నేవీ అభ్యంతరాలంటూ విషం చిమ్మారు!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి బాలారిష్టాలు ఎదురవుతున్నాయంటూ విషం చిమ్మేప్రయత్నం జరుగుతోంది. అధికార వికేంద్రీకరణ చేస్తూ, శాసన రాజధాని అమరావతి లోనే ఉంచేసి, పరిపాలన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి బాలారిష్టాలు ఎదురవుతున్నాయంటూ విషం చిమ్మేప్రయత్నం జరుగుతోంది. అధికార వికేంద్రీకరణ చేస్తూ, శాసన రాజధాని అమరావతి లోనే ఉంచేసి, పరిపాలన రాజధానిని మాత్రం విశాఖపట్నానికి తరలించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ నిర్ణయం అమలులోకి రావడానికి ఇప్పటికే స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించడంలో జగన్ సర్కారు ఇప్పటికే పాట్లు పడుతూ ఉంది.

ఇలాటి సమయంలో అసలు విశాఖకు రాజధాని తరలే అవకాశమే లేదన్నట్లుగా, అక్కడ నేవీ ఒప్పుకోలేదన్నట్లుగా అబద్ధపు కథనాలు కొన్ని పత్రికల్లో రావడం.. గమనార్హం. కట్టుకథలు అల్లి ప్రచారం చేసిన వారికి బుద్ధి వచ్చేలా.. నేవీ దళాలే స్వయంగా వాటిని ఖండించడమూ గమనార్హం.

అసలే, అమరావతి ప్రాంత రైతుల నుంచి ఈ విషయంలో దీర్ఘకాలిక నిరసనలు అప్రతిహతంగా సాగుతున్నాయి. నిరసనలు సంగతి ఎలా ఉన్నప్పటికీ వారి తరఫున హైకోర్టులో నమోదైన పిటిషన్లు మాత్రం ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి కూడా. ఇన్న ప్రతిబంధకాల మధ్యలో విశాఖలో రాజధాని ఏర్పాటుకావడానికి నేవీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయంటూ కేవలం కొన్ని పత్రికల్లో మాత్రమే వచ్చిన కథనాలు పచ్చ దళాలకు కనువిందు చేశాయి. ఓ రోజంతా పని పెట్టాయి. ఇవి ఎంత సంచలనం సృష్టించినా వట్టిపుకార్లే తప్ప వాస్తవాలు కాదని తేలిపోయాయి.

విశాఖలోని మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటుచేసి ప్రస్తుతానికి అక్కడినుంచి పాలన ప్రారంభించాలని అనుకుంటున్నదని.. తర్వాత రాజధాని నిర్మాణం చేపడతారని జగన్ నిర్ణయం తర్వాత కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేయడానికి భారత నౌకాదళం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జగన్ కు లేఖ రాసినట్టు రెండు రోజుల కిందట ఓ ఇంగ్లిషు పత్రికలో వచ్చింది. అది నిజమై ఉంటే ఆరోజే గగ్గోలు అయిపోయి ఉండాల్సింది. కానీ మీడియాలో కూడా దానిని ఎవరూ పట్టించుకోలేదు.

అయితే.. నిజాలను తేల్చుకునే అలవాటు లేని ఒక తెలుగు పత్రిక మాత్రం.. అవే పుకార్లను, అబద్ధాలను మళ్లీ చెలామణీలో పెట్టడానికి ప్రయత్నించింది. వారు ఇలా ప్రచురించగానే.. తాన తందానా అంటూ వంత పాడడానికి సిద్ధంగా ఉండే పచ్చదళాలు కూడా రెచ్చిపోయాయి. అయితే.. విశాఖ నేవీ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి లేఖ రాయనేలేదని వారే స్వయంగా ఖండించారు. అసలు ప్రభుత్వం నుంచి తమ వద్దకు అలాంటి ప్రతిపాదన కూడా ఏదీ రానేలేదని వారు ప్రకటించారు.

దాంతో ప్రజలు మాత్రం.. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా.. విషం చిమ్ముతున్న పత్రికలను ఈసడించుకుంటున్నారు.