సుకుమార్ సినీ జీవితానికి బీజం వేసిన హీరో!

సుకుమార్ కెరీర్ కు బీజం వేసిన సినిమా ఆర్య. అలా ఆయన సినీ కెరీర్ కు బీజం వేసిన వ్యక్తిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. కానీ సుకుమార్ లో సినిమాలపై ఆసక్తి పెంచిన హీరో…

సుకుమార్ కెరీర్ కు బీజం వేసిన సినిమా ఆర్య. అలా ఆయన సినీ కెరీర్ కు బీజం వేసిన వ్యక్తిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. కానీ సుకుమార్ లో సినిమాలపై ఆసక్తి పెంచిన హీరో ఒకరున్నారు. ఆ హీరోను చూడడం వల్లనే చిన్నప్పట్నుంచి సుకుమార్ కు సినిమాలపై ఆసక్తి పెరిగిందంట. అతడే హీరో రాజశేఖర్.

హీరో రాజశేఖర్ ను చూసిన తర్వాతే తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందని ప్రకటించాడు సుకుమార్. తన సినీ జీవితానికి బీజం వేసిన వ్యక్తిగా రాజశేఖర్ ను చెప్పుకొచ్చాడు.

“సినిమాకు సంబంధించి నాపై మొదటి ముద్ర వేసిన వ్యక్తి రాజశేఖర్. నాకు ఊహతెలిసిన తర్వాత మొట్టమొదటిసారి నేను అనుకరించిన హీరో రాజశేఖర్. దాంతోనే నేను ఫేమస్ అయ్యాను. స్కూల్ లో అంతా నన్ను రాజశేఖర్ ను ఇమిటేట్ చేయమని అడిగేవారు. అలా ఫేమస్ అయ్యాను. సినిమాతో నాకు తొలిసారి ఓ అనుబంధం ఏర్పడ్డానికి కారణం రాజశేఖర్.

ఇలా చిన్నప్పుడు తన సినిమాలకు, రాజశేఖర్ తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నాడు సుకుమార్. ఈ విషయాన్ని ఎన్నో సార్లు తను చెప్పాలనుకున్నానని, కానీ ఎప్పుడూ అలాంటి సందర్భం రాలేదని చెప్పిన సుకుమార్, శేఖర్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికగా ఆ సందర్భం కుదరడంతో బయటపెట్టానన్నాడు.

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళీ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ, మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.