చాలా నెలల కిందటి నుంచే వినిపిస్తున్న అనుమానం ఇది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2022 సంక్రాంతికే వెళ్లిపోతుంది అన్న విషయం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది అక్టోబర్ కే వస్తుందని యూనిట్ చెబుతూ వస్తోంది.
ఆ దిశగానే వర్క్ నడుస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం వస్తోంది. సినిమాలో కీలకమైన స్టార్లకు కరోనా రావడం, తగ్గడం వంటివి జరిగాయి. ఆచార్య షూట్ కోసం రామ్ చరణ్ గ్యాప్ తీసుకున్నారు.
త్రివిక్రమ్ తో సినిమా వుంటుందని ఎన్టీఆర్ ఏప్రిల్ నెల తన డేట్ లను ఆర్ఆర్ఆర్ ఇవ్వలేదు. అవన్నీ అలా వుంచితే ఇప్పుడు కరోనా ప్రభావం పడనే పడింది.
షూటింగ్ ఏ పరిస్థితుల్లో వుంది, ఇంకా ఎంత వర్క్ బ్యాలన్స్ వుంది లాంటి ధర్మ సందేహాలకు కేవలం రాజమౌళికి తప్ప మరెవరికి సమాధానాలు తెలియవు అన్నది యూనిట్ వర్గాల బోగట్టా. పైగా ఇప్పుడు అక్టోబర్ నుంచి సంక్రాంతికి వెళ్లిపోయినా ఎవ్వరూ అభ్యంతరం చెప్పడానికి వుండదు.
ఎందుకంటే కరోనా అనే కారణం రెడీగా వుంటుంది కాబట్టి. పైగా ఈ టికెట్ రేట్లు సవరించాల్సి వుంది. స్పెషల్ రేట్లు అనుమతించాల్సి వుంది. ఇవన్నీ ఇప్పట్లో జరిగేవి కావు. అందుకే ఆర్ఆర్ఆర్ పక్కాగా టైమ్ తీసుకుని సంక్రాంతికి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ అనుమానం మహేష్ సినిమా సర్కారువారి పాట యూనిట్ కు కూడా కలిగినట్లు బోగట్టా. అందుకే సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమాను అవసరం అయితే ముందుకు తీసుకువచ్చి డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.