మతం కోసం మనిషా? మనిషి కోసం మతమా?

మతం వుండాల్సింది వ్యక్తికి, రాజ్యానికి కాదు. ప్రజాస్వామ్యంలో వుంటూ కూడా ఈ ముక్క మాటిమాటికీ చెప్పాల్సి వస్తోంది. ప్రేమించి పెళ్ళిచేసుకున్నాక కూడా, ‘నామనసులో నువ్వే వున్నావ్’, అని ప్రతి పది నిమిషాలకో సారి చెప్పినట్లు.…

మతం వుండాల్సింది వ్యక్తికి, రాజ్యానికి కాదు. ప్రజాస్వామ్యంలో వుంటూ కూడా ఈ ముక్క మాటిమాటికీ చెప్పాల్సి వస్తోంది. ప్రేమించి పెళ్ళిచేసుకున్నాక కూడా, ‘నామనసులో నువ్వే వున్నావ్’, అని ప్రతి పది నిమిషాలకో సారి చెప్పినట్లు.

మతంలో పుడతామా? మతాన్ని ఎంచుకుంటామా? చెప్పటానికి ముఖమాట పడతారు కానీ, మనదేశంలో చాలా మంది తాము ‘మతంలో పుడతామనే’ అనుకుంటారు. అంతే కదా మరి! ఒకరు హిందువుగా పుడతారు. ఇంకొకరు ముస్లింగా పుడతారు. మరొకరు క్రైస్తవుడుగా పుడతారు. పుట్టాక, పెరిగాక, తెలివొచ్చాక కదా మతం తీసుకునేది, అని అనటానికే వారిదగ్గర అవకాశమే వుండదు. వారి దృష్టిలో మనిషి మతాన్ని స్వీకరించడు. మతమే మనిషిని స్వీకరిస్తుంది.

ఉమ్మడి కుటుంబాలుండేటప్పుడు అమ్మాయికి భర్తను వెతుక్కునే పని వుండేది కాదు. ఆమె భూమ్మీద పడేసరికే భర్త పుట్టేసుంటాడు, అత్త కొడుగ్గానో, అమ్మ తమ్ముడుగానో. ఆమె భర్తను స్వీకరించటం కాదు, భర్తే ఆమెను స్వీకరిస్తాడు.

కానీ మతమన్నది బుధ్ధి పెరిగాక తనకు తాను ఎంచుకునే స్వేఛ్చ అని చాలా మందికి నమ్మ బుధ్ధికాదు. నమ్మినా ఒప్పుకో బుధ్ధి కాదు. జీవితభాగస్వామిని  ఈడొచ్చాక తనకు తానుగా ఎంచుకునే స్వేఛ్చ ఇచ్చినా అంతే. తీసుకోబుధ్ధి కాదు.

అందుకే మత స్వేఛ్చను పదే పదే గుర్తు చెయ్యాల్సి వస్తోంది. సుప్రీం కోర్టు కూడా (9 ఏప్రిల్ 2021) మళ్ళీ ఇంకొసారి గుర్తు చేసింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే ఫిర్యాదు దారు ‘మతాంతీకరణల’ నిలుపు చెయ్యటం మీద కోర్టు కెక్కారు. మరీ ఆ ఒక్కటీ అడిగితే బాగుండదని అనుకున్నారో యేమో, దీంతో పాటు ‘మూఢనమ్మకాలనూ, చేతబడులనూ’  ఆపాల్సిన జాబితాలో చేర్చారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఫిర్యాదు దారు ఆంతర్యాన్ని గ్రహించి మండిపడింది. 

ధర్మాసనం తరపున జస్టిస్ రోహింగ్‌టన్ ఎఫ్. నారిమన్ ఈ సందర్భంగా మళ్ళీ ఇదే విషయాన్ని రాజ్యాంగం నుంచి ఉటంకించాల్సి వచ్చింది: పద్దెనిమిదేళ్ళు దాటాక వ్యక్తి తన మతాన్ని తాను ఎందుకు ఎంచుకోకూడదు? ఇలాంటి రిట్ పిటిషన్ అవసరమా?’ అని అడగటమే కాదు, ‘ఫిర్యాదు వెనక్కి తీసుకోకుండా, వాదన కొనసాగిస్తే, పర్యావసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంద’ని హెచ్చరించారు కూడా.

ఈ విషయం భారత రాజ్యాంగం 25 అధికరణంలో రాసి వున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యక్తికి తను నచ్చిన మతాన్ని స్వీకరించటానికీ, ఆచరించటానికీ, ప్రచారం చెయ్యటానికీ వున్న ప్రాథమిక హక్కు గురించి తెలియ పరిచారు. తన మతాన్ని ఎంచుకొనే విషయంలోనూ, తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోని విషయంలోనూ వక్తి తనకు తానే తుది నిర్ణేత అని కూడా విశదపరిచారు.

రాచరికపు రోజుల్లో రాజమతమే, జనమతంగా వుండాలి. లేకుంటే రాజు ఊరుకోడు. అందుకని మతాన్ని ఎంచుకునే స్వేఛ్చ అప్పట్లో ప్రజలకు లేదు. ఒక్కొక్క సారి మతాధిపతులే రాజ్యాల్నేలే వారు. అప్పుడూ అంతే. కానీ ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాల తర్వాత ఏ వ్యవస్థకయినా వ్యక్తి కేంద్ర బిందువయ్యాడు. 

మతంలో పుట్టటం కాదు, పుట్టాక, పెరిగాక ఇష్టమతాన్ని స్వీకరించే అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత పుట్టిన ప్రజాస్వామ్యాలు ఈ స్వేఛ్చను గుర్తించాయి. తీసుకునే మతం మీద ప్రభుత్వ పెత్తనాన్ని, సంఘ ప్రమేయాన్నీ ఉపసంహరించాయి. అందుకు ఇండియా మినహాయింపు. బ్రిటిష్ వలస దేశంగా ఇండియా వున్నప్పుడే, ఈ స్వేఛ్చ అందుబాటులోకి వచ్చింది. లేక పోతే బ్రిటిష్ పాలకుల మతమే, భారతీయుల మతమయ్యి వుండేది.

ఇండియాకు స్వరాజ్యం వచ్చాక ఈ స్వేఛ్చకు మరింత రక్షణ కల్పించాలని రాజ్యాంగ రూపకర్తలు భావించారు. సంఘాన్నీ, పాలననూ నియంత్రిస్తూ వస్తున్న మతాలు ఆచారాల పేరిటి వ్యక్తుల సమానత్వాన్ని దెబ్బతీయవచ్చేమోనని అనుమానించారు. ఉదాహరణకి ఆలయాల్లోకి కొందరికి ప్రవేశం కల్పించి, కొందరిని నిరోధించ వచ్చు. ఇది మతంలో అంతర్బాగమంటే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుధ్ధం. 

ఇలాంటి విషయాల్లో మాత్రం రాజ్యం మతంలో జోక్యం కలిగించుకునే వెసులుబాటును వుంచారు. దీని ప్రకారం, సాంఘిక సంక్షేమం కోసం, సాంఘిక సంస్కరణల కోసం దేశంలో ప్రధాన విశ్వాసంగా వున్న హిందూ మతంపై చట్టాలు చెయ్యవచ్చు. అంతేకానీ మతాన్ని రక్షించటం కోసం సాంఘిక సమానత్వాన్ని బలిపెట్టే చట్టాలు కాదు.

అలాగే, మతాన్ని రాజ్యానికే దూరం పెట్టటమంటే, రాజకీయాలకు దగ్గర పెట్టటమని అర్థం కాదు కదా! కానీ, మతాన్నే రాజకీయాల్లో అంతర్భాగం చేస్తే, సులభంగా రాణించవచ్చని కొందరు నమ్మేశారు. తక్కువ సంఖ్యలో నమ్మే వారి మతం మీద ఎక్కువ సంఖ్యలో నమ్మేవారికి ద్వేషాన్ని పెంచటం. ఇది ‘మెజారిటీ తత్వం’. ఎక్కడయినా తక్కువ సంఖ్య వున్న వారికి అభద్రత వుంటుంది. సహజం. అందుకనే మైనారిటీలకు కొంత రక్షణనూ, భరోసానూ ప్రపంచంలో ఏప్రభుత్వాలయినా ఇస్తుంటాయి. కానీ మెజారిటీ మతస్తులకు ‘అభద్రత’ వుంటుందా? ఉంటుంది. 

ఎప్పుడూ? ఏదో ఒక నాటికి ఈ మెజారిటీ మతం కాస్తా, మైనారిటీ మతమయిపోతుందని భయపెట్టినప్పుడు. అదెప్పుడు సాధ్యం మెజారిటీ మతంలోనుంచి వ్యక్తులు పెద్ద యెత్తున మైనారిటీ మతాల్లో కి వెళ్ళిపోయినప్పుడు. అలా ఎలా వెళ్ళిపోతారూ? ఆటు నుంచి కూడా ఇటు రావచ్చు కదా! ‘మతాంతీకరణ’ అంటే ఇటు నుంచి, అటేనా? అటు నించి ఇటు వుండదా?

నిజానికి ఈ దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం, హిందువులు 80 శాతం మంది వున్నారు. ముస్లింలు 14 శాతం, క్రైస్తవులు 2.3 శాతం. ‘మతాంతీకరణలు’ అంత భారీ యెత్తున జరిగితే హిందువులే అంత ఆధిక్యంలో ఎలా వుంటారు? అయినా ఎందుకు ఈ అభద్రత. ఒక వేళ వేరే మతస్తులు ఏరి కోరి హిందూ మతం స్వీకరించ వచ్చు కదా! అలే చేస్తే వారిని ఏ ‘కులం’లో కూర్చోబెట్టాలనే సమస్య రావచ్చు. 

కులవ్యవస్థ లేని హిందూ మతాన్ని ఏర్పరచుకోగలిగితే ఈ సమస్య ఎదురుకాక పోవచ్చు. కానీ, ఆ సంస్కరణ చెయ్యలేరు. చెయ్యకుండా మతంలోకి ఆహ్వానించటం కష్టమే. ఒక వేళ నిజంగానే  జనం తమకు ఇష్టం వచ్చిన మతం తీసుకుని వెళ్ళిపోతుంటే, నిలుపు చెయ్యాలని రాజ్యాంగంలో రాసి వుందా? దేశంలో ఏ మతస్తులు ఎంత మంది వున్నా, అందరూ ఒకే దేశస్తులు కదా! ఇలా ఆలోచించగలగటమే అసలు సిసలైన దేశభక్తి కాగలదు.