ఏపీలో రాజకీయాలకు కొదవ లేదు. ఆ మాటకు వస్తే రాజకీయాలకు అర్ధాలే మారిపోతున్న రోజులు ఇవి. ఒక విమర్శ చేశామంటే అందులో విషయం ఉండాలని గతంలో నేతలు అనుకునేవారు. ఇపుడు పసలేని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ని కొందరు టార్గెట్ చేశారు. ఆమె ఎస్టీ కాదు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆఖరులు కోర్టు దాకా కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్ళారు. నిజం చెప్పాలంటే ఇది ఇవాళ్టిది కూడా కాదు. 2014 నుంచే ఆమె ఎస్టీ కాదంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికి రెండు సార్లు కురుపాం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా రెండేళ్ళుగా ఉంటున్న పుష్ప శ్రీవాణి తనపైన వస్తున్న ఈ తరహా విమర్శలకు తనదైన శైలిలోనే జవాబు చెప్పారు. నేను పక్కా ఎస్టీని. కొండదొర సామాజికవర్గం మాది. ఇందులో రెండవ మాటకు అసలు తావు లేనే లేదు.
పైగా దానికి ఆధారమైన దృవపత్రాలు అన్నీ కూడా మా వద్దనే ఉన్నాయి. మా కుటుంబం గురించి పూర్తి సమాచారం కావాలంటే పాలకొండలోని టీకే పారాపురానికి వెళ్ళి పూర్తి దర్యాప్తు చేసుకోవచ్చు అని కూడా సవాల్ విసిరారు. అక్కడ మా నాన్న ఉద్యోగం చేసేవారు అంటూ మొత్తం వివరాలు కూడా ఇచ్చారు.
నా మీద ఎందుకీ నిరాధార ఆరోపణలు, వీటిలో ఏ ఒక్కటి అయినా నిరూపించగలరా అంటూ ఆమె నిలదీశారు. మొత్తానికి ఆమెను మంత్రి పదవికి, ఎమ్మెల్యే గిరీకి కూడా రాజీనామ చేయమని కొంతమంది చేస్తున్న డిమాండ్ కి చెక్ పెడుతూ పుష్ప శ్రీవాణి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరి దీనితో అయినా ప్రత్యర్ధులు ఆగుతారా.