రకరకాల సమీకరణాలతో రాజ్యసభ సీటు అలీకి దక్కలేదు. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, మధ్యలో మైనార్టీ మిస్ అయ్యారు. మహిళా కోటా కూడా లేదు. బీసీలకు మరింత దగ్గరయ్యామని నిరూపించుకోడానికి అధినేత అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అలా అలీకి ఆశాభంగం కలిగింది.
2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో అధికారికంగా చేరారు. పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీకి ఆయన మరీ అంత దగ్గరగా లేరు. అలాగని దూరంగానూ లేరు. ఇటీవల సడన్ గా అలీని పిలిపించారు జగన్. ఆయనే నేరుగా రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. అయితే అధికారికంగా అలీ కానీ, వైసీపీ నేతలు కానీ ఈ మాట బయటకు చెప్పలేదు. రాజ్యసభ మాత్రం కన్ఫామ్ అనుకున్నారు.
కట్ చేస్తే.. నిన్నటికి నిన్న నలుగురు పేర్లు ప్రకటించగా అందులో అలీ పేరు మిస్ అయింది. లాయర్ కమ్ సినీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి అవకాశమివ్వడంతో సినీ రంగానికి చెందిన అలీ పేరు మిస్ అయిందని అనుకుంటున్నారు. కానీ రాజకీయ సమీకరణాలతోనే అలీకి ఛాన్స్ దక్కలేదు. ఆ మాటకొస్తే రాజ్యసభ సీటుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర సీనియర్ నేత కిల్లి కృపారాణి కూడా అంతకంటే ఎక్కువ బాధపడాల్సిన సందర్భం.
రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలాంటి నిరాశలు, నిస్పృహలు తప్పవు.. అన్నిటినీ ఓర్చుకుని ఓపికపడితేనే.. ఎప్పటికైనా అందలం ఎక్కే అవకాశముంటుంది.
అలీ భవిష్యత్ ఏంటి..?
రాజ్యసభ సీటు దక్కనంత మాత్రాన అలిగి అలీ, జగన్ కి దూరం జరుగుతారనుకుంటే పొరపాటే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అలీ జగన్ దగ్గరకు వచ్చారు. అలాంటిది ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు, తనకు ఆయన వద్ద మంచి యాక్సెస్ ఉంది, అలాంటిది అలీ పార్టీకి దూరం జరుగుతారనుకోవడం భ్రమ. అయితే అలీ పొలిటికల్ భవిష్యత్ ఏంటనేదే ఆలోచించాల్సిన విషయం.
ప్రస్తుతానికి అలీకి ఇతర పదవులేవీ ఇవ్వకుండా 2024 నాటికి వైసీపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉంచాలనేది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. అంతే కాదు… అలీకి వచ్చే దఫా అసెంబ్లీ టికెట్ కూడా ఇస్తారనే ప్రచారమూ ఉంది. ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి కూడా వరించే అవకాశముంది.
సో.. అలీని ఇప్పటికిప్పుడు రాజ్యసభకు పంపించడం కంటే.. జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఆయన్ను అసెంబ్లీకి పంపించడమే మంచిదని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.