వెనెజులాకు చెందిన జువాన్ పెరెజ్ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అతడి పేరును ప్రకటించింది. ప్రస్తుతం పెరెజ్ వయసు 112 సంవత్సరాలు. ఇంతకుముందు స్పెయిన్ కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ రికార్డ్ ఉండేది. 113వ పుట్టినరోజుకు సరిగ్గా నెల రోజుల ముందు అతడు మరణించడంతో.. ప్రపంచంలోనే అతి పెద్ద వయసున్న వ్యక్తిగా పెరెజ్ నిలిచాడు.
ఈ శతాథిక వృద్ధుడు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉన్నాడు. తన బాల్యం, వివాహం అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. తన తోబుట్టువులు, మనవలు, ముని-మనవల పేర్లతో పాటు 80 ఏళ్ల కిందట జరిగిన రాజకీయ పరిణామాల్ని కూడా విడమర్చి చెబుతున్నాడు.
1909, మే 27న పశ్చిమ టచిరా రాష్ట్రంలో జన్మించిన పెరెజ్, ఐదేళ్లకే రైతుగా మారాడు. కాఫీ, చెరకు తోటల్లో తల్లిదండ్రులకు సహాయం చేసేవాడు. జీవితం మొత్తం వ్యవసాయంలోనే బతికాడు. కాస్త పెద్దయ్యాక తను పెరిగిన పట్టణంలో భూవివాదాలు పరిష్కరించే షరీఫ్ గా పనిచేశాడు.
తన ఆరోగ్య రహస్యాన్ని కూడా బయటపెట్టాడు పెరెజ్. నిత్యం శారీరకంగా కష్టపడడం, శెలవుల్లో విశ్రాంతి తీసుకోవడం, త్వరగా పడుకోవడం, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం, దేవుడిపై ప్రేమతో ఉండడం తన ఆరోగ్య రహస్యాలుగా చెప్పుకొచ్చాడు.
ఇక మహిళల్లో భూమిపై బతికున్న అతి పెద్ద వయసు మహిళగా లూసిల్ రాండన్ నిలిచారు. ఫ్రాన్స్ కు చెందిన ఈ మహిళ వయసు ప్రస్తుతం 118 సంవత్సరాలు.