కరోనా సమయంలో అదనపు ఆటలకూ, బెనిఫిట్ షోలకూ అవకాశం ఇవ్వకపోతే అది ప్రభుత్వం కక్ష సాధింపు చర్య. ఒకవేళ ఇదే సమయంలో థియేటర్లన్నింటినీ బంద్ చేయించి ఉంటే జగన్ ప్రభుత్వం అది పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయం అయ్యేది! ఈ మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు జాయింటు రాజకీయం చేసేవి.
ఏతావాతా పవన్ కల్యాణ్ నీతి సూత్రం ఏమిటంటే.. ఆయన సినిమాలకు అనుమతులు ఇవ్వాలి, మిగతావాటన్నింటినీ కరోనాకు భయపడి మూసేయాలి. వాటిల్లో విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశించే పరీక్షలు కూడా ఉన్నాయండోయ్!
మూడు గంటల పాటు ఏసీలో కూర్చుని.. ఎవరు దగ్గినా, ఎవరు తుమ్మినా అదే గాలి పీలుస్తూ.. మాస్కులు పక్కన పెట్టి, కేరింతలు కొడూతూ, అరిచేవాడు అరుస్తూ, ఎగిరేవాడు ఎగురుతూ సాగే సినిమా ప్రదర్శనకు మాత్రం అనుమతి ఇవ్వాలి. అదే జీవిత కాలం చెప్పుకునే మార్కులు, భవిష్యత్తు చదువులను ప్రభావితం చేసే పరీక్షలను మాత్రం రద్దు చేయాలి!
పరీక్షలను ప్రభుత్వం చాలా పక్కా ఏర్పాట్లతో నిర్వహిస్తుంది. గత ఏడాదే కర్ణాటక ప్రభుత్వం పలు పరీక్షలను నిర్వహించింది. అలాగే ఇటీవలే ఏపీలో ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. అయితే అప్పుడు కూడా దాన్ని ఆపాలని పవన్ కల్యాణ్ కోరలేదు! ఎన్నికలు జరగాలి, తన సినిమాలను ఆడనివ్వాలి, అదే పరీక్షలు అంటే మాత్రం రద్దు చేయాలి!
థియేటర్ల వద్ద కరోనా ప్రమాణాలను ఏ మేరకు పాటిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. సినిమా హీరోల అభిమానులు అంటే వారు రౌడీలకు ఎక్కువ, దాదాలకు తక్కువ అన్నట్టుగా ఉంటారు థియేటర్ పరిసరాల్లో. వారిని మాస్కులు వేసుకొమ్మని కోరేంత సీన్ కూడా ఏ థియేటర్ యాజమాన్యానికీ ఉండదు.
అలాంటి పరిస్థితుల మధ్యన సాగే తన సినిమా ప్రదర్శనను సమర్థించుకుంటూ, పక్కా జాగ్రత్త చర్యలు తీసుకునే నిర్వహించే పరీక్షలను రద్దు చేయమని బాహాటంగా, ఇంకా చెప్పాలంటే నిస్సిగ్గుగా పిలుపునిచ్చిన పవన్ క్యలాణుడు తన అవకాశవాదం విషయంలో మరో మెట్టు ఎక్కాడు!
ఇంతవరకూ ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో పార్టీతో జతకూడి రాజకీయ స్వార్థాన్ని చాటిన పవన్ కల్యాణ్,ఇప్పుడు ఒకవైపు తన సినిమాను థియేటర్ల మీదకు వదిలి, తన అభిమానులు- ప్రేక్షకులను కరోనా పీడకు వదిలి మరోవైపు విద్యార్థుల పరీక్షలు మాత్రం రద్దు చేయాలని కోరి, గొప్ప నీతినే చాటుకుంటూ ఉన్నాడు.
ఎంత రాజకీయ నేత-ఎంత సినిమా హీరో అయినా మరీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించాలంటే చాలా బరితెగింపు ఉండాలి, పవన్ కల్యాణ్ పూర్తిగా ఆ కేటగిరిలోకి జాయినయిపోయారిప్పుడు!