రాయలసీమ ‘కరువు’ తీరే శుభవార్త. కరువుకు పర్యాయపదం రాయలసీమ అని చెప్పుకోవచ్చు. సీమను కరువు అంతగా పట్టి పీడిస్తోంది. అలాంటి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి ప్రపంచ బ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించడం నిజంగా గొప్ప శుభవార్తే.
నిజానికి ప్రపంచ బ్యాంక్ కొత్తగా చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు ఇంత వరకూ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, ఆధునీకరణ, నీటి యాజమాన్య పద్ధతుల అమలు వంటి పనులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తోంది. కానీ, జగన్ సర్కార్ ప్రపంచ బ్యాంక్ అధికారులతో చర్చించి , వారిని కన్విన్స్ చేసింది. ప్రపంచ బ్యాంక్ తన విధానాలను మార్చుకుని భారీ రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చేలా చేయగలిగింది.
రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను(పీపీఆర్) తయారు చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ సూచించింది. రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను ప్రపంచ బ్యాంకుకు పంపేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళిక అమలుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఈ నిధులతో కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా… కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పలుమార్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లు వెచ్చించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలించనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రూ.23 వేల కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతోపాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, హంద్రీ–నీవా, అవుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు.
మొదటి నుంచి జగన్ రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ తన విధానాలను కూడా మార్చుకుని రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయడంలో ఒక అడుగు ముందుకు పడటంలో జగన్ సర్కార్ ప్రయత్నం ఉందని చెప్పాలి. ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరైతే మాత్రం సీమ కరువును తరిమికొట్టే పనుల్లో వేగం పెరుగుతుంది.