Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎన్నార్సీపై మోడీ వెనక్కు తగ్గుతున్నారా?

ఎన్నార్సీపై మోడీ వెనక్కు తగ్గుతున్నారా?

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. సీఏఏ, ఎన్నార్సీ వ్యవహారాలు రగిలించిన రావణకాష్టం ఈ దేశంలో ఇంకా చల్లారలేదు. ఎన్డీయేతర రాష్ట్రాలన్నీ కూడా ఎన్నార్సీని తీవ్రాతితీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి నిరసనలు వ్యతిరేకతలు పలుచోట్ల ఉధృతమవుతుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గారా అనే సందేహం కలుగుతోంది.

రెండు మూడు రోజుల కిందట ప్రధాని నరేంద్రమోడీ.. తన సొంత నియోజకవర్గం  వారణాశిలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఒక ఎంపీ హోదాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారణాశిలో జరిగిన ఒక బహిరంగసభలో మోడీ మాట్లాడుతూ.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా సీఏఏ, ఎన్నార్సీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే అవకాశమే  లేదని హెచ్చరించారు. అయితే ఆ మాట మీద నిలకడగా నాలుగు రోజులు కూడా నిలబడినట్లు లేదు. ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతున్నారేమో అనిపిస్తోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలిసిన అనంతరం ఆయన చెబుతున్న మాటలను బట్టి.. మోడీ వెనక్కు తగ్గిన సంగతి నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్డీయే కూటమిలో లేకపోయినప్పటికీ సీఏఏను గట్టిగా సమర్థిస్తున్న పార్టీల్లో ,రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్ధవ్ థాకరే కూడా ఉన్నారు. అయితే అదే సమయంలో ఆయన ఎన్నార్సీని మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి సీఏఏను సమర్థిస్తున్నందుకు.. ఆయన తమ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామి నేత శరద్ పవార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ప్రధానిని కలిసినప్పుడు ఉద్ధవ్ మాత్రం.. ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అనుమతించేది లేదని స్పష్టం చేశారట.

ప్రధాని మోడీ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారని, ఎన్నార్సీ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వర్తించేలా అమలు చేయదలచుకున్నది కాదని ప్రధాని చెప్పినట్లు థాకరే.. భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వెల్లడించారు. మొత్తానికి దూకుడు నిర్ణయాల విషయంలో రాజ్యసభలో లేని బలాన్ని ఊహించుకున్నందుకు .. మోడీ సర్కారు ఇప్పుడు వెనక్కు తగ్గాల్సి వచ్చినట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?