సినిమా రివ్యూ: భీష్మ
సమీక్ష: భీష్మ
రేటింగ్: 3/5
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: నితిన్, రష్మిక, అనంత్ నాగ్, జిషుసేన్ గుప్తా, వెన్నె కిషోర్, నరేష్, సంపత్ రాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ, హెబ్బా పటేల్ తదితరులు
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
మూడు పరాజయాలు, ఏడాదిన్నర విరామం తర్వాత నితిన్ ఎలాంటి ప్రయోగాలకీ పోకుండా తన ఇమేజ్‌కి సూట్ అయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. ఛలోతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న ‘త్రివిక్రమ్ శిష్యుడు’ వెంకీ కుడుముల తన ‘గురూజీ’లానే ఎలాంటి కాంప్లికేషన్స్ లేని సింపుల్ కథని రాసుకుని, వినోదం అసలు మిస్ అవ్వని ట్రీట్‌మెంట్‌తో, అలరించే సంభాషణలు, ఆకట్టుకునే సన్నివేశాలతో ఎక్కడా విసిగించని ఒక క్లీన్, ఆర్గానిక్ ఫన్ ఫిలింని అందించాడు.
లైన్‌గా చెప్పుకుంటే ఏమంత స్ట్రయికింగ్‌గా అనిపించకపోయినా, ఆ పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు తోడయ్యాక ‘భీష్మ’ ఒక నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కి కావాల్సిన లక్షణాన్నీ పుణికి పుచ్చుకుంది. క్యూట్ లీడ్ పెయిర్‌కి తోడు, ఆహ్లాదకరమైన పాటలు, భారీ నిర్మాణ విలువలు జత కలిసాయి. రెగ్యులర్ కథాకమామీషు అయినా కానీ కంప్లయింట్ చేయనివ్వలేని వేగాన్ని కథనంలో చూపించడంతో పాటు ఆద్యంతం వినోదం మిస్ అవకుండా చూసుకోవడం ‘భీష్మ’కి చాలా కలిసి వచ్చింది.
సింగిల్‌గా వుండిపోయాననే ఫ్రస్ట్రేషన్‌లో వున్న యువకుడి కథలా మొదలైన ఈ చిత్రం ‘సేంద్రీయ వ్యవసాయం’ అనే టాపిక్ మీదుగా కమర్షియల్ టర్న్ తీసుకుంటుంది. దర్శకుడు వెంకీ కుడుముల కథనం పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో రాసుకున్నా కానీ తన హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో వుంచుకుని అందుకు అనుగుణంగానే భారీ యాక్షన్ సీన్స్ తర్వాత కూడా అతడిని ‘హీరోలా’ చూడకుండా జాగ్రత్త పడ్డాడు. ‘మీమ్ క్రియేటర్’ అని పరిచయం చేయడం వల్ల హీరో క్యారెక్టర్ ఎక్కడైనా సగటు సినిమా హీరోలా కనిపించినా కానీ వెంటనే నార్మల్ చేసేయడానికి వున్న స్కోప్ పర్‌ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు.
కాకపోతే ఇంత పకడ్బందీ కథలోను హీరోయిన్ మాత్రం ఈజీగా ప్రేమలో పడిపోయినట్టు, అంతే ఈజీగా బ్రేకప్ చెబుతున్నట్టు అనిపించడం చిన్న ఇబ్బంది. అలాగే భీష్మని ఒక కంపెనీకి అధిపతిగా ప్రకటించడానికి తగినంత బలమైన కారణాలు లేకపోవడం చిన్న వెలితి. అగ్ర హీరోల సినిమాకి అంచనాలు కూడా అదే స్థాయిలో వుంటాయి కనుక ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులే భూతద్దంలో కనిపిస్తుంటాయి. ఇక్కడ అవి సగటు సినీ ప్రేక్షకుకి అయితే చిన్నపాటి సమస్యుగానే అనిపిస్తాయి. కాకపోతే హాస్యం, వినోదంపై గ్రిప్ సాధించిన వెంకీ తన గురువు మాదిరిగా భావోద్వేగానీ కథలో భాగం చేయగలిగితే ఇంకా పెద్ద రేంజ్ సినిమాలు ఇవ్వడానికి అవకాశముంది.
నితిన్ తన పాత్రని చాలా ఎంజాయ్ చేస్తూ చేసాడు. హీరో తన పాత్రని ఎంజాయ్ చేసినపుడు ఆ అవుట్‌పుట్ డబుల్ అవుతుంది. గుండెజారి గల్లంతయిందే తర్వాత మళ్లీ నితిన్‌లో ఆ ఉత్సాహం కనిపించింది. రష్మిక పాత్రని సరిగా డిజైన్ చేయలేదనిపించినా కానీ ఆమె ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ ఈ చిత్రానికి హెల్ప్ అయ్యాయి. జిషుసేన్ గుప్తా ‘ఆర్గానిక్’ విలన్‌లా స్టయిలిష్‌గా వున్నాడు. ఎక్కడా అరుపు, కోపతాపాలు లేని క్లీన్ విలనీని చక్కగా పండించాడు. అనంత్ నాగ్ పాత్ర మాత్రమే సింగిల్ నోట్ క్యారెక్టర్‌లా వుంది. ఈ పాత్రకి మరో డైమెన్షన్ ఇచ్చినట్టయితే బాగుండేది. వెన్నెల కిషోర్ తనకి మంచి పాత్ర, చక్కని లైన్స్ రాస్తే సీన్‌ని నిలబెట్టేస్తానని మళ్లీ నిరూపించాడు. రఘుబాబు కాంబినేషన్‌లో కిషోర్ కామెడీ మరింత పండింది. సంపత్‌రాజ్ `నితిన్‌పై జరిగే వాట్సాప్ సంభాషణ ఫస్ట్ హాఫ్‌కి హైలైట్‌గా నిలిచింది. నరేష్, బ్రహ్మాజీ పాత్రకి రాసిన సన్నివేశాలు టూ కన్వీనియంట్‌గా వున్నా కానీ ఫ్లోలో పాస్ అయిపోయాయి.
మహతి అందించిన బాణీలు బాగున్నాయి. సింగిలే, వాటే బ్యూటీ సాంగ్స్ కమర్షియల్ మీటర్‌కి తగ్గట్టుగా కుదిరాయి. పాటని చిత్రీకరించిన విధానం వల్ల స్క్రీన్‌పై మరింత బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ భారీ చిత్రాకి ఏమాత్రం తీసిపోని విధంగా రిచ్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫాస్ట్‌గా వుంది. ఎక్కడా అనవసరపు ల్యాగ్ లేకుండా చాలా కేర్ తీసుకున్నట్టనిపించింది.
దర్శకుడు వెంకీ కుడుములకి ఈసారి ఖర్చు పెట్టే నిర్మాత కూడా తోడవడంతో త్రివిక్రమ్ చిత్రా మాదిరిగా రిచ్ ప్రొడక్షన్ డిజైన్‌తో సినిమాని చాలా కర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. అతని రచనలోనే కాకుండా కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కూడా త్రివిక్రమ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. తక్కువ మాటతో ఎక్కువ ఎఫెక్ట్ తెలిసేలా, ఎక్కువ సన్నివేశాలు లేకుండా ఎఫెక్టివ్‌గా మేటర్ కన్వే చేసేలా అతని దర్శకత్వ శైలి ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమా ప్రేక్షకుకి ఏమి కావాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో తెలిసిన యువ దర్శకుడనే నమ్మకాన్ని పెంచుకున్నాడు వెంకీ.
సంక్రాంతికి వచ్చిన భారీ సినిమా తర్వాత థియేటర్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా రాని లోటుని ‘భీష్మ’ భర్తీ చేస్తుంది. సగటు సినీ ప్రియుడికి కావాల్సిన వినోదంతో పాటు, విమర్శకు సైతం పెద్దగా కంప్లయింట్ చేయలేని నీట్ అండ్ క్రిస్ప్ కాంటెంట్‌తో బాక్సాఫీస్‌ని ఈ భీష్మ అవలీగా గెలిచేస్తుంది.
బాటమ్ లైన్: సేంద్రీయ హాస్యం!
-గణేష్ రావూరి