విజ‌య‌సాయిరెడ్డి కృత‌జ్ఞ‌త…వైసీపీలో చ‌ర్చ‌!

వైసీపీ సీనియ‌ర్ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి రెండోసారి రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకున్నారు. ఇక అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సింది. ఏపీలో నాలుగు రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నాలుగు అధికార పార్టీ…

వైసీపీ సీనియ‌ర్ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి రెండోసారి రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకున్నారు. ఇక అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సింది. ఏపీలో నాలుగు రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నాలుగు అధికార పార్టీ వైసీపీకే ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డిని రెండోసారి కొన‌సాగించేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. విజ‌య‌సాయిరెడ్డి కృత‌జ్ఞ‌తలో చిన్న మార్పు గురించి వైసీపీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కూ చ‌ర్చ‌కు దారి తీసిన ప్ర‌ధాన అంశం ఏంటో తెలుసుకుందాం.

“రెండోసారి నాపై న‌మ్మ‌కం ఉంచి, అచంచ‌ల‌మైన విశ్వాసంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ్య‌స‌భ‌కు పంప‌డం చాలా సంతోషంగా వుంది. వైఎస్ జ‌గ‌న్‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు భార‌త‌మ్మకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా. నాపై ఉంచిన బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తా” అని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులంటూ కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తికి మాత్ర‌మే విజ‌య‌సాయిరెడ్డి కృత‌జ్ఞ‌త‌లు చెప్పడం చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలైన వైఎస్ విజ‌య‌మ్మ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని కొంద‌రు ప్ర‌త్యేకంగా గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ గెలుపు కోసం విజ‌య‌మ్మ అవిశ్రాంతంగా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.

అయినా ఎవ‌రి పేరు చెప్పాలో, చెప్ప‌కూడ‌దో విజ‌య‌సాయిరెడ్డికి తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. అలాంటి వ్య‌క్తే ఏదో కార‌ణంతోనే విజ‌య‌మ్మ పేరు చెప్ప‌కుండా ఉంటార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమోన‌బ్బా… పెద్దోళ్ల వ్య‌వ‌హారం మ‌న‌కెందుకులే అని పార్టీలో కొంద‌రు నేత‌లు అంటుండం గ‌మ‌నార్హం.