నారావారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. జగన్ ప్రభుత్వానికి మరో రెండేళ్ల గడువు వుంది. అయితే ఇక పాలించలేనని గ్రహించి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని, పార్టీ శ్రేణులు సిద్ధంగా వుండాలని చంద్రబాబు సూచించడం విశేషం. ముందస్తుకు శ్రేణులు సిద్ధం కావడం పక్కన పెడితే, అసలు రెడీగా వుండాల్సింది ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబు సరదా తీర్చాలని వైఎస్ జగన్ ముందుకొచ్చి ముందస్తు ఎన్నికలకు వెళితే? పరిస్థితి ఏంటి? చంద్రబాబు అధికారంలో వున్నప్పుడే ప్రతి నియోజకవర్గానికి సరైన అభ్యర్థిని నిలబెట్టుకోలేని దుస్థితిని గతంలో చూశాం. ఇప్పుడు ప్రతిపక్షంలో వుంటూ నానా తిప్పలు పడుతున్నారు. పార్టీలో వున్న వాళ్లెవరు? వారిలో పోటీకి నిలిచే శక్తిసామర్థ్యాలు కలిగిన వారెవరు? అనే చర్చకు తెరలేచింది.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ఇన్‌చార్జ్‌లు లేని పరిస్థితి. ఒకవేళ ఉన్నా పార్టీ పిలుపు మేరకు మొక్కు బడిగా కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప, ప్రజల్లో నిత్యం కనిపిస్తున్న వారెవరని ప్రశ్నిస్తే… వేళ్లపై లెక్కపెట్టగలిగేంత మంది కూడా లేరన్నది వాస్తవం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాదరణ కోల్పోయిన నేతలే టీడీపీకి దిక్కయ్యారు. ఉదాహరణకు ఇవాళ బాదుడేబాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న కడప జిల్లా కమలాపురాన్నే తీసుకుందాం.
పుత్తా నరసింహారెడ్డి నాయకత్వమే టీడీపీకి శాపం. 2004లో కాంగ్రెస్ తరపున పుత్తా నరసింహారెడ్డి కమలాపురంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన 2009, 2014, 2019లలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి ఓడిన నాయకుడే ఇప్పటికీ కమలాపురం ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ పుత్తా నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థి కావడమే జగన్ మేనమామ, ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డికి కలిసొచ్చే అంశం.
కడప విషయానికి వద్దాం. కడప అసెంబ్లీతో పాటు ఎంపీకి పోటీ చేసే టీడీపీ నాయకుడెవరని ప్రశ్నిస్తే జవాబు లేని దుస్థితి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్దాం. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డే దిక్కు. ఇప్పటికి ఆయన నాలుగుసార్లు ఓటమిపాలయ్యారు. 1994,99లో వరుసగా రెండుసార్లు సోమిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత గెలుపంటే ఏంటో ఆయన మరిచిపోయారు. అయినప్పటికీ గెలుపు గుర్రాన్ని చూసుకోవాలన్న ధ్యాస చంద్రబాబులో కరువైంది.
కర్నూలు జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. ఆళ్లగడ్డలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. భూమా కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కడం అధికార పార్టీకి అనుకూలంగా మారింది. విశాఖలో గంటా శ్రీనివాస్ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎన్నికల నాటికి మళ్లీ పార్టీకి చేరువ అవుతారనే ఆశ తప్ప, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచన టీడీపీలో కొరవడింది.
చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరు, సత్యవేడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వ కొరత వెంటాడుతోంది. చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్‌కు ఇంత వరకూ స్థిరమైన నియోజకవర్గమే లేదు. మరోసారి మంగళగిరిలోనే పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. టీడీపీ భవిష్యత్ నాయకుడికే నమ్మకమైన గెలుపు నియోజకవర్గం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి.
అధికార పార్టీపై సహజంగానే వ్యతిరేకత వున్న మాట నిజమే. అలాగని ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సానుకూల పరిస్థితి ఎక్కడ? ఒకవేళ నిజంగానే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే చంద్రబాబు సమాయత్తం కాగలరా? అంటే చెప్పలేని దుస్థితి. టీడీపీలో బోలెడు సరిదిద్దుకోవాల్సిన లోపాలున్నాయి. వాటి గురించి ఆలోచించకుండా ముందస్తు జపం చేయడం ఏంటో చంద్రబాబుకే అర్థం కావాలి.