చాలా రోజులుగా అనుకుంటున్నా, వాయిదా పడుతూ వచ్చిన పని యివాళ ప్రారంభమవుతోంది. ఇకపై నా పాత ఆర్టికల్సన్నీ ఎమ్బీయస్ బ్లాగ్ అనే చోట లభ్యమవుతాయి. వాటితో పాటు క్రమేపీ నా యితర రచనలూ అక్కడే పొందుపరచాలని ఐడియా. సాధారణంగా వెబ్‌సైట్‌లలో వచ్చే సమాచారం మరుసటి రోజుకి చద్ది కంపు కొడతాయి. కానీ నాది కాలమ్ కావడంతో, నేను రాజకీయాలతో పాటు అనేక విషయాలపై రాయడంతో నా పాత ఆర్టికల్స్ చదివేవారు పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఆర్టికల్ నచ్చినపుడు ప్రింట్ ఔట్ తీసి పెట్టుకుందామనుకుని అలక్ష్యం చేసినవారు, ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకు వచ్చి ‘భగవద్గీత మీద మీరు అయిదారేళ్ల క్రితం రాసిన ఓ ఆర్టికల్ చదివినట్లు గుర్తు. ఇప్పుడది అర్జంటుగా కావాలి. నాకు సెపరేటుగా పిడిఎఫ్ పంపగలరా?’ అని నన్ను రిక్వెస్టు చేసినవారు కోకొల్లలు.
నిజానికి గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ వారు వేరెవ్వరూ చేయనట్లుగా నా ఆర్టికల్స్‌ను ఆర్కయివ్స్‌లో భద్రపరచి అందిస్తున్నారు. ఎమ్బీయస్ బటన్ నొక్కితే నా పాత ఆర్టికల్స్ 133 పేజీల్లో వున్నట్లు కనబడుతుంది కానీ 65 పేజీల వరకే వున్నాయి. అంటే 11 10 2013 నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. నేను 2009 నుంచి రాస్తున్నాను. అనేక సీరియల్స్ రాశాను. అవన్నీ దొరకవు. టెక్నాలజీ మారడంతో పాతవి పెట్టడం అసాధ్యమై పోయింది. కొందరు రాజీవ్ హత్య 32వ భాగం నుంచి కనబడటం లేదనో, తమిళ రాజకీయాలు 32 ముందు కనబడలేదనో ఫిర్యాదు చేస్తూంటారు. కొత్త ఆర్టికల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడమే పెద్ద పని. ఇక పాతవాటి గురించి సతాయిస్తే మర్యాద కాదు. అందువలన చాలామంది పాఠకులు పాత ఆర్టికల్స్ గురించి వెతికి, విసిగి, నన్ను నిందించి ఊరుకున్నారు.
అయితే ఎమ్.ఎన్.రెడ్డి (కెన్యా వాసి) అనే పాఠకుడు మాత్రం అలా వూరుకోలేదు. ఆయన ఒక పీరియడ్ నుంచే ప్రింట్‌ఔట్‌లు తీసుకుని భద్రపరచుకున్నాడట. దానికి ముందువి ఏవి అని నన్ను సతాయించాడు. ‘అవన్నీ పాత ఫార్మాట్‌లో వున్నాయి, కొత్తదానికి మార్చాలంటే పెద్ద శ్రమ.’ అని చెప్పి చూశాను. ‘నేను మనుష్యులను పెట్టి ఫార్మాట్ మార్పిస్తాను. మీరు ఆ వ్యాసాలకు ఇండెక్స్ అదీ తయారు చేయండి.’ అని అభిమానంతోనే పురమాయించాడు. సాధ్యమైనంతకాలం బద్ధకించి, ఆయన పోరు పడలేక మూడు నెలలకు ఒక ఫైలుగా తయారు చేసుకుంటూ పోయాను. అంటే 2009 ఉందనుకోండి. జనవరి నుంచి మార్చి Q1, ఏప్రిల్ నుంచి జూన్ Q2.. అలాగన్నమాట. ఇవన్నీ యూనికోడ్‌లో వుంటాయి. వీటిలో సెర్చింగ్ యీజీ. కానీ ప్రింట్ తీస్తే అందంగా రాదు. అందువలన ఇదే ఫైల్‌ను అను7లోకి మార్చి, పిడిఎఫ్ కూడా లభ్యం చేశామన్నమాట.
2009 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాల ఆర్టికల్స్‌కు ఏడాదికి 4 యూనికోడ్, 4 పిడిఎఫ్ చొప్పున ఫైళ్లు ఈ బ్లాగ్‌లో దొరుకుతాయి. ఫైలు మొదట్లో ఆ క్వార్టర్‌లో రాసిన ఆర్టికల్స్ జాబితా వుంటుంది. అది చూస్తే మీకు కావలసినది దానిలో వుందో లేదో తెలిసిపోతుంది. అంతేకాకుండా వర్డ్ ఫైల్ కాబట్టి ‘ఫైండ్’ ఆప్షన్ ఎంచుకుని అక్కడ భగవద్గీత అని తెలుగులో టైపు చేస్తే (తెలుగులో టైప్ చేయడానికి జీమెయిల్‌లో కుడివైపు పైన ఇన్‌పుట్ టూల్స్ (పెన్ను బొమ్మ)లో తెలుగు ఎంచుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేస్తున్నట్లుగా టైపు కొట్టి దాన్ని కాపీ చేసి యిక్కడ పేస్ట్ చేయవచ్చు) ఆ ఫైల్ మొత్తంలో ఆ మాట ఎక్కడెక్కడుందో అదే కనిపెట్టి చూపించేస్తుంది.
నేను మోతీలాల్ తండ్రి ముస్లిమా కాదా అని ఒక ఆర్టికల్ రాశాను. అది మళ్లీ చదవాలని మీకనిపిస్తే మీరు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ‘ఎమ్బీయస్: మోతీలాల్’ అని టైపు చేస్తే 2016లో ఆ ఆర్టికల్ రాసినట్లు చూపించేస్తుంది. అయితే నేను ఆ ఆర్టికల్‌కు మోతీలాల్ అని శీర్షిక పెట్టకుండా ‘ఒక స్వాతంత్ర్యయోధుడి గురించి పుకార్లు’ అని కాప్షన్ పెట్టాననుకోండి. అయిదేళ్లు పోయాక ఆ హెడింగ్ ఏమిటనేది మీకే కాదు, నాకూ గుర్తుండదు. మీకు రఫ్‌గా ఐదేళ్ల క్రితం చదివుంటాను అని లీలగా గుర్తుంటే మీరు 2016 క్యూ1 వర్డ్ ఫైల్‌లోకి వెళ్లి ఫైండ్‌లో మోతీలాల్ అని కొడితే ఆ ఫైల్‌లో వున్న దాదాపు 30 ఆర్టికల్స్‌లో ఎక్కడ మోతీలాల్ అని వున్నా అది చూపించేస్తుంది.
మీరు చదివి నచ్చి, ప్రింట్ఔట్ తీసుకుందామనుకుంటే పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి, కావలసిన పేజీ మాత్రం అచ్చు తీసుకోవచ్చు. ఉజ్జాయింపుగా అనుకున్నది తప్పితే అదే ఏడాది క్యూ2 , పక్క ఏడాది క్యూ3… యిలా కాస్త వెతుక్కోవాలి. కావలసినది దొరికితే ఈ పనికి పురికొల్పిన ఎమ్‌ఎన్ రెడ్డిగారికి, వీటిని హోస్ట్ చేసి పెడుతున్న గ్రేట్ ఆంధ్ర పబ్లిషర్ వెంకటరెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పుకోండి. దొరక్కపోతే నన్ను తిట్టుకోండి, ‘పనీపాటా లేదు యితగాడికి … వేలాది వ్యాసాలు రాసి పడేశాడు… సబ్జక్ట్ వైజ్ విడగొట్టి యివ్వవచ్చుగా!’ అని.
మీ బాధ నాకు తెలుసు. దీనిలో ఆర్టికల్స్ కలగూరగంపగా వుంటాయి. సబ్జక్ట్‌వైజ్‌గా విడగొట్టి పెడతానని మలేసియాలో వుండే మరో అభిమాని జె. అశ్వనీదత్ ఆఫర్ చేశారు. అలా చేసి పెడితే 2009-19 వరకు జగన్‌పై రాసిన ఆర్టికల్స్ అన్నీ కలిపి ఒక పుస్తకం వేసినట్లు, ఆ సమయంలో టిడిపి కార్యకలాపాలపై ఓ ఈ-బుక్ తయారు చేయవచ్చు. 2009-20 వరకు పశ్చిమ భారతంపై రాసిన ఆర్టికల్స్‌పై యింకోటి చేయవచ్చు. విదేశీ వ్యవహారాలపై రాసినవాటితో మరోటి చేయవచ్చు.
ఈ ఆర్కయివ్స్ ఆర్టికల్స్‌లో సీరియల్స్ కలపలేదు. వాటిని విడిగా ఈ-బుక్స్‌గా తయారుచేద్దామని ప్లాను. అంటే బైబిల్, రాజీవ్ హత్య, తమిళ రాజకీయాలు, నిజాం కథలు, గోడ్సే, ప్రాణ్, హేమమాలిని, వినోద్ మెహతా.. యిలాటివన్న మాట. సాహిత్యాంశ వున్న కన్యాశుల్కం, మృచ్ఛకటికం, నచ్చిన కథ లాటి వాటితో యింకోటి చేయవచ్చు. ఇలా ఎన్నో ఊహలున్నాయి. ఇవన్నీ ఒకటొకటిగా అదే బ్లాగ్‌లో పెట్టాలని ఆశ.
ఆర్టికల్స్ ఫ్రీగా చదువుకోవచ్చు, అయితే వెతుక్కునే శ్రమ వుంటుంది. ఆ శ్రమ పడనక్కరలేకుండా చక్కగా ఫోటోలతో సహా పుస్తకాలుగా తయారుచేసి యిస్తాం కాబట్టి ఈ-బుక్స్‌ను కొనుక్కోవాలి. 1/8 డెమీ సైజులో ప్రియాంకా 15-15 ఫాంట్‌లో అచ్చు వేసిన పుస్తకాలు రూపాయికి పేజీ చొప్పున అమ్ముతున్నారు. ఈ-బుక్స్ కాబట్టి రూపాయికి 4 పేజీలిద్దామని ప్లాను. అంటే 200 పేజీల పుస్తకాన్ని 50 రూ.లు పెట్టి కొనాలన్నమాట. అది డౌన్‌లోడ్ చేసుకున్నాక యింకోళ్లకు ఫార్వార్డ్ చేయడం లాటివి మొదలుపెడితే యిక పుస్తకాలు ఎవరూ పబ్లిష్ చేసే పనే పెట్టుకోరు. అలా పంపిణీ చేయడం సాహితీసేవ కాదు. పబ్లిషింగ్ పరిశ్రమకు, రచయితకు ద్రోహం. పుస్తకంగా తయారుచేయడానికి వెచ్చించిన శ్రమకు, సమయానికి విలువ దక్కకపోతే పుస్తకాలు చేయడమెందుకన్న విరక్తి కలుగుతుంది కదా!
ఈ-బుక్స్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా వుంటే నేను గతంలో పుస్తకాలుగా ప్రచురించిన పుస్తకాలను (వాటిలో కొన్ని ఔట్ ఆఫ్ స్టాక్) కూడా ఈ-బుక్స్‌గా మార్చి అమ్మకానికి పెట్టాలని ఐడియా. చూద్దాం మీ అదరణ ఎలా వుంటుందో! ఇన్నాళ్లూ నా పాత ఆర్టికల్స్ చదవాలంటే ఆర్కయివ్స్‌లో ఒక్కో పేజీ వెనక్కి వెళుతూ వెతుక్కోవాలి. ఇప్పుడు 30-40 ఆర్టికల్స్ వున్న ఒక ఫైల్ తెరిచి, విషయసూచిక చూస్తే చాలు. ఈ బ్లాగ్ వలన తక్కిన వారి మాట ఎలా వున్నా నాకు ఓ సౌలభ్యం చేకూరుతుంది. నేను రాసినవి రాయలేదని, రాయనివి రాశానని వాదించే పాఠకులను యీ బ్లాగ్‌లోంచి ఎత్తి చూపమని అడగవచ్చు. ఇన్నాళ్లూ ‘మీరు అలా రాశారు’ అని వాళ్లు ఆరోపించడం, ‘లేదు’ అని నేనంటే, ‘అయితే దాని లింకు పంపండి, చూసి చెప్తాను’ అని నాకే పని చెప్పడం జరుగుతూ వస్తోంది. ఆరోపణ చేసినవారే ఆధారాలు సేకరించాలనే ప్రాథమిక సూక్తి మర్చిపోతున్నారు వాళ్లు. పాత ఆర్టికల్స్ దొరకటం లేదు, లేకపోతేనా.. అనేవాళ్లు యికపై అలా అనలేరు.
అలాగే యుపిఏ అవినీతి గురించి నేను రాయలేదు అని ఆరోపించే కొందరు యీ బ్లాగ్‌లోకి వెళ్లి వెతుక్కుని తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. చాలామంది కాప్షన్ చూసి తీర్మానించేస్తూంటారు. కానీ నా విషయంలో అది కుదరదు. ఎందుకంటే నేను ఎక్కడో మొదలుపెట్టి, అనేక విషయాలు చర్చించి, వేరెక్కడో తేలి, చివర్లో మొదటిదానికి ముడి వేస్తాను. ఈ పద్ధతికి ‘కబుర్లు’ అని పేరు పెట్టుకున్నాను. వ(ర)ల్డ్‌స్పేస్ అనే శాటిలైట్ రేడియోలో ఆర్‌జెగా రెండేళ్లు పనిచేసినప్పుడు ‘‘పడక్కుర్చీ కబుర్లు’’ పేర వారంవారం యీ ధోరణిలో మాట్లాడేవాణ్ని. మామూలు వ్యాసాలు బోరుకొడతాయి. ఇలాటివి సరదాగా వుంటాయి. ఈ స్టయిల్ హిట్ కావడంతో ‘‘పడక్కుర్చీ కబుర్లు’’ పేరుతో పుస్తకాలు వేశాను. అవి చూసి యీ వెబ్‌సైట్‌లో కాలమ్ రాయమన్నారు. మొదట్లో ‘‘ఎమ్బీయస్ కబుర్లు’’ అనే అనేవారు. పోనుపోను స్పేస్ సరిపోక ‘ఎమ్బీయస్’తో సరిపెడుతున్నారు.
వ్యాసం రాసినపుడు నేను ‘మన్‌మోహన్ అవినీతిపరుడు’ అని హెడింగ్ పెట్టకపోవచ్చు. చమత్కారం రంగరించాలని మరో హెడింగ్ పెట్టి వుండవచ్చు. అదీ కాకపోతే, పార్లమెంటు సమావేశాలలో రసాభాస గురించి రాస్తూ మధ్యలో ‘అవినీతిలో కూరుకుపోయిన యుపిఏ’ అని రాసి వుండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఆ పాటికే తెలుగు పత్రికలు ఆ సబ్జక్ట్‌పై రాపాడించేసి వుంటాయి. నేను మళ్లీ రాస్తే ఎవరూ చదవరు. పైగా నేను రెగ్యులర్‌గా రాయను. వాయిదాలు వేసి, కొన్నాళ్లు పోయాక రాస్తూ వుండవచ్చు. అందుకని వేరే అంశం మీద రాస్తూ మధ్యలో దీని గురించి నా అభిప్రాయాన్ని చెప్పేస్తాను. అది తెలుసుకుంటే నేను కళ్లు మూసుకున్నానా, చెవులు తెరుచుకున్నానా అనే విషయం మీకు అర్థమై పోతుంది.
ఇప్పుడు యూనికోడ్ ఫైళ్లు లభ్యం చేస్తున్నాను కాబట్టి ‘అవినీతి’ అనో, ‘2జి’ అనో, ‘స్కామ్’ అనో టైపు కొట్టి చూస్తే వాటి గురించి నా అభిప్రాయం ఎలా వెల్లడించానో తెలుస్తుంది. ‘వైయస్ పోయినప్పుడు 20 పేజీలు రాశావు, నువ్వూ ఓ మనిషివేనా?’ అని రెచ్చిపోతూ వుంటాడు ఒకాయన. 11 ఏళ్ల క్రితం రాసిన 20 పేజీల సీరీస్‌లో నేను ఏం రాశానో అక్షరమక్షరం గుర్తుండే అవకాశం లేదాయనకు. ఇప్పుడు దాన్ని చదివే అవకాశం వచ్చింది. చదివి, దానిలో అభ్యంతరకరమైనదేదో చెపితే వాదించవచ్చు. 20 పేజీలు రాయడమే తప్పు అనే ధోరణి వింతగా వుంటుంది.
నేను జగన్‌పై పుస్తకం రాశానని చెపితే ‘పోయిపోయి జగన్ మీద రాయడమేమిటి?’ అని యీసడించిన మా స్నేహితులను ‘నేను పొగుడుతూ రాశానో, తిడుతూ రాశానో, ఏం రాశానో తెలుసుకుని మరీ విమర్శించవచ్చు కదా’ అంటే ‘అంత తీరిక మాకెక్కడిది? అసలు ఆ సబ్జక్టే వేస్టు.’ అని తీర్మానించేశారు. ఔరంగజేబు గురించి రాశావు, నువ్వు దేశద్రోహివి అని యింకొకరి ఘోష, చదవనివాళ్లు నేనేం రాశానో అని కంగారు పడి చచ్చేట్లా! నిజంగా చర్చించ దలచుకున్నవాళ్లు ఈ బ్లాగ్‌ను ఉపయోగించుకుని ఏం రాశానో తెలిసి, దానిలోంచి కోట్ చేస్తూ నాతో చర్చించవచ్చు.
తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఉద్యమం జరిగి, కెసియార్ అధికారంలోకి వచ్చాక మసి పూయడం కాదు, మొత్తం కాయనే మార్చేస్తున్నారు. కెసియార్ తన నిరాహారదీక్షను మధ్యలో మానేయడం, విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తే మళ్లీ మొదలుపెట్టడం, దీక్షా సమయంలో నిమ్స్‌లో ఏ ఆహారం తిన్నారో రికార్డులు బయటపెట్టమంటే బయటకు రాకపోవడం.. యిలాటివి తెలంగాణ ప్రభుత్వపు పాఠ్యపుస్తకాల్లో వుండబోతాయా?
అంతెందుకు, ఆలె నరేంద్ర గురించి, కోదండరాం గురించి, అమరవీరుల గురించి రాస్తున్నారా? హైదరాబాదులో సమైక్యవాదుల సమావేశాలపై జరిపిన దాడుల గురించి, టాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత గురించి రాస్తున్నారా? 2009 నుండి ఉద్యమం తీరుతెన్నులపై వ్యాఖ్యానిస్తూ, విభజన వాదుల వాదనల్లోని అసత్యాలను, అతిశయోక్తులను ఖండిస్తూ నేను రాసిన వ్యాసాలు తెలంగాణ ఉద్యమచరిత్ర రాసేవారికి ఒక రిఫరెన్సుగా తప్పక ఉపయోగపడతాయని నా నమ్మకం. మీ ఆదరణ బాగుంటే అవన్నీ ఈ-బుక్‌గా తెద్దామనీ వుంది.
ఈ బ్లాగ్ (లింకు https://telugu.greatandhra.com/mbsblog/) మీకు ఉపయోగపడుతుందనే ఆశతో..
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)