శ్రీరాముడి పేరు వింటే చాలు ఓ ఆదర్శ రూపం మనో నేత్రం ఎదుట ఆవిష్కృతమవుతుంది. ఏకపత్నీవ్రతునిగా, తండ్రి మాటను జవదాటని పుత్రుడిగా భారతీయుల హృదయాల్లో శ్రీరామచంద్రుడు చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే సుభిక్షమైన పాలనకు శ్రీరాముడే నేటికీ ఆదర్శం, అనుసరణీయం. సకల గుణాభిరాముడైన ఆయన నీడలా హనుమంతుడు కూడా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నారు.
నమ్మకం, విశ్వాసం, భక్తికి పర్యాయపదంగా హనుమంతుడికి విశిష్టస్థానం ఉంది. అలాంటి హనుమంతుడి జన్మస్థానంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. తిరుమల గిరులను అంజనాద్రిగా పిలుచుకుంటున్నామే తప్ప, ఆ పేరు ఎందుకొచ్చిందో ఆలోచించిన వాళ్లు చాలా తక్కువే. కానీ ప్రస్తుత పాలక మండలితో పాటు కీలక అధికారి ఆ విషయమై దృష్టి సారించడంతో హిందువులంతా గర్వపడే మహత్తర రహస్యానికి సమాధానం దొరికింది.
శ్రీరాముని నమ్మిన బంటు, భక్తి, విశ్వాసాలకు మరో రూపమైన హనుమంతి జన్మ స్థలిపై నెలకున్న అపోహలు, అనుమానాలకు తెరదించుతూ, నేడు ఓ చరిత్రాత్మక ఆవిష్కరణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టనుంది.
హనుమంతుని జన్మస్థానం కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండలే అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించనుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రోత్సాహం, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్సాహం, పట్టుదల, భక్తిప్రపత్తులు తోడై హనుమంతుని జన్మస్థలంపై ఓ స్పష్టత రానుంది.
తిరుమలకు, ఆంజనేయుడికి అవినాభ సంబంధం
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత , ఆలయానికి సమీపంలోని జాపాలితీర్థానికి వెళ్లాలని ఆసక్తి చూపుతారు. కృత యుగంలో తిరుమల కొండను వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వెంకటాచలంగా భక్తులు పిలుచుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు.
ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో నాలుగు యుగాల్లో నాలుగు పేర్లతో తిరుమల గిరులను పిలుచుకుంటారని మహర్షులు రాసిన పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరుతో ఏడుకొండల స్వామిని భక్తులు పిలుచుకునే వారు. ఇందుకు గల కారణాలను, విశిష్టతను భావిశోత్తర పురాణంలోని మొదటి అధ్యాయం లోని 79వ శ్లోకం నుంచి హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి తెలియజేస్తోంది.
ఆంజనేయుని జన్మస్థలమే జాపాలి
తిరుమల గిరుల్లో జాపాలి ప్రాంతాల్లో హనుమంతుడు జన్మించినట్టు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడి జన్మ స్థల విశిష్టతను తరతరాలు గుర్తించుకునేలా అక్కడ హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలసి శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించి స్వామి వారి సేవలు చేసేవారట.
శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి, ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉండడం గమనార్హం.
శ్రీవారి ఆలయానికి ఎదురుగా బేడి ఆంజనేయస్వామి
తిరుమల శ్రీవారి ఆలయానికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో బేడి ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడి సేవకుడిగా భక్తుల పూజలందుకుంటున్న హనుమంతుడు, ప్రస్తుతం కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడే రాముడిగా భావించి ఆయనకు ఆంజనేయుడు సేవ చేస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
భగవంతునికి భక్తుడు ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉంటారనేందుకు ప్రతీకంగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉండడం విశేషం.
శభాష్ జవహర్‌రెడ్డి
టీటీడీలో ఎంతో మంది ఈవోలుగా సేవలందించారు. అయితే ఎవరి ప్రత్యేక వారిది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే హనుమంతుని జన్మ రహస్యాన్ని ఛేదించేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కేఎస్ జవహర్‌రెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీవారి పరమ భక్తుడు, సేవకుడైన హనుమంతుని జన్మ రహస్యాన్ని ఛేదించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహకారం కూడా తోడు కావడంతో ఆయన ఆశయం నెరవేరడానికి మార్గం సులువైంది.
హనుమంతుని జన్మ స్థలానికి సంబంధించి వివిధ స్థల పురాణాలు, ఆగమశాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలను పరిశోధించే ప్రక్రియ జహవర్‌రెడ్డి నేతృత్వంలో వేగవంతం చేశారు. హనుమ జన్మ స్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్జీ హనుమథ్ ప్రసాద్ రచించిన శ్రీపరాశర సంహిత గంథాన్ని రచించారు. స్కంధ పురాణంలోను ఈ గ్రంథమే ప్రామాణికమని ప్రస్తావించినట్లు పురాణాలూ చెపుతున్నాయి.
ఎట్టకేలకు అనేక పరిశోధనల తర్వాత ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల గిరుల్లోని జాపాలి ప్రాంతమని ఆధారాలను సేకరించారు. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణకు రామయ్య తండ్రి అని భక్తితో హనుమంతుడు పిలుచుకునే శ్రీరామ నవమిని పురస్కరించుకుని టీటీడీ ప్రకటిస్తుండడం సదా చిరస్మరణీయం.
సొదుం రమణ