తిరుప‌తి ఫ‌లితం త‌ర్వాత‌.. ప‌వ‌న్, బీజేపీ డీల్ ఏంటి?

క‌ర్ర‌విర‌గ‌న‌ట్టుగా పాము చావ‌న‌ట్టుగా సాగుతోంది బీజేపీ, జ‌న‌సేన‌ల పొత్తు ప్ర‌యాణం. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలుపంచుకున్నారు. అలాగ‌ని బీజేపీ అభ్య‌ర్థి విజ‌యం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌డ‌దాకా ప్ర‌యత్నాలు…

క‌ర్ర‌విర‌గ‌న‌ట్టుగా పాము చావ‌న‌ట్టుగా సాగుతోంది బీజేపీ, జ‌న‌సేన‌ల పొత్తు ప్ర‌యాణం. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలుపంచుకున్నారు. అలాగ‌ని బీజేపీ అభ్య‌ర్థి విజ‌యం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌డ‌దాకా ప్ర‌యత్నాలు అయితే చేయ‌లేదు! బీజేపీ కూడా అంతే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పూచిక‌పుల్ల‌లా ప‌డేయ‌లేదు. 

ఆయ‌న‌ను రాష్ట్రానికే అధిప‌తి చేయ‌డ‌మంటూ ఏపీ బీజేపీ విభాగం అధినేత ప్ర‌క‌టించారు. అయితే రాష్ట్రానికి అధిప‌తి అంటే?  సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ ను రాష్ట్రానికి అధిప‌తిగా పేర్కొన‌వ‌చ్చు. అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఏదైనా రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా చేస్తారా? అనే సందేహం కూడా అక్క‌డ రావొచ్చు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అంత లోతుగా ఆలోచించ‌రు అని బీజేపీ నేత‌ల కాన్ఫిడెన్స్ కాబోలు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం.. సీఎం.. అంటూ నిన‌దించి ఆనందించే అభిమానుల‌ను అల‌రించ‌డానికి బీజేపీ ఏపీ విభాగం అధ్య‌క్షులు గారు అలాంటి ప్ర‌క‌ట‌న ఒక‌టి చేసి ఉండొచ్చు.

ఈ ప‌రిణామాల మ‌ధ్య‌న బీజేపీ, జ‌న‌సేన‌ల ప‌య‌నం ఇక‌పై ఎలా సాగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఒక‌వేళ తిరుప‌తి బై పోల్ లో బీజేపీ అభ్య‌ర్థికి చెప్పుకోద‌గిన స్థాయిలో ఓట్లు వ‌స్తే.. ఈ పొత్తు ప్ర‌యాణం ఫ‌లితాన్ని ఇచ్చిన‌ట్టే. క‌నీసం బీజేపీ అభ్య‌ర్థి రెండో స్థానంలో నిలిచిన‌ప్పుడే ఈ పొత్తు ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తున్న‌ట్టు. ఎందుకంటే.. తిరుప‌తి చాలా ప్ర‌త్యేక‌మైన నియోజ‌క‌వ‌ర్గం. చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపించిన‌ది తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌మే. 

క్యాస్ట్ ఈక్వెష‌న్ జ‌న‌సేన‌కు అలాంటి అనుకూల‌త‌ను ఇస్తున్నాయి. మ‌రి ఆ మాత్రం ఓట్లు బీజేపీ అభ్య‌ర్థికి ప‌డితే.. ఈ పొత్తు ఫ‌లించిన‌ట్టే. క‌నీసం తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి వ‌ర‌కూ అయినా బీజేపీ అభ్య‌ర్థి లీడ్ సంపాదించాలి! లేక‌పోతే  జ‌న‌సేన సంప్ర‌దాయ ఓటు బ్యాంకు కూడా బీజేపీ వైపు మొగ్గు చూప‌న‌ట్టే! తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో బీజేపీ చెప్పుకోద‌గిన స్థాయిలో ఓట్లను సంపాదించుకుంటే ఆ పార్టీ వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ వెయిట్ ఎంతో కొంత క‌చ్చితంగా పెరుగుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎంతో కొంత ప్రాధాన్య‌త‌ను ఇస్తే వ‌చ్చేదే త‌ప్ప పోయేదేమీ లేద‌ని బీజేపీ కి అర్థం అవుతుంది. అలాంటి స‌మ‌యంలో ఏ రాజ్య‌స‌భ సీటుకో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను నామినేట్ చేయ‌వ‌చ్చు. 

ఇది వ‌ర‌కూ తాము ఎద‌గాల‌నుకున్న రాష్ట్రాల్లో సినిమా వాళ్ల‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తూ వ‌చ్చింది బీజేపీ. కేర‌ళ‌లో సురేష్ గోపికి అలాంటి అవ‌కాశ‌మే ఇచ్చింది. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా క‌మ‌లం పార్టీ అలాంటి ఛాన్స్ ఇవ్వొచ్చు. కానీ అది జ‌ర‌గాలంటే మాత్రం జ‌న‌సేన బీజేపీలోకి విలీనం ష‌ర‌తును విధించ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బీజేపీ రాజ్య‌స‌భ సీటును ఆఫ‌ర్  చేసి, విలీనం అనే చాయిస్ ను ఇస్తే ప‌వ‌న్ కు అంత‌క‌న్నా అదృష్టం కూడా లేక‌పోవ‌చ్చు. ఇప్ప‌టికైతే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట క‌నీసం చెప్పుకోవ‌డానికి కూడా న‌లుగురు నేత‌లు లేరు. ఉన్న వాళ్లు కూడా ఒక్కొక్క‌రుగా రాజీనామాలు చేసి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ త‌రుణంలో బీజేపీ విలీనం ఆఫ‌ర్ ను ఇస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జాక్ పాటే. అయితే.. తిరుప‌తి బై పోల్ ఫ‌లితం, అక్క‌డ బీజేపీ సాధించే ఓట్లు కూడా కీల‌క పాత్ర‌ను పోషిస్తాయి.

క‌మ‌లం పార్టీ నోటాను, కాంగ్రెస్ ను దాటి.. తెలుగుదేశం పార్టీని కూడా దాటితే.. అది సానుకూల ఫ‌లితం. ఒక‌వేళ బీజేపీ అభ్య‌ర్థి కేవ‌లం కాంగ్రెస్ ను,నోటాను మాత్ర‌మే దాటితే.. కథ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టే. ఎలాగూ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాలు ఒప్పుకున్నారు. చేతిలో కొన్ని సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసుకోవ‌డం.. ఆ ఆరేడు నెల‌ల‌కో ఒకసారి షూటింగు విరామాల్లో హూత్ హాథ్.. అన‌డం త‌ప్ప ఇక వేరే రాజ‌కీయ వ్యూహాలు, కార్య‌క‌లాపాలూ ఉండ‌క‌పోవ‌చ్చు.

మొత్తానికి బీజేపీ హై క‌మాండ్ వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ విలువ‌ను తిరుప‌తి ఉప ఎన్నిక నిర్దేశించ‌బోతూ ఉంది! తిరుప‌తిలో తేడా కొడితే ఏపీ బీజేపీ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మ‌రింత లైట్ తీసుకునే అవ‌కాశం ఉంది. క‌మ‌లం పార్టీ హై క‌మాండ్ దృష్టిలో అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రింత ప‌లుచ‌నవుతారు కూడా!