చిత్తూరు జిల్లా వైసీపీ పెద్దాయన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ ఘాటు విమర్శలకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల రెండు మేజర్ ఆపరేషన్లు చేయించుకుని ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటూ రోజా కోలుకుంటున్నారు. అయితే తిరుపతి ఉప పోరు నేపథ్యంలో ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్నికల్లో తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు వేసుకున్నారని, దీనంతటికి మంత్రి పెద్దిరెడ్డే కారణమని టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డిని వీరప్పన్‌తో లోకేశ్ పోల్చడంపై రోజా విరుచుకుపడ్డారు.
ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇదే సందర్భంలో జగన్ పాలనా విధానాలను ప్రశంసలతో ముంచెత్తారు.
ఒక్క రూపాయి పంచకుండా, మద్యం ఇవ్వకుండా.. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర లేపారని రోజా అన్నారు. జగన్ పాలన, సంక్షేమ పథకాలతో ఓటర్ల మనసు గెలిచారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ గగ్గోలు, బురద చల్లే కార్యక్రమాలు చూస్తుంటే, వారు ఓడిపోతున్నారని చెప్పకనే చెబుతున్నారన్నారు. తాను ఓడిపోతానన్నా, తనకు నష్టం జరుగుతుందనే విషయం తెలియగానే కొత్త డ్రామాకు తెరలేపడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.
గతంలో 2019లో వైసీపీ ఈవీఎంల వల్ల గెలిచిందని ఏడ్చారన్నారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపుల వల్ల గెలిచా మని ప్రత్యర్థులు ఏడ్చారన్నారు. ఈ రోజు దొంగ ఓట్ల వల్ల గెలవబోతున్నామని ఏడ్చుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. సాకులకు మరోపేరు చేతికాని తనమని చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేశ్ వల్ల ఒక చేతగాని వాడిగా మిగిలి పోయి క్యాడర్ కూడా నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు కూడా ఛీ కొట్టే దుస్థితి వచ్చిందన్నారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబును చూసి ఎంత చేతకాని వాడో టీడీపీ కేడరే అర్థం చేసుకుందన్నారు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో వాళ్లకు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వీధులకెక్కి గగ్గోలు చేస్తు న్నారని, పోలింగ్ బూతుల్లో మీకు ఏజెంట్లు లేరా అని రోజా నిలదీశారు. ఏజెంట్లు ఉంటే అక్కడ దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వాళ్లను ఎందుకు పట్టుకోలేదని ఆమె ప్రశ్నించారు.
రోడ్డు మీద ఆల్రెడీ డ్రామాను క్రియేట్ చేసుకుని, మీ అనుకూల మీడియాతో వైసీపీ మీద బురద చల్లి, జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రతిష్టలు తగ్గించాలని, అలాగే పార్టీకి చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైసీపీకి, జగన్‌మోహన్‌రెడ్డికి లేదని ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడికి కూడా తెలుసన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీరప్పన్ అని మాట్లాడ్డం చాలా తప్పు అని రోజా అన్నారు. గతంలో వీరప్పన్ ఎవరో మీరు గుర్తించా రన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డిని వీరప్పన్‌గా గుర్తించారన్నారు. ఆ వీరప్పన్ గురించి ఎన్ని మాట్లాడారు? మళ్లీ మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు ఆ వీరప్పన్‌ని తిరుపతి ఉప ఎన్నికకు ఇన్ చార్జ్‌గా ఎందుకు పెట్టుకున్నారో సిగ్గులేని మీ గురించి ప్రజలకు తెలుసన్నారు.
పెద్దిరెడ్డిని వీరప్పన్ అని విమర్శించినందుకు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. రాజకీయాలను భ్రష్టు పట్టిచ్చిందే చంద్రబాబు అని రోజా ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టు 17వ తేదీ దాటేసిందని, ఇక పార్టీ లేదు, తొక్కాలేదని రోజా విరుచుకు పడ్డారు.