చాలా కాలం తర్వాత ఆర్‌కే కలం నుంచి ఈ వారం ఫర్వాలేదు అనిపించే కథనం రాశాడు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వారం ఆర్‌కే కొత్త పలుకు చదివితే మాత్రం ఏవో ఒకట్రెండు అంశాల్లో తప్ప, మిగిలిన విషయాలపై తప్పక అభినందిస్తారు. ఆయనలోని జర్నలిస్టు పునరుత్థానం చెందినందుకు సంతోషం.
‘రాజు కక్షకు రాజ్యం బలి!’ శీర్షికతో ఆయన రాసిన కథనంలో రాజధాని అమరావతి , అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అతిశయోక్తులు మినహాయిస్తే…మిగిలిన అంశాల్లో చాలా వరకు వాస్తవమే కదా అనిపించేలా ఉన్నాయి. జగన్‌పై వ్యక్తిగతంగా కాకుండా ఆయన సర్కార్ పాలనపై విశ్లేషణ రాయడం ఈ వారం ప్రత్యేకత. అందుకే అందర్నీ ఆకట్టుకునేలా ఉందని చెప్పడం.
‘మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన ఎవరి ఊహకు అందని విధంగా సాగుతోంది అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ మధ్య మురిపెంగా చెప్పుకొచ్చారు. నిజమే.. కన్నబాబుకు మాత్రమే కాదు వైసీపీకి ఓట్లు వేసినవారి ఊహలకు సైతం అందని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతోంది. రాష్ట్రాన్ని ఏమి చేయబోతున్నారో కూడా తెలియని విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రభుత్వంపై ఇంటా–బయటా విమర్శలు వస్తున్నా ముఖ్యమంత్రి చెవికి ఎక్కడం లేదు’…అని ఆర్‌కే రాశారు.
ఆర్‌కే చెప్పినట్టు జగన్ పాలనపై ఎక్కువ అసంతృప్తితో ఉన్నది వైసీపీ శ్రేణులే. ‘జగన్ కావాలి-జగన్ రావాలి’ అనే నినాదాన్ని భుజానకెత్తుకుని ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించారు. కార్యకర్తలు కోరుకున్నట్టు జగనన్న సీఎం అయ్యాడే తప్ప, తమకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని, భవిష్యత్‌లో కూడా తమను ఉద్దేరిస్తారనే భ్రమలు క్రమంగా వైసీపీ కార్యకర్తల్లో కరిగిపోతున్నాయి.
అసలు వైసీపీ ఎమ్మెల్యేలే తమను పట్టించుకునే దిక్కు లేదని వాపోతున్నప్పుడు….ఇక సామాన్య కార్యకర్తల మొర ఆలకించేదెవరు? ఎక్కడైనా అధికార పార్టీ శ్రేణులు బలమైన వాయిస్‌తో ఉండటం చూస్తుంటాం. కానీ అందుకు విరుద్ధంగా వైసీపీ కార్యకర్తలు ఉండటం బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తామేమో. ‘జగన్ ఉండాలి -టీడీపీ బలపడాలి’ అని ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, నాయకులు నినదిస్తున్నారంటే…జగన్ పాలన ఏ విధంగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు సీఎంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నెలకొక పథకాన్ని అమలు చేస్తున్నా….ఎందుకో జనాల్లో బాగా నెగిటీవ్ టాక్ వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులను డమ్మీలు చేసి…అధికారులకు బాధ్యతలు అప్పగించడమే. అసలు కార్యకర్తల అవసరమే లేనట్టు సీఎం జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితర ‘పెద్దరెడ్లు’ భావిస్తూ, అందుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారనే ఆగ్రహంతో కిందిస్థాయి నాయకులు ఉన్నారు.
‘చంద్రబాబు అయిదేళ్ల పాలనపై గంపగుత్తగా విచారణకు సిట్ ఏర్పాటు చేయడం జగన్మోహన్‌రెడ్డి మనోపైత్యానికి అద్దంపడుతోంది. గత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగి ఉంటే నిర్దుష్టమైన అంశాలపై విచారణ జరిపించడం ఏ ప్రభుత్వానికైనా సహజం. అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై విచారణ చేయాలనుకోవడం, అందుకు పది మంది పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం’
ఆర్‌కే చెప్పినట్టు నిర్ధిష్టమైన అవినీతిపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసి ఉంటి బాగుండేది. అలా కాకుండా మొత్తం చంద్రబాబు ఐదేళ్ల పాలనపై సిట్ వేయడం అంటే…జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలకు బలం వస్తుంది. ఈఎస్ఐలో భారీ స్కామ్‌పై విజిలెన్స్ విచారణ చేసి, వాస్తవాలు బయట పెట్టినట్టుగానే, మిగిలిన వాటిపై కూడా అలా చేసి ఉంటే బాగుండేది.
‘ఇలా ఒక ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై మరో ప్రభుత్వం గంపగుత్తగా విచారణ జరిపించడం వల్ల అరాచకం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. ఇంకో మూడు నెలలు పోతే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకుంటుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. ప్రభుత్వ వాలకం చూస్తూ ఉంటే పెట్టుబడిదారులను ప్రోత్సహించే ఆలోచన కూడా లేనట్టుగా ఉంది’
ఆర్‌కే చెప్పాడా, మరెవరో చెప్పారా అనే విషయాన్ని పక్కన పెడితే…ఈ మాటల్లో నిజం ఉంది. ఇలా ఐదేళ్ల పాలనపై జగన్ సర్కార్ విచారణకు దిగితే, ఆ తర్వాత వచ్చే సర్కార్…..తిరిగి జగన్ సర్కార్ పాలనపై దర్యాప్తు చేయకుండా ఉంటుందా? దీనికి అంతం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషపూరిత వాతావరణం ఉంటే పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు? కోరికోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి ఎవరు మాత్రం ఆసక్తి చూపుతారు! ఆర్‌కే ప్రశ్నిస్తున్నట్టు…మరో మూడునెలల్లో జగన్ పాలనకు ఏడాది కాలం పూర్తవుతుంది. మరి ఇంత వరకు కనీసం ఒక పరిశ్రమనైనా తీసుకొచ్చే యత్నం జగన్ సర్కార్ చేసిందా? ఆర్‌కే అంటున్నట్టు జగన్ సర్కార్ వాలకం చూస్తే, పెట్టుబడిదారులను ప్రోత్సహించే ఉద్దేశం కూడా లేనట్టే కనిపిస్తోంది.
మూడు రాజధానులపై చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ చేస్తున్న వాదనలో బలం లేదు. అయితే మూడు రాజధానులు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజలు మళ్లీ తనకే పట్టం కడతారని జగన్ భావిస్తూ ఉంటే, అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. జగన్ నుంచి ఇలాంటి పాలనను ప్రజలతో పాటు మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఆశించడం లేదు. ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో లాక్కుంటున్నట్టుగా జగన్ పాలన ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
అలాగే వైసీపీ కేడర్‌ను విస్మరించడం అన్నింటికంటే పెద్ద తప్పు. గతంలో చంద్రబాబు చేసిన తప్పును జగన్ కూడా ఫాలో అవుతున్నాడు. చంద్రబాబు తప్పుల నుంచి గుణపాలం నేర్వాల్సిన జగన్….చంద్రబాబుకు మించి తప్పులు చేస్తూ టీడీపీ బలోపేతానికి దారి ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికైనా జగన్ సర్కార్ మేల్కొనకపోతే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే వైసీపీ కేడర్ జగన్ కోసం పనిచేసేందుకు ఏ మాత్రం సన్నద్ధంగా లేదు.
ఏది ఏమైనా ఈ వారం జగన్ పాలనా విధానాలపై ఆర్టికల్ రాసేందుకు ఆర్‌కేలోని జర్నలిస్టు బతికి బయటికొచ్చినందుకు అభినందనలు. మున్ముందు కూడా బాబుపై బలహీనతల్ని అధిగమిస్తూ నిర్మాణాత్మక విమర్శలు, సూచనలు తెలియజేస్తూ ఆర్‌కే రాతలు కొనసాగాలని ఆశిస్తూ….