మంత్రి అయిన తర్వాత మరింత విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజా. పైగా గడప గడపకు కార్యక్రమంతో ఆమె ఇంకా బిజీ అయ్యారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్కడైనా అర్హులై ఉండి, సంక్షేమ ఫలాలు అందని వారు ఉంటే, వాళ్లకు అక్కడికక్కడే 'నవరత్నాలు' అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నారు రోజా.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రోజా.. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ వృద్ధుడు ఆమెను సమీపించాడు. పింఛను వస్తుందా అని రోజా అడిగారు. తనకు నెల నెలా పెన్షన్ వస్తోందని, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు వృద్ధుడు.
అయితే అక్కడితో ఆగలేదు. తను ఒంటరిగా ఉన్నానని, తనకు పెళ్లికూతుర్ని చూడాలని మంత్రిని కోరాడు. వృద్ధుడి కోరిక విని రోజా ఆశ్చర్యపోయారు. వెంటనే తమాయించుకున్నారు. పింఛను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎలా చేయగలం అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంత్రి అయిన తర్వాత రోజా మరింత చురుగ్గా పనిచేస్తున్నారు. ఓవైపు తన మంత్రిత్వ శాఖ పనులు చూసుకుంటూనే, మరోవైపు తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
గడప గడపకు కార్యక్రమంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రోజా, రైతుల సంక్షేమం కోసం పాటుపడిన నాయకుల్లో అప్పుడు వైఎస్ఆర్ ను చూశానని, మళ్లీ ఇప్పుడు వైఎస్ జగన్ ను మాత్రమే చూస్తున్నానని చెప్పుకొచ్చారు.