ఛీ కొట్టిన పార్టీతో జ‌న‌సేన పొత్తు

తెలంగాణ‌లో ఛీ కొట్టిన పార్టీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుంది. ఏపీలో బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ తెలంగాణ‌లో అలాంటిదేదీ లేద‌ని స్వ‌యంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్…

తెలంగాణ‌లో ఛీ కొట్టిన పార్టీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకుంది. ఏపీలో బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ తెలంగాణ‌లో అలాంటిదేదీ లేద‌ని స్వ‌యంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కొంత కాలం క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

తెలంగాణ‌లో త‌మ‌కు క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వ‌లేద‌నే ఆవేద‌న‌తో ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవికి జ‌న‌సేనాని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ, జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ జరిగిన సంగ‌తి తెలిసిందే. 

అస‌లు జ‌న‌సేన‌కు జెండా, అజెండా అంటూ ఏదీ లేద‌ని, ప్యాకేజీకి అమ్ముడుపోయిన పార్టీ అని తెలంగాణ బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. తెలంగాణ బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య విభేదాల ప్ర‌భావం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ పొత్తుపై ప‌డుతుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా జ‌రిగింది. అయితే ఆ త‌ర్వాత రోజుల్లో అన్ని స‌ర్దుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో తెలంగాణ బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుద‌ర‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఖ‌మ్మం మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు క‌లిసి బ‌రిలో దిగ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధికారికంగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఇరు పార్టీల నాయకులు చర్చలు జరిపారు.

ఖమ్మంలో పోటీ చేసే అంశంపై నేతల మధ్య స్పష్టత వచ్చింది. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాల‌నే అంశంపై మ‌రో స‌మావేశంలో స్ప‌ష్ట‌త రానుంది. ఈ చర్చల్లో జనసేన తెలంగాణ ఇంఛార్జ్‌ శంకర్‌గౌడ్‌, రామ్‌ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్య దర్శి వి.వి.రామారావు, బీజేపీ తరఫున ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మొత్తానికి తెలంగాణ‌లో కూడా బీజేపీ, జ‌న‌సేన ఒక అవగాహ‌న‌కు రావ‌డంపై ఇరు పార్టీల నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి విభేదాల‌కు ఆస్కారం లేకుండా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.