విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజనే ఇపుడు ఊపిరి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఓ వైపు పెద్ద ఎత్తున ఆందోళలను జరుగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం మొండిపట్టుదల మీదనే ఉంటుంది. అయితే ధాటీగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ మరోసారి…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఓ వైపు పెద్ద ఎత్తున ఆందోళలను జరుగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం మొండిపట్టుదల మీదనే ఉంటుంది. అయితే ధాటీగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ మరోసారి విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు అందరికీ గుర్తుకువస్తోంది. పాహిమాం అంటూ విశాఖ  ఉక్కునే దిక్కు అనాల్సివస్తోంది.

విశాఖ ఉక్కులో లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. కరోనా వేళ ఆక్సిజన్ ఎంతటి అవసరమో అందరికీ తెలుసు. గత ఏడాది కరోనా వేళ ఏకంగా 8,842 టన్నుల ఆక్సిజన్ ని తయారు చేసి ఆంధ్రా తెలంగాణా ఒడిషాలకే కాదు యావత్తు దేశానికి సరఫరా చేసిన ఘనత విశాఖ ఉక్కుది.

ఇపుడు కూడా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఉక్కు కర్మాగారం నడుం కడుతోంది. దేశానికి సరిపడా ఆక్సిజన్ ని సర‌ఫరా చేసే విషయంలో మరో మారు తమ సత్తా చాటుతామని ఉక్కు అధికారులు ముందుకు వచ్చారు. 

ఇపుడు దేశాన ఎటు చూసినా ఆక్సిజన్ కొరతే కనిపిస్తోంది. ఈ సమయంలో ఊపిరి పోస్తున్న ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని గుర్తించాలని కార్మికులు అంటున్నారు. మరి ప్రాణం పోస్తున్న ఉక్కు కర్మాగారం ప్రాణం తీయాలనుకోవడం దారుణమే కదూ అన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది