కలిసొచ్చే రోజుల్లో ఏం చేసినా కలిసి వస్తుంది. అప్పటికి పొరపాట్లుగా తోచినవి కూడా కాలం గడిచాక తెలివైన పనులుగా పరిణమిస్తాయి. కాలం కలిసి రానప్పుడు ప్రతీదీ అడ్డం తిరుగుతుంది. వ్యవహారం చెడుతున్న కొద్దీ మనిషికి అసహనం పెరిగి, తప్పులు చేస్తాడు. ఆలోచనా ధోరణే మారుతుంది. చేసిన తప్పును ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా యింకా ఎక్కువ తప్పులు చేస్తాడు. సవరించబోయినవారిని శత్రువులుగా చూస్తాడు. వేసిన పథకాలు, పన్నిన వ్యూహాలు విఫలమవుతున్నకొద్దీ నెగటివిటీ మరీ పెరుగుతుంది. ఈ కఠోరవాస్తవం మామూలు మనుషుల కంటె రాజులకు బాగా అన్వయిస్తుంది. అందుకే చరిత్రలో గొప్ప రాజులు సైతం పతనమయ్యారు. ఈనాడు వాళ్ల చరిత్ర చదివితే ‘అంత తెలివితక్కువగా ఎలా చేశారబ్బా’ అనిపిస్తుంది.
కానీ వాళ్ల చేష్టలకు కారణం చుట్టూ చేర్చుకున్న సలహాదార్లని మనం గుర్తుంచుకోవాలి. అందుకే రాజు వివేకవంతుడై తన సలహాదారులను, మంత్రులను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్త వహించాలని చాణక్యుడు మరీమరీ చెప్తాడు. కానీ దౌర్భాగ్యం కొద్దీ రాజు తన చుట్టూ భజనపరులను చేర్చుకుని, వారి మాటలనే వింటూ కటువైన సత్యాలు చెప్పేవారిని దూరం పెడతాడు. నెపోలియన్ ఎన్నో విజయాలు సాధించాడు. కానీ శీతాకాలంలో రష్యాపై దాడికి వెళ్లి తీవ్రంగా నష్టపోయాడు. ఆ చారిత్రక సత్యం కళ్ల ముందు వుండగా కూడా హిట్లర్ మళ్లీ అదే రష్యాపైకి శీతాకాలంలో దండెత్తి తన పతనాన్ని కొనితెచ్చుకున్నాడు. ఆ మాత్రం తట్టలేదా? ఎవరూ చెప్పలేదా? అని గట్టు మీద వున్న మనం ఆశ్చర్యపడతాం.
ప్రజాస్వామ్యంలో నాయకుల వద్దకు వస్తే, ఒక ప్రభుత్వం అన్‌పాప్యులర్ అవుతోంది అని సాధారణ ప్రజలకు తెలుస్తూనే వుంటుంది. పత్రికలలో కొందరు వ్యాసాలు రాస్తూనే వుంటాయి. కొన్ని నిష్పక్షపాత సర్వేలు ప్రజాభిప్రాయాన్ని చెపుతూనే వుంటాయి. అయినా పాలకులు యివేమీ నమ్మరు. మళ్లీ గెలుస్తామనే పిచ్చి నమ్మకంతో వుంటారు. గోడమీద రాతలు చదవలేని అంధులా వీరు అని మనం అనుకుంటాం. కానీ అధికారమదం వారి కళ్లను కప్పేస్తుంది.
లేకపోతే ఒకసారి అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ ఓడిపోయే ప్రశ్నే రాదు. ఓడిపోయాక కళ్లు తెరుచుకుంటాయి కాబట్టి, మామూలు ప్రజలతో మెలిగి, పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలుగుతున్నాడు. అధికారంలో వుండగా ఎన్నో ఒత్తిళ్లుంటాయి. ప్రతిపక్షంలో వుండగా తీరిక వుంటుంది. జాగ్రత్తగా పథకాలు రచించవచ్చు. అందుకే ప్రతిపక్షంలో వున్నవారు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు.
చంద్రబాబు విషయానికి వస్తే 1989 నుంచి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో వుండి, పొరపాట్లు దిద్దుకుని, 1994లో ఎన్టీయార్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చారు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో వుండి, ఒప్పుల కంటె తప్పులు ఎక్కువ కావడంతో అధికారం పోగొట్టుకుని, పదేళ్ల పాటు ప్రతిపక్షంలో వున్నారు. రాష్ట్రం విడిపోతే కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం అని ప్రజల నుకోవడంతో ఆయనకు 2014లో మళ్లీ అధికారం దక్కింది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుని, ఐదేళ్లలో మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆ రావడంలో కూడా ‘దిగడానికి మెట్లు లేవు’ అనే స్థితికి చేరారు. రాక్ బాటమ్‌లో వున్నపుడు పైకి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. పైగా ఆంధ్రలో అప్పోజిషన్ ఎరీనా ఖాళీగా వుంది. తెలంగాణలో చేయడానికి పనేమీ లేదు. పార్టీ మూతపడింది. ఇక ఆంధ్రపై శ్రద్ధ పెట్టి సరైన వ్యూహాలతో ముందుకు వెళ్లకుండా యీయనేం చేస్తున్నట్లు? అనే ప్రశ్న వస్తుంది.
అధికారం పోయి రెండేళ్లయింది. అప్పణ్నుంచి ఈయన సాధించినదేముంది? పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పోగొట్టుకుంటున్నాడు. ఓటు బ్యాంకు 9% వరకు క్షీణించింది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి 80% సీట్లు వచ్చాయి. 75 మునిసిపాలిటీలలో ఒకే ఒక్కటి టిడిపి ఖాతాలో పడింది. అది కూడా స్థానిక నేతల ప్రతాపం తప్ప పార్టీ ప్రతాపం కాదని విజేతలే చెప్పుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలలో నిలబడి వుంటే క్యాడర్‌కు ఉత్సాహం వుండేదేమో, కానీ యీయన ఉత్తరకుమారుడిలా రణరంగం విడిచి పారిపోయాడు.
గతంలో జగన్ అసెంబ్లీకి గైరుహాజరైతే తప్పు పట్టినవారు (నేనూ తప్పుపట్టాను) యీనాడు ప్రజాస్వామ్యానికి కొండగుర్తయిన ఎన్నికలు బహిష్కరిస్తే ఎలా? పైగా ఒకటో, రెండో నియోజకవర్గాలు కాదు, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలు! ఎన్నికలలో నిలబడితేనే అక్కడ మనకున్న బలాబలాలేమిటో, ఎవరు మనవైపు వున్నారో, ఎవరు లేరో, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుస్తుంది. కార్యకర్తలకు కూడా ఆ పేరు చెప్పి నిధులు వసూలు చేసే, దానిలోంచి కొంత ప్రజలకు యిచ్చి మంచి చేసుకునే వెసులుబాటు దక్కుతుంది.
సాధారణంగా అధికార పార్టీ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా, అధికారుల చేతనే పరిపాలన సాగించాలని చూస్తుంది. అందుకని ఎన్నికలు జరిగితే తమ తడాఖా చూపించాలని, గతంలో కంటె ప్రస్తుతానికి తమ పాప్యులారిటీ పెరిగిందని చూపించాలనే ఆతృతలో ప్రతిపక్షాలు వుంటాయి. టిడిపి కూడా కొంతకాలం ఎన్నికలకు పట్టుబట్టింది. పంచాయితీ, మునిసిపల్ ఫలితాల తర్వాత తర్వాతవి బహిష్కరిస్తున్నాం అంది. అలా అంటే ప్రజల్లో ఎలాటి అభిప్రాయం కలుగుతుంది? పార్టీ కథ ముగిసిపోయిందని అధినేతే ఒప్పేసుకున్నాడ్రా అనుకోరూ? అచ్చెన్నాయుడి వీడియో నిజమో, కాదో నాకు తెలియదు. కానీ నిజం కావడానికి ఎక్కువ అవకాశం వుందని అనుకుంటాను. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడికి పార్టీ వ్యవహారాలు నిస్పృహ కలిగించేట్లే వున్నాయి. ఏం చేసినా ఏం లాభం? అని అందరూ కాడి పారేసే పరిస్థితిలోనే వున్నారు.
టిడిపి అల్లాటప్పా పార్టీ కాదు. 40 ఏళ్లగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు ఊపింది. రాష్ట్రవిభజనతో తెలంగాణలో కరారావుడు అయిపోయింది. కనీసం ఆంధ్రలోనైనా పార్టీ బతకాలి. దానికి తగిన సాధనసంపత్తి వుంది. ఊరూరా క్యాడర్ వుంది. పార్టీ ఆఫీసులున్నాయి. నిధులున్నాయి. ప్రజల్లో కనీసం 25% మంది హరి గిరిమీద పడ్డా, గిరి హరిమీద పడ్డా ఓటేసే కమిటెడ్ ఓటు బ్యాంకు వుంది. వైసిపి పాలన సాగేకొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఖాయం. కనీసం ఆ తరహా ఓట్లు 10% కలిసి వచ్చినా సరైన ప్రణాళికతో మొత్తం సీట్లలో 25-30 % సీట్లు తెచ్చుకోవచ్చు. ఇన్ని ఎడ్వాంటేజిలు వుండి కూడా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నశించిందంటే టిడిపి నాయకత్వం అనుసరిస్తున్న స్ట్రాటజీలోనే పొరబాటుందని అనుకోవాలి.
ఈ విషయంపై గతంలో మాట్లాడినప్పుడు లోకేశ్‌కు యిచ్చిన అవకాశం వ్యర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్‌ను అతని స్థానంలో తీసుకుని వస్తే బాగుంటుందేమోనన్న సూచన చేశాను. పార్టీలో చీలిక వస్తుందేమోనన్న భయాన్నీ వ్యక్తం చేశాను. బాబుకి యిలాటి భయాలేవీ వున్నట్లు లేవు. దిద్దుబాటు చర్యలు లేకుండా పాత బాటలోనే వెళుతున్నారు. ఆయనేం చేసినా భేష్ అనడానికి రెండు పత్రికలు, రెండు టీవీ ఛానెళ్లు వున్నాయి. సోషల్ మీడియాలో ఒక వర్గమూ వుంది. అవి చూసుకుని మురిసిపోతే ఎలా? ఆ ప్రశంసలు ఓట్లగా తర్జుమా ఎందుకు కావటం లేదో ఆలోచించాలి కదా! నా ఉద్దేశంలో టిడిపి స్ట్రాటజీలో ప్రధానలోపం – బిజెపి పట్ల దాని వైఖరి. ప్రతిపక్షంలో వున్న నాయకుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతూ వుండాలి. వాళ్ల తప్పులు ఎత్తి చూపుతూండాలి. అప్పుడే ప్రజలు అతనితో మమేకమౌతారు. తమ బాధలు అర్థం చేసుకుంటున్నాడని సంతోషిస్తారు.
పెట్రోలు ధర పెరిగినా, గ్యాస్ సిలిండర్ ధర పెరిగినా, పెట్టుబడుల ఉపసంహరణ పేర కేంద్రప్రభుత్వ సంస్థలను కేంద్రమే తెగనమ్మినా, రాష్ట్రానికి యిస్తానన్న ప్రత్యేక హోదా యివ్వకపోయినా, ఆ విధానం రద్దు అని మనకు చెప్తూనే యితర రాష్ట్రాలకు యిస్తామని హామీ యిచ్చినా, బజెట్‌లో ఎంగిలి చెయ్యి కూడా విదిలించక పోయినా, ఏం చేసినా, కేంద్రంలోని బిజెపిని పన్నెత్తి మాట అనకుండా, కేవలం వైసిపి మీదే ఎగిరెగిరి పడుతూంటే సామాన్యుడు ‘ఈయనేదో తన ఏడుపు ఏడ్చుకుంటున్నాడు తప్ప నా గురించి ఏడవటం లేదు’ అనుకుంటాడు. ధరల పెరుగుదలకు కేంద్రం, రాష్ట్రం ఏ నిష్పత్తిలో బాధ్యులనేది అతనికి పట్టదు. ఇద్దరి మీదా అతనికి కోపమే. అలాటిది ‘కేంద్రాన్ని ఏమీ అనవద్దు, రాష్ట్రాన్ని మాత్రమే అనండి’ అని బాబు అంటే అతను కన్విన్స్ అవుతాడా?
నేను ఓ కాలమిస్టుని. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రకటించగానే శభాష్ అంటూ ఏదైనా ఆర్టికల్ రాస్తే పాఠకుడికి చికాగ్గా వుంటుంది. ‘ప్రజల డబ్బుతో వేసే పేపర్లలో ఫుల్‌పేజీ యాడ్స్ పాలకుల ఫోటోలతో సహా చూస్తున్నాం కదా, మళ్లీ వీడు కూడా అదే రాయాలా?’ అని. అంతకంటె పథకం మొదలుపెట్టిన ఏడాదికి అది ఏ మేరకు విజయవంతమైంది, అమలులో జరిగిన లోపాలేమిటి అని చర్చిస్తూ రాస్తే సంతోషిస్తారు. నేనే ప్రతిపక్ష నాయకుణ్ననుకోండి, పథకం ప్రకటించగానే అది చెత్త అనో, యిది మా పాత పథకమే, పేరు మార్చి వాడుతున్నారనో, ప్రజాధనం వ్యయం అవుతోందనో అంటాను.
అది నా వృత్తిధర్మంగా భావిస్తాను. లేదూ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వుందామనుకుంటే, అప్పుడు ‘ఉద్దేశం మంచిదే కానీ, దాన్ని సవ్యంగా అమలు చేయగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉన్నట్లు తోచదు. అఖిలపక్షాన్ని పిలిచి, మా సలహాల ప్రకారం చేస్తే బాగుంటుంది. ఎవరేం చేసినా ప్రజల డబ్బే కదా, వారి కోసమే కదా మా అందరి తాపత్రయం.’ అంటూ సన్నాయినొక్కులతో మొత్తం ఘనత ప్రభుత్వానికి రాకుండా చేస్తాను.
అదేమీ చేయకుండా, కేంద్రాన్ని ఏమియూ అనము అని టిడిపి మడి గట్టుకుని కూర్చుంటే ఎలా? కేంద్రంలో వున్న బిజెపి మీకేమీ స్నేహపక్షం కాదు, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఎదగడానికి మీతో పోటీ పడుతోంది కూడా. చీటికీమాటికీ మిమ్మల్ని తిడుతోంది కూడా. బిజెపి నాయకుడు టీవీ చర్చలకు రాగానే ‘మీరు మానిఫెస్టోలో రాసిన ప్రత్యేక హోదా సంగతేమిటి?’ అని కవ్వించడం టీవీ యాంకర్లకు సరదా. వాళ్లు వెంటనే ‘హోదా అక్కరలేదు, ప్యాకేజీ యివ్వమని బాబే అడిగి తీసుకున్నారు.
ఒకసారి డీల్ క్లోజ్ అయిపోయిన తర్వాత, వైసిపికి భయపడి మాట మార్చి హోదా, హోదా అన్నారు.’ అని బాబు గాలి తీసేస్తూంటారు. ‘ఆలయాలపై దాడులు మీరు, టిడిపి కలిసివున్నపుడు మీ పార్టీ నాయకుడు దేవాలయమంత్రిగా వున్నపుడూ జరిగాయి కదా. విజయవాడలో అనేక గుళ్లు పట్టపగలే కూల్చేశారు కదా’ అని అడిగితే ‘మా పార్టీ మనిషి మంత్రిగా వున్నా, బాబే సర్వాధికారాలు చలాయించి, ఈయన్ని ఎన్నడూ సంప్రదించలేదు. గోదావరి పుష్కరాల చావులకు కూడా బాబుదే బాధ్యత, మా మంత్రిది కాదు.’ అని తప్పుకుంటున్నారు.
తాము టిడిపి కలిసి పాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా బిజెపి ఎప్పుడూ చెప్పుకోదు. వైసిపిని తిట్టడానికి భూమికగా, ‘టిడిపి పాలనలోనూ అభివృద్ధి జరగలేదు, యిప్పుడూ అంతే. మేము అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రానికి దిక్కు లేదు’ అని చెప్పుకుంటున్నారు. అమరావతి విషయంలో చేసే వెక్కిరింతలకు లెక్కే లేదు. ‘ఇల్లు కట్టుకుంటామంటే డబ్బిస్తారు తప్ప, రాజమహళ్లు కట్టుకుంటామంటే ఎవరిస్తారండీ? మోదీగారి సొంత రాష్ట్రం గుజరాత్ రాజధాని గాంధీనగర్ చూడండి, ఎంత సింపుల్‌గా వుంటుందో! ఈయనే గ్రాఫిక్స్ చూపించారు, బోల్తా పడ్డారు. ఇచ్చిన నిధులకు లెక్క చెప్పమంటే చెప్పలేదు. ఆయనకు రాజధాని కట్టడం చేతకాలేదు.’ అని తీసిపారేస్తారు.
పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు కానీ ఒక్కోప్పుడు ఒక్కోలా మాట్లాడతారు. ఒక్కోసారి భాగస్వామి బిజెపి గురించే చులకనగా మాట్లాడతారు. మరోసారి టిడిపిదీ తప్పుందంటారు. అఫ్కోర్స్ ఆయన ప్రధాన శత్రువు వైసిపియే. కానీ టిడిపిపై కూడా పెద్ద మర్యాద చూపరు. కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీలు వైసిపినీ తిడతాయి కానీ టిడిపిని వదిలిపెట్టవు. లెఫ్ట్ పార్టీలు జగన్ రాజధాని తరలింపు ప్రతిపాదనను అడ్డుకుంటూనే అమరావతి రైతులనుంచి పెద్ద మొత్తంలో పంటభూములు సేకరించినందుకు బాబుకు చురకలు వేస్తూ వుంటాయి. గతంలో వాళ్లూ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు కదా! అధికారంలో వుంది కాబట్టి వైసిపికి ప్రతిపక్షాలన్నిటి నుంచి విమర్శలు తప్పవు. కానీ తమాషా ఏమిటంటే ప్రతిపక్షంలో వున్న టిడిపికి కూడా అక్షింతలు పడుతూంటాయి.
ఇలాటి పరిస్థితుల్లో టిడిపి తక్కిన ప్రతిపక్షాలన్నిటినీ ఎదుర్కోవాలి కదా. వాళ్లనీ నాలుగు మాటలనాలి కదా. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వుండి, రాష్ట్రంలో మొదటిమెట్టుగా టిడిపి స్థానాన్ని ఆక్రమిస్తాం అని రంకెలేస్తున్న బిజెపిని ఘాటుగా విమర్శించాలి కదా. కానీ టీవీ చర్చల్లో కానీ, పత్రికా ప్రకటనల్లో కానీ టిడిపి నాయకులు, టాప్ టు బాటమ్, బిజెపిని ఒక్కమాట అనరు. దానితోనే పార్టీ అస్తిత్వానికి ముప్పు కలుగుతోందని నా ఊహ.
నిజానికి మోదీ ఏడేళ్ల క్రితం నాటి మోదీ కాదు. ఆయన పాప్యులారిటీ తగ్గుతోంది. ఎన్నికలు మాత్రమే సూచనగా తీసుకోలేం. ప్రతిపక్షాల అనైక్యత, ఫిరాయింపులు యిలా అనేక మార్గాల్లో బిజెపి రాష్ట్రాలలో నెగ్గుకుని వస్తోంది. జాతీయస్థాయిలో మోదీకి ఎదురు లేదనేది నిజమే. కానీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం వుంటే బిజెపికి గెలుపు ఓ పట్టాన సిద్ధించటం లేదు. దేశం మొత్తం మీద 4036 మంది ఎమ్మెల్యేలుంటే బిజెపి వారు 1374 అంటే 35%. ఎంపీలకు వచ్చేసరికి అది 55% వుంది. వీటిలో 90% సీట్లు 10 రాష్ట్రాల్లో వచ్చాయి. అనేక రాష్ట్రాల్లో బిజెపికి 20% కంటె తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్నిటిలో 1-5%లో వున్నాయి. టిడిపి కార్యక్షేత్రం రాష్ట్రమే కాబట్టి, అది బిజెపిని గట్టిగా ఎదుర్కోవచ్చు. బిజెపికి 50% ఓట్ల కంటె ఎక్కువ వచ్చిన రాష్ట్రాలు అయిదే. యుపి, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక! వీటిలో ఎపి లేదు. ఎపిలో అది ‘నోటాసే భీ ఛోటా’. ఇక టిడిపికి భయమేముంది?
దేశంలో హిందూత్వవాదం పెరగడంతో మోదీకి ఆ వర్గాల్లో ఓటింగు పెరుగుతోంది. కానీ మైనారిటీలు, దళితులు, వెనకబడిన వర్గాలు వున్నచోట, జనజీవితంలో మతానికి పెద్దగా ప్రాధాన్యత లేని తెలుగు సమాజంలో మోదీ పట్ల విముఖత పెరుగుతోంది. హిట్లర్ కూడా విపరీత జాతీయవాదం, ఒక అంతశ్శత్రువును చూపించడం ద్వారా త్వరగా పైకి వచ్చాడు. మోదీ కూడా ఆ మార్గాన్ని అవలంబిస్తున్నారు. కానీ హిట్లర్ పాలనలో జర్మనీలో ఆర్థికాభివృద్ధి బాగా జరిగి ప్రజలు అతని నాయకత్వాన్ని ఆరాధించారు.
మోదీ నేతృత్వంలో దేశంలో అలాటి ఆర్థికాభివృద్ధి జరగటం లేదు. ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ కారణం చేత మోదీయిజం విఫలమయ్యే ప్రమాదం వుంది. మతం ఉత్తేజపరుస్తుంది తప్ప కడుపు నింపలేదు కదా. నిరుద్యోగం, పారిశ్రామిక మందగమనం, ద్రవ్యోల్బణం వంటివి మోదీపై మోజును తగ్గించివేశాయి. ‘అచ్ఛే దిన్’ మాట యిప్పుడు ప్రజలే కాదు, బిజెపి నాయకులు కూడా తలవటం లేదు.
ఇలాటి పరిస్థితుల్లో ఆంధ్రలో వున్న మోదీ వ్యతిరేక ఓటు బ్యాంకు ఎటు పోవాలి? వారిలో వైసిపి వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలో వుండే వుంటారు కదా! వాళ్లందరికీ నేనున్నానని టిడిపి చెప్పవద్దా? అధికార పక్షాన్ని తిట్టడంతో ఆగకూడదు, ప్రతిపక్షంలో వున్న తక్కిన పార్టీలన్నీ పనికిమాలినవని, తామొక్కరే వస్తాదులమని చెప్పుకోగలగాలి. టిడిపి అది చేయటం లేదు. ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందో తెలియకపోవడం చేత కాబోలు ఇతర పార్టీలను ఏమీ అనటం లేదు. కానీ బిజెపిని కూడా అనలేక పోతే ఎలా? ఇటీవల కేంద్రమే అన్ని అధికారాలూ చలాయించేస్తోంది. రాష్ట్రాల చేతిలో ఏమీ వుండటం లేదని ముఖ్యమంత్రులు వాపోతున్నారు. అలాటప్పుడు ఊరికే రాష్ట్ర పార్టీని మాత్రమే విమర్శిస్తే ఎలా? పెట్రోలు, గ్యాస్ ధరలు నిర్ణయించేది ఎవరో ముఖ్యమంత్రిగా పని చేసిన బాబుకి తెలియదా? వైజాగ్ స్టీలు ప్లాంట్ అమ్మకం నిర్ణయం మాదే అని కేంద్రం చెవులు పగిలేట్లా పార్లమెంటులో చెపుతూంటే జగన్‌ను నిందించడం దేనికి?
ఏమైనా అంటే తన కేసుల భయంతో జగన్ కేంద్రం చెప్పినట్లు ఆడుతున్నాడని అంటారు. అది నిజమే కావచ్చు. కానీ మీరు చెప్పేటప్పుడు ‘వ్యవసాయ బిల్లులు, విద్యుత్ సంస్కరణల బిల్లులు, పెట్టుబడుల ఉపసంహరణ, పెట్రోలు, డీజెలు ధరల పెంపు యివన్నీ తప్పుడు నిర్ణయాలు. ఇవన్నీ చేసిన బిజెపి దేశానికి నష్టం చేస్తోంది. దానితో చేతులు కలిపిన తోడుదొంగ జగన్ కూడా నష్టం చేస్తున్నాడు.’ అని స్పష్టంగా చెప్పాలి కదా! అది చెప్పరు. బిజెపిపై యీగ వాలనివ్వరు. గతంలో కాంగ్రెసు ప్రభుత్వం యిలాగే చేసింది.
తమ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లకుండా జగన్‌పై మాత్రం కేసులు పెట్టాల్ని చూసింది. అందుకే పదేళ్లయినా అవి ముందుకు కదలటం లేదు. ఇప్పుడు టిడిపి కూడా అదే విన్యాసం చేద్దామని చూస్తోంది. అందుకే కథ రక్తి కట్టడం లేదు. ప్రథమ దోషిగా బిజెపిని నిలబెట్టిన నాడే టిడిపికి వాదనకు బలం వస్తుంది. వైసిపి, బిజెపి రెండూ అంటే పడని వాళ్లు ఓటేస్తారు. వైసిపి అంటే పడనివాళ్లు మొన్న మునిసపల్ ఎన్నికలలో 47% మంది వున్నారని తేలింది. బిజెపి అంటే పడనివాళ్లు 97% వున్నారు. వీళ్లిద్దరివీ కలిపి వీళ్లు 35% తెచ్చుకోవడం కష్టమా?
బిజెపికి వ్యతిరేకంగా పోరాడడానికి జగన్ కయితే కేసుల భయం వుంది. సోనియాతో సున్నం పెట్టుకున్న తర్వాత కేంద్రం తడాఖా తెలిసి వచ్చింది. కేసులో సరుకు లేకపోయినా జైలుకి పంపి, నెలల తరబడి బెయిలు రాకుండూ చేయగలరని అర్థమైంది. అందుకని వ్యవసాయ బిల్లులు కాదు, విద్యుత్ బిల్లులు కాదు, ఏం పెట్టినా జీహుజూర్ అనాలి. ఆ వీక్‌నెస్సే మీకు బలం కావాలి. రైతుల మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించడానికి ఒప్పుకున్నారని వైసిపిని తిట్టడం కాదు, ఆ విధానం తప్పని తోస్తే ప్రతిపాదన చేసిన బిజెపిని తిట్టాలి. దానివలన మీకొచ్చే నష్టం లేదు. దేశంలో బలమైన ప్రతిపక్షం వున్నచోట బిజెపి ఆగుతోంది.
ఒకవేళ దేశం మొత్తమంతా గెలిచినా, ఆంధ్రలో గెలవడానికి కనీసం దశాబ్దం పడుతుంది. తెలుగు రాష్ట్రాలలో మధ్యతరగతికి మోదీపై మనసు విరిగింది. ఆయన యీ రెండు రాష్ట్రాలపై పగ బట్టి ఏమీ యివ్వకుండా చేస్తున్నాడని అందరికీ ఫీలింగు. ఆ వ్యతిరేక ఓటంతా వైసిపికి వెళ్లేట్లు చేయడం రాజకీయంగా ఆత్మహత్యసదృశం కదా! ఆ వ్యతిరేక ఓటు గుంజుకోవాలంటే టిడిపి తయారుగా వుండాలి. ఎంతసేపూ జగన్ మీదనే అరుస్తూ, బిజెపిని స్పేర్ చేస్తూ వుంటే పరిధి తగ్గిపోవడం లేదా! మోదీని ఎదిరించాలి. 2019లో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పాప్యులారిటీ తగ్గుతున్న విషయం గ్రహించకుండా, పాలన పక్కన పెట్టి, మోదీ వ్యతిరేక ప్రచారం చేస్తూ దేశమంతా వీరవిహారం చేయడం ఎంత తప్పో, యిప్పుడు ఖాళీగా వుంటూ కూడా నోరు విప్పకపోవడం అంతే తప్పు.
ప్రతిపక్షంలో వున్నవాడు కేంద్రంలో అధికారంలో వున్నవాడిని విమర్శించడానికి భయపడితే ఎలా? అధికారంలో వుండగా అయితే ‘కేంద్రాన్ని ఎదిరిస్తే రాష్ట్రానికి నిధులు రావని, రాష్ట్రం కోసం స్వాభిమానం చంపుకున్నాను, భరించాను’ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడేం చెప్పుకుంటారు? బజెట్‌లో ఆంధ్రకు అన్యాయం జరిగింది, ఏ ప్రాజెక్టూ యివ్వలేదు అనడానికి కూడా భయమేనా? తెచ్చుకోలేకపోయాడంటూ జగన్ మీద అరిచినదానిలో సగమైనా దిల్లీవాణ్ని అనాలి కదా!
చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరు అనే భావంతోనే కాబోలు దేశంలోని ప్రతిపక్ష నాయకులందరికీ ఉత్తరాలు రాసిన మమతా బెనర్జీ ఆయనకు ఉత్తరం రాయలేదు. అక్కడే పరువు పోయింది. ఇప్పటికైనా బాబు బిజెపిపై, యితర ప్రతిపక్షాలపై అస్త్రాలు సంధిస్తూ, తన స్పేస్ పెంచుకుంటూ పోవాలి. లేకపోతే వైసిపికి ప్రత్యామ్నాయం లేకుండా పోతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయం ఏర్పడినా అది టిడిపి కాకుండా వేరే పార్టీ అవుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)