ఎట్టకేలకు తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. ఈవీఎంలలో ఓటరు అభిప్రాయం భద్రంగా దాగి ఉంది. ఇక రాజకీయ పార్టీల భవిష్యత్ తేలాల్సి వుంది. వచ్చే నెల 2న ఏఏ పార్టీల సత్తా ఏంటో తేలనుంది. అంత వరకూ ఉత్కంఠ తప్పదు. అయితే గెలుపోటములపై స్పష్టత ఉంది. తేలాల్సింది ఎవరికెన్ని ఓట్లు అనేదే. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీకి మెజార్టీపై, టీడీపీ, బీజేపీ-జనసేన కూటమికి మాత్రం తమకు వచ్చే ఓట్లపై ఆందోళన నెలకుందని చెప్పొచ్చు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వివిధ సర్వే సంస్థలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో పోలింగ్‌పై విశ్లేషణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార పార్టీ వైసీపీ మెజార్టీపై ఎలాంటి అంచనాతో ఉందో తెలుసుకుందాం. ఆ పార్టీ లెక్కలేంటో చూద్దాం.
తిరుపతి లోక్‌సభ పరిధిలో 17,10,699 ఓట్లు ఉండగా, ఉప ఎన్నికలో 10,99,784 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. ఇదే గత సార్వత్రిక ఎన్నికల్లో 13,13,515 ఓట్లు పోల్ అయ్యాయి. అప్పట్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,28,376 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులతో పాటు నోటా పోటీలో ఉన్నట్టే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే జనసేన పొత్తులో భాగంగా నిలిచిన బీఎస్పీ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటే నోటాకు అధిక ఓట్లు వచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు 25,750 ఓట్లు రావడం గమనార్హం. ప్రస్తుత ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులతో పాటు నోటా కూడా పోటీలో ఉన్నట్టే పరిగణలోకి తీసుకోవాలి.
గత సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా మెజార్టీలతో పోల్చుకుని, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతంత మెజార్టీ వస్తుందని వైసీపీ అంచనా వేస్తున్నదో తెలుసుకుందాం. గత సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లిలో 15,926, గూడూరులో 46,381, సూళ్లూరు పేటలో 57,276, వెంకటగిరిలో 36,199, శ్రీకాళహస్తిలో 32,919, సత్యవేడులో 42,196 ఓట్ల ఆధిక్యత వైసీపీకి లభించింది. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మాత్రం టీడీపీకి 3,578 ఓట్ల ఆధిక్యత లభించడం గమనార్హం. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 7,22,877 ఓట్లు, టీడీపీకి 4,94,501 ఓట్లు, కాంగ్రెస్‌కు 24,039 ఓట్లు, బీజేపీకి 16,125 ఓట్లు దక్కాయి.
ప్రస్తుత ఉప ఎన్నిక విషయానికి వస్తే నియోజక వర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలుసుకుందాం. సర్వేపల్లిలో 1,55,550, గూడూరులో 1,58,390, సూళ్లూరుపేటలో 1,70,730, వెంకటగిరిలో 1,51,392, తిరుపతిలో 1,42,814, శ్రీకాళహస్తిలో 1,67,768, సత్యవేడులో 1,53,140 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లు 10,99,784. గతంలోనూ, ఇప్పుడు తమకు కలిసొచ్చే అంశంగా వైసీపీ చెబుతున్నదేంటంటే… ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగడం.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ ఓటింగ్ సరళిని చూస్తే …మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువగా ఉండడం వైసీపీకి ఆనందాన్ని ఇస్తోంది. సత్యవేడులో అత్యధికంగా 72.68%, సూళ్లూరుపేటలో 70.93%, గూడూరులో 63.81% నమోదైంది. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్తి, ఓటింగ్‌పై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ పడిన ఓట్లలో అత్యధికం వైసీపీ వైపే మొగ్గు ఉంటుందని ఆ పార్టీ పెద్దలు నమ్ముతున్నారు.
ప్రస్తుతం నియోజక వర్గాల వారీగా మెజార్టీపై వైసీపీ అంచనా గురించి తెలుసుకుందాం. సూళ్లూరుపేటలో కాకాణి రూపంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. ఇదే సందర్భంలో టీడీపీకి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూపంలో బలమైన నాయకత్వం ఉంది. అయితే ఎన్నికలకు వచ్చే సరికి సోమిరెడ్డి వైపు ఓటర్లు ఆసక్తి కనబరచడం లేదని గత కొన్ని ఎన్నికలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో సర్వేపల్లిలో 35 వేలు, గూడూరులో 53 వేలు, సూళ్లూరుపేటలో 65 వేలు, వెంకటగిరిలో 40 వేలు, శ్రీకాళహస్తిలో 40 వేలు, సత్యవేడులో 60 వేలు, తిరుపతిలో 30 వేల మెజార్టీ చొప్పున మొత్తం 3,23,000 మెజార్టీ వస్తుందని అంచనా. ఇది కనీస మెజార్టీ మాత్రమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మెజార్టీ పెరగడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని దృఢంగా చెబుతున్నారు. ఓటింగ్ శాతం తగ్గడం వల్లే మెజార్టీపై తమ అంచనాలు తగ్గాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
గూడూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలను సొమ్ము చేసుకునే పరిస్థితిలో టీడీపీ లేదు. వెంకటగిరిలో అక్కడి రాజ వంశస్తులు వైసీపీ వైపు ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తన పట్టు సడలకూడదనే పట్టుదలతో గట్టిగా పనిచేశారు. ఇక్కడ టీడీపీకి కొంతలో కొంత మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాయకత్వం బలమనే చెప్పాలి. లేదంటే పార్టీ మరింత బలహీన పడేది. ఇక సూళ్లూరుపేటలో టీడీపీ క్రమంగా తన పునాదులనే కోల్పోతోంది. వైసీపీలో ఎలాంటి వర్గవిభేదాలు లేకపోవడం కలిసొచ్చే అంశం.
సత్యవేడులో ప్రతిపక్ష టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని చావు దెబ్బతీస్తున్నాయి. టీడీపీ నేతల మధ్య విభేదాల వల్ల మరోసారి ఆ పార్టీ నష్టపోయింది. శ్రీకాళహస్తి విషయానికి వస్తే ఇసుక,శ్రీకాళహస్తి ఆలయంలో అధికార పార్టీ మితిమీరిన జోక్యంపై ప్రజల్లో అసంతృప్తి నెలకుంది. అయినప్పటికీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో అంతగా కనిపించలేదనే చెప్పొచ్చు. పైగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుప్రసాద్ ఈ ప్రాంత వాసి కావడం కలిసొచ్చే అంశం. తిరుపతి విషయానికి వస్తే గతంలో కంటే వైసీపీ అనూహ్యంగా బలపడింది.
ఇక్కడ బీసీలు వైసీపీ వైపు టర్న్ కావడంతో ఫలితాలు తారుమారు అవుతున్నాయి. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మైనస్ నుంచి నేడు ఫ్లస్లోకి చేరింది. ఇది వైసీపీకి కలిసొచ్చే పరిణామంగా చెప్పొచ్చు. మొత్తానికి గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 16 % ఓటింగ్ తగ్గినా, మెజార్టీ మాత్రం పెంచుకుంటామనే ధీమాలో అధికార పార్టీ ఉంది. ప్రధానంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే… ప్రజలను తమ వైపు ఏకపక్షంగా నిలిచేలా చేశాయని అధికార పార్టీ బలంగా విశ్వసిస్తోంది.
సొదుం రమణ