పెద్ద సినిమాలను పెద్ద రేట్లకు అమ్ముతారు. ఆపైన ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉపయోగించుకుని, రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెచ్చుకుంటారు. ఫ్యాన్స్ కావచ్చు, సినిమా సరదా వున్నవాళ్లు కావచ్చు, జేబులు ఖాళీ చేసుకుని సినిమా చూస్తారు. పైసల్ వసూల్ అవుతాయి. ఇదే గత కొంత కాలంగా పెద్ద సినిమాల స్ట్రాటజీ.
ఈ దసరా విడుదల అరవింద సమేత వీరరాఘవకు కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేసే విధంగా కార్యక్రమం సాగుతోందని తెలుస్తోంది. ఆంధ్రలో అఫీషియల్ గా జీవో తెచ్చి, 200 యూనిఫారమ్ టికెట్ ను తొలివారం అమలు చేసేలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే నైజాం ఇలాంటి టికెట్ ల పెంపు వ్యవహారాలు తక్కువ. కానీ అరవిందను నైజాంకు కొన్న దిల్ రాజు ఇక్కడ కూడా వంద రూపాయలకు బదులు 120 రూపాయల యూనిఫారమ్ టికెట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇక్కడ అనుమతి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలా? కోర్టు నుంచి తెచ్చుకోవాలా? అన్నది క్లియర్ కావాల్సి వుంది.
అరవింద సమేత వీరరాఘవను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లకే విక్రయించారు. అందువల్ల వేగంగా రికవరీ కావాలంటే, ఇలా టికెట్ రేట్లు పెంచడం అన్నది బయ్యర్లకు తప్పదు.