కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అంతటా ఇవాళ్టి నుంచి థియేటర్లు మరోసారి మూతపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసొసియేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం నుంచి వకీల్ సాబ్ సినిమాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా పేరు తెచ్చుకున్న వకీల్ సాబ్ కు మాత్రం ఈ వారాంతం వరకు మినహాయింపు ఇచ్చారు. అంటే ఇంకో 5 రోజులన్నమాట. సోమవారం నుంచి ఈ సినిమాను కూడా ఎత్తేస్తారు. అయితే ఊహించని విధంగా కొంతమంది థియేటర్ యజమానులు వకీల్ సాబ్ సినిమాకు మినహాయింపు అక్కర్లేదని కూర్చున్నారు. ఇవాళ్టి నుంచి వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లను కూడా మూసేస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో ఉగాది సందర్భంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. అంతే, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. గడిచిన శని, ఆదివారాల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని భావిస్తే అది కూడా జరగలేదు.
దీంతో తమకు ఎలాంటి మినహాయింపులు అక్కర్లేదంటూ ఈరోజు నుంచి వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లను కూడా కొన్నింటిని మూసేస్తున్నారు. వీటిలో మల్టీప్లెక్సులు కూడా ఉన్నాయి.
వకీల్ సాబ్ సినిమాకు హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఉన్న ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ లో నిన్న కేవలం 20 మంది ప్రేక్షకులు వచ్చారు. ఇక నగరం నడిబొడ్డున ఉన్న మరో మల్టీప్లెక్స్ లో అటుఇటుగా పాతిక మంది ప్రేక్షకులు వస్తే షో రద్దు చేశారు. కనీసం కరెంట్ బిల్లు డబ్బులు కూడా రావట్లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్ లో జనాలు వస్తారేమో అనే భ్రమతో అప్పటివరకు సినిమాను కొనసాగించడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి యాజమాన్యాలు. సో.. ఇవాళ్టి నుంచి ఒకటి అర థియేటర్లు తప్ప మిగతావన్నీ మూతపడబోతున్నాయి. ఆ కొద్దిపాటి థియేటర్లు కూడా నిర్మాత దిల్ రాజువనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.