కరోనా టెర్రర్.. చేజారిన గుంటూరు

గుంటూరులో మరోసారి కరోనా కోరలు చాచింది. గతేడాది వచ్చిన కరోనాతో విలవిల్లాడిన ఈ ప్రాంతం, సెకెండ్ వేవ్ లో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎంతలా అంటే కరోనా పరీక్షలు చేయలేక అధికారులు చేతులెత్తేశారు.…

గుంటూరులో మరోసారి కరోనా కోరలు చాచింది. గతేడాది వచ్చిన కరోనాతో విలవిల్లాడిన ఈ ప్రాంతం, సెకెండ్ వేవ్ లో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎంతలా అంటే కరోనా పరీక్షలు చేయలేక అధికారులు చేతులెత్తేశారు.

కరోనా లక్షణాలతో వెల్లువెత్తుతున్న ప్రజలందరికీ పరీక్షలు చేయడం అధికారుల వల్ల కావడం లేదు. అప్పటికే 10వేల పరీక్షల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో తాకిడి తట్టుకోలేక నిన్నంతా పరీక్షలు చేయడం నిలిపేశారు. లక్షణాలున్న ప్రజలంతా హోం ఐసొలేషన్ లో ఉండాలంటూ బోర్డులు పెట్టేశారు.

మరోవైపు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. కరోనా పరీక్షలు చేయకుండానే వీళ్లను చేర్చుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి అదనంగా మరో 5 సెంటర్లు ఏర్పాటుచేసి, సిబ్బందిని నియమించి పరీక్షలు చేయడానికి సన్నద్ధమయ్యారు.

ప్రస్తుతం గుంటూరులో పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రతి 4 టెస్టుల్లో ఒక పాజిటివ్ కనిపిస్తోంది. దీంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించి, పాక్షిక లాక్ డౌన్ విధించింది.

రేపట్నుంచి గుంటూరులో 15 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత అన్ని షాపులు మూసేయాల్సిందే. ఇక 25వ తేదీ నుంచి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. మెడికల్ షాపులు, ల్యాబులకు మినహాయింపు ఉంది.

ప్రస్తుతం జిల్లాలోని రూరల్ ప్రాంతాలకు కరోనా వ్యాపించింది. ఎంతోమంది బాధితులు టెస్టుల కోసం సమీప కరోనా పరీక్ష కేంద్రాలకు వెళ్లడం లేదు. లక్షణాలు వచ్చిన వెంటనే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం లేదా ప్రైవేట్ వైద్యుడి సహాయంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎంతమంది కరోనా రోగులున్నారనే విషయాన్ని లెక్కకట్టడం కూడా అధికారులకు సమస్యగా మారింది.