తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. 14 సంవత్సరాల పాటు సీఎం, మరో 12 యేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత. వయసు 70 దాటింది. సాధారణంగా 70 దాటిన వారి భవితవ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. 60 యేళ్లే రిటైర్మెంట్ ఏజ్. అలాంటిది 70 తర్వాత కృష్ణా,రామా అనుకోవడం తప్ప మరేం లేదని మన దగ్గరి ప్రవచన కర్తలు కూడా చెబుతూ ఉంటారు.
70 తర్వాత కనీసం ఇంట్లో వాళ్లను కూడా పట్టించుకోవద్దని ఈ మధ్యకాలంలో టీవీలో కనిపించే ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. మనవడి చదువు, మనవడి పెళ్లి.. లాంటివి కూడా మీకు అనవసరమని చెబుతూ ఉంటారు. ఆ సమయంలో ఎంత నిమిత్తమాత్రులుగా ఉంటే, అది చెయ్యమంటూ, ఇది చెయ్యమంటూ ఇంట్లో వాళ్లను ఒత్తిడి చేయకపోతే అదే మంచి వ్యక్తిత్వం అంటూ హిందూ ప్రవచన కర్తలు ఒత్తి చెబుతున్నారు.
కృష్ణా,రామ అనుకోవడం మాట అటుంచి.. ఈ వయసులో చంద్రబాబు నాయుడు బూతులు మాట్లాడుతున్నారు. పబ్లిక్కా.. ఏం పీకుతారా, పీకారా, పీకబోతున్నారా.. అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు! చంద్రబాబు అనుభవించిన హోదాలను పక్కన పెట్టినా, ఆ వయసు వ్యక్తి, పబ్లిక్ గా మీడియా మైకుల ముందు అలాంటి పదజాలం ఉపయోగించడం చాలా దారుణం. కాస్తైనా ఇంగితం ఉంటే చంద్రబాబు నాయుడు అలాంటి మాటలు మాట్లాడరు. నలుగురికీ చెప్పే వయసులో చిన్న పిల్ల చేత కూడా ఛీత్కారం పొందేలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఎంత అధికారం లేకపోతే అంత ఫ్ట్రస్ట్రేషన్ పనికి రాకపోవచ్చు. ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో చంద్రబాబు నాయుడు అలాంటి ప్రసంగాలతో ఛీత్కారాలు పొందుతూ ఉన్నారు.
ఇక ఆయన ఈ ఫ్రస్ట్రేషన్‌లోనే ఉండగా వచ్చిన తిరుపతి ఉప ఎన్నికలో ఆయన తన గోడునంతా వెల్లబోసుకున్నారు. తన పాల వ్యాపారాన్ని దెబ్బతీశారని, అమరావతిలో భూముల ధరలు పెరగకుండా చేశారని, పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోనీయలేదని, ఆంధ్రజ్యోతిని ఇబ్బంది పెడుతూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికలో చెప్పుకుని వాపోయారు! ఇందులో ప్రజా సంబంధమున్న ఇష్యూస్ ఏమీ లేవు!
హెరీటేజ్ పాల వ్యాపారం మొత్తం దివాళా తీసినా ఏపీ జనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. రైతులకు కావాల్సింది మంచి ధర పెట్టి కొనే డైరీ యాజమాన్యం. అది హెరిటేజే కానక్కర్లేదు. హెరిటేజ్ కు కావాల్సింది చౌక ధరకే పాలు. అమూల్ రాకను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అమూల్ సహకార డైరీ. దేశంలోనే క్షీర విప్లమానికి అంకురార్పణ చేసిన సంస్థ. అది కూడా రైతులకు మెరుగైన ధరను చెల్లించి పాలను కొనుగోలు చేయడానికి ఆ సంస్థ ముందుకు వస్తోంది. అలాంటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమూల్ ను ఈ దరిదాపుల్లోకి రానీయకూడదా! మరీ ఇంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు ఎలా చెప్పుకుంటూ ఉన్నారో ఏమో!
ఇక అమరావతిలో భూముల ధరల గురించి మాట్లాడితే తిరుపతిలో ఓటేస్తారా? పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు తిరుపతి ఉప ఎన్నికల అంశాలు అవుతాయా! ఆ పై సరైన మద్యం దొరకలేదని చంద్రబాబు నాయుడు వాపోవడం మరో ప్రహసనం. ఏతావాతా.. చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల ప్రసంగాల తీరును గమనిస్తే, పచ్చి స్వార్థం, తన ప్రయోజనాల కోసం అంతా ఓటేయాలని అనడం తప్ప ప్రజాప్రయోజనాలు ఏమీ కనపడవు. తన రాజకీయ ఉనికి కోసం, తన వ్యాపారాలను కాపాడుకోవడం, తన పార్ట్ నర్ సినిమాల కోసం చంద్రబాబు నాయుడు ఓటడుగుతున్నారు. రాష్ట్రం అంటే తన జాగీరు అయినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
ఒక్కటైతే వాస్తవం… సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సీటు పరిధిలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లను సాధించుకోలేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గతంలో కన్నా పెరిగినా.. తెలుగుదేశం పార్టీ దుకాణం మూతకు రెడీ అయినట్టే. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55 శాతం, టీడీపీ 37 శాతం ఓట్లను పొందాయి.
ఎన్ని ఓట్లు పోలింగ్ అయినా.. శాతాల లెక్కను బట్టి చూస్తే ఆదరణ పెరిగిందో, తగ్గిందో తేటతెల్లం కానుంది. తిరుపతిలో చంద్రబాబు నాయుడే ఎనిమిది రోజుల పాటు ప్రచారం చేశారు. ఇక లోకేష్ మరో పది రోజులకు పైనే ప్రచారం చేసినట్టున్నారు. ఇక చాలా కాలం కిందటే అభ్యర్థిని ప్రకటించారు. టీడీపీ ముఖ్యనేతలంతా తిరుపతిలోనే మకాం పెట్టి ప్రచారం సాగించారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ వాడుకోని అంశం అంటూ ఏమీ లేదు! అన్ని అంశాలనూ వాడేశారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇంతజేసీ 37 శాతం ఓట్లను అయినా పొందకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ కథ ఏపీలో ముగింపుకు చేరినట్టే, రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు ఉనికి కూడా కోల్పోవడం మొదలైనట్టే!