వైసీపీ నేతల మనసులో మాటనే బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు బయట పెట్టారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ఆయన మనసులో మాటను దాచుకోలేదు. విష్ణుకుమార్‌రాజు లేవనెత్తిన అంశాలు వైసీపీలో లోతైన చర్చకు దారి తీశాయి. తన సీబీఐ కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకోవడం సర్వత్రా చర్చకు కారణమైంది.
రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను వైసీపీ ఎంపిక చేస్తే, వారిలో ఇద్దరు తెలంగాణ వారు కావడం మరొక చర్చనీయాంశం. పైగా ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలకు ఇంత వరకూ వైసీపీ సభ్యత్వం కూడా లేకపోవడం విశేషం. ఇదిలా వుంటే విష్ణుకుమార్‌రాజు ప్రస్తావించిన అంశాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు వ్యక్తిగత సేవ చేసిన వారికే రాజ్యసభ సీట్లు ఇచ్చారని విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. జగన్ సీబీఐ కేసులు వాదిస్తున్న నిరంజన్‌రెడ్డికి సీటు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాసేవ చేసే వారికి ఇస్తే పది మందికి మేలు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పనులు చేసే వారికి ఇవ్వడం బాధాకరమన్నారు. వైసీపీ అగ్రనేతలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పదవుల పందేరంలో జగన్‌పై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తలపడేందుకు తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేయడంపై కూడా పార్టీలో అసంతృప్తి వుంది. అయితే ధైర్యం చేసి బయటికి చెప్పలేని పరిస్థితి. అలాగే జగన్ వ్యక్తిగత కార్యక్రమాలను పర్యవేక్షించే తలశిల రఘురాంకి గత ఏడాది ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై కూడా విమర్శలున్నాయి.
తాజాగా వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. అంతెందుకు, విజయసాయిరెడ్డి కూడా ఒకప్పుడు జగన్ కంపెనీల ఆడిటర్ అనే విషయాన్ని మరిచిపోకూడదని కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇదే గడపగడపకూ పేరుతో జనం వద్దకెళ్లి తిట్లు, చీవాట్లు తినాల్సి వస్తోందని, ప్రజలతోనూ, వైసీపీతోనూ ఎలాంటి సంబంధం లేకుండా, పైసా ఖర్చు లేకుండా చక్కగా అత్యున్నత చట్టసభలకు వెళుతున్నారనే ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే ఈ దఫా అదానీ, రిలయన్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు రాజ్యసభ సీట్లు అమ్ముకోనందుకు తమ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ను అభినందిస్తున్నామనడం విశేషం. మొత్తానికి వ్యక్తిగతంగా నమ్ముకున్న వాళ్లను జగన్ అందలం ఎక్కిస్తున్నారని అంటున్నారు.