేశారని అన్నారు. అయితే ఇక్కడ లోకేష్ కు అర్థం కాని సంగతి ఒకటుంది. ఈ తొమ్మిది నెలల్లో వేసిన కమిటీలు నివేదిక ఇవ్వడానికే.. అవి తప్పులు జరిగినట్లుగా నివేదిక ఇచ్చాయి గనుకనే.. వాటిపై నిగ్గుతేల్చి చార్జిషీటు కూడా దాఖలు చేసే అధికారాలతో సిట్ ఏర్పాటు జరిగింది. లోకేష్ శిక్షలకోసం అప్పుడే తొందర పడితే ఎలా అని పలువురు అంటున్నారు.

సాధించేదేమీ లేనప్పుడు సిట్ తో కాలయాపన చేయాలని చూస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం. సాధారణంగా.. సాధించడం గురంచి రెచ్చగొట్టడానికి కాలయాపనతో ముడిపెడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. లోకేష్ మాటల తీరు గమనిస్తోంటే.. జగన్ ను ఏదో ఒక రీతిగా రెచ్చగొట్టి.. చంద్రబాబును ఏదో ఒకటి చేసేదాకా విశ్రమించేలాగా లేడని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. ఆయనకు అంత తొందర అక్కర్లేదని సిట్ విచారణలో.. ఇదివరకటి లాగా కాకుండా.. పక్కా ఆధారాలతోనే.. కేసులు నమోదు అవుతాయని అంటున్నారు.