కరోనా సెకెండ్ వేవ్ విలయతాండం సృష్టిస్తోంది. ఎప్పుడెవర్ని బలి తీసుకుంటుందో చెప్పలేని దయనీయ స్థితి. నిన్నటికి నిన్న ఏపీలో పలువురు సీనియర్ జర్నలిస్టులను కరోనా మహమ్మారి నిర్దాక్షణ్యంగా బలి తీసుకుంది. కొందరి ప్రాణాలను బలి తీసుకుంటుండగా, మరికొందర్ని ఆర్థికంగా దివాళా తీయిస్తోంది.
సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ గారిని బలి తీసుకుందనే సమాచారం జర్నలిస్టు లోకానికి తీరని క్షోభను మిగిల్చింది. ఈ చేదు వార్త తడి ఆరకనే కడప నుంచి మరో దిగ్భ్రాంతికర వార్త. సాక్షి జర్నలిస్టు ప్రభాకర్‌రెడ్డిని కరోనా బలి తీసుకుందని. పులివెందుల నియోజక వర్గంలోని వేముల నివాసైన ప్రభాకర్‌రెడ్డి జర్నలిజంపై ఇష్టాన్ని పెంచుకుని, ఆ రంగంలో రెండు దశాబ్దాలకు పైబడి కొనసాగుతున్నారు.
వ్యవసాయ వార్తా కథనాలు, వామపక్ష ఉద్యమ వార్తలను రాయడంలో ప్రభాకర్‌రెడ్డి నిబద్ధత అందర్నీ ఆకట్టుకునేది. అలాంటి ప్రభాకర్‌రెడ్డిని కరోనా బలి తీసుకోవడం షాక్‌కు గురి చేసింది. ఈ విషాదంలో మునిగి ఉండగా, తిరుపతికి చెందిన మరో జర్నలిస్ట్ మిత్రుడు ఆదిమూలం శేఖర్ నుంచి ఓ తీపి కబురు.
కరోనా బారిన పడిన శేఖర్ గత రెండు వారాలుగా తిరుపతిలో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వారం క్రితం నాకు మెసేజ్ పెట్టాడు. దీంతో భయమేసింది. అలాంటి మిత్రుడి నుంచి నిన్న రాత్రి మనసును తేలికపరిచే ఫోన్ కాల్. తాను రికవరీ అయ్యానని, రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను.
తెల్లారగానే శేఖర్ సంబంధీకుల నుంచి మరో కాల్. ఆస్పత్రి బిల్లు రూ.2.60 లక్షలని. ఓ మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన శేఖర్ అంత మొత్తంలో ఎలా కట్టగలరు? ఇది కేవలం ఒక్క శేఖర్‌కు సంబంధించిన ఆవేదనే కాదు… ప్రతి ఒక్కరిదీ. డబ్బున్న వాళ్ల సంగతి వేరు. జబ్బు కంటే దానికయ్యే డబ్బే సామాన్యులను భయపెడుతోంది. ఆరోగ్యాన్ని లక్షలకు లక్షలు పోసి కొనుక్కోలేని వాళ్లకు చావే శరణ్యమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం.
ఇది నిజం. ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రకటిస్తున్నట్టు కరోనాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, పైసా కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదని, ఒకవేళ ఏ వైద్యశాల అయినా రోగుల నుంచి బిల్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పే మాటలు, చేసే హెచ్చ రికలు… అన్నీ ఉత్తుత్తివే. ఎవడి చావు వాడు చావాల్సిందే తప్ప …సామాన్యులను పట్టించుకునే దిక్కే లేదు. ఈ కఠిన వాస్తవాన్ని కరోనా పదేపదే నిరూపిస్తోంది. దీనికి మన జర్నలిస్టు మిత్రుడు ఆదిమూలం శేఖర్ ఉదంతమే నిదర్శనం.
కరోనా బారిన పడ్డవాళ్లు సాధ్యమైనంత వరకూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మొదట కరోనా అంటే భయం వీడాలి. ఎందుకంటే కరోనా కంటే ఘోరమైన ప్రజాప్రతినిధులు, పాలకులు, మనుషుల మధ్య జీవిస్తున్న మనం …కరోనా వైరస్ అంతకంటే ప్రమాదకరమైందని భావించడం అవివేకమే. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా కోలుకుంటారని వైద్యులు, కరోనాను ఎదుర్కొన్న జర్నలిస్టు మిత్రులు చెబుతున్న మాట. అంతెందుకు ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలను ఒకసారి చూస్తే …మనం ఎందుకు వాటికి దూరంగా ఉండాలో అర్థమవుతుంది.
కాలుతున్న కరోనా శవాలు, స్మశానంలో ఆరని మంటలు, బెజవాడలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి, పలాసలో తండ్రీకొడుకుల మృతి, సచివాలయంలో భార్యభర్తల మృతి …ఇలా అనేక రకాల భయపెట్టే వార్తలు మన కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా కామెడీ సినిమాలో, ఇతరత్రా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ … కరోనా మహమ్మారి విషయాన్ని మరిచిపోతే త్వరగా కోలుకునే అవకాశం ఉందని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇది నిజమే. కరోనా వచ్చిన తర్వాత బాధ పడడం కంటే, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్యం. కళ్లెదుట మిత్రుల ఆర్తనాధాలను హెచ్చరికగా తీసుకుని మనల్ని మనం కాపాడుకోవడమే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. ఎందుకంటే, ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే భ్రమలను వీడి, వాస్తవంలోకి రావాల్సిన అవసరాన్ని కరోనా ఓ గుణపాఠంగా నేర్పుతోంది.
సొదుం రమణ