మొత్తానికి సుగాలి ప్రీతి హత్యాచారం కేసు సీబీఐ చేతికి వెళ్లనుండి. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లికి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. కర్నూలు పర్యటనలో తనను కలిసిన సుగాలి ప్రీతి తల్లి, కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. ఈ కేసులో తప్పకుండా న్యాయం చేస్తాం అని మాట ఇచ్చారు. మళ్లీ ఒకసారి ప్రీతి కుటుంబసబ్యులను తన కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. మొత్తానికి సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో.. ఆమె తల్లి తొలినుంచి చేస్తున్న డిమాండ్ నెరవేరినట్లయింది. సీఎం జగన్మోహన్ రెడ్డిని ముందే ఆశ్రయించి ఉంటే.. ఇంకా ముందే వారి కోరిక తీరి ఉండేదని పలువురు అంటన్నారు.
కర్నూలులో పదోతరగతి చదువుతున్న సుగాలిప్రీతి 2017లో దారుణంగా అత్యాచారానికి గురైంది. తర్వాత ఆమెను హత్య చేశారు. ఆమె చదువుతున్న పాఠశాల యాజమాన్యానికి చెందిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వారిని అప్పుడు అరెస్టుచేసిన పోలీసులు తర్వాత బెయిలుపై విడుదల చేశారు. వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కావడంతో.. వారిమీద పోలీసులు బలమైన కేసులు పెట్టకుండా.. కేసును నీరుగార్చారని ప్రీతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఒకసారి స్పందించారు. ఆ తర్వాత.. దానిని గాలికొదిలేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్ కొమ్ముకాస్తున్న తెలుగుదేశం ప్రభుత్వమే పాలన సాగిస్తున్నది గానీ.. నిందితులమీద బలమైన కేసులు నమోదు అయ్యేలా పవన్ ఏమీ చేయలేకపోయారు. ఇటీవలి మళ్లీ ఆ అంశాన్ని తలకెత్తుకున్నారు. తక్షణం సీబీఐ కేసు నమోదు చేయించాలంటూ.. కర్నూలులో ఓ ప్రదర్శనకూడా నిర్వహించారు. సీబీఐకు కేసు అప్పగించకపోతే గనుక.. తాను మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని కూడా ప్రకటించారు.
కానీ.. సుగాలి ప్రీతి కుటుంబసభ్యులు కర్నూలుకు వచ్చిన జగన్మోహన రెడ్డిని కలవగానే వారి సమస్య తీరిపోయింది. అమ్మాయిలపై జరిగే అత్యాచారాల విషయంలో.. తాను ప్రభుత్వంలోకి వచ్చిన నాటినుంచి దృఢవైఖరిని ప్రదర్శిస్తున్న జగన్మోహన రెడ్డి.. కేసును సీబీఐకు అప్పగించడానికి అంగీకరించారు. ప్రీతి కుటుంబీకులు పవన్ బదులుగా, ప్రభుత్వం మారిన తర్వాత ముందే జగన్ ను కలిసి ఉంటే ఇంకా త్వరగా ఇదే పని జరిగి ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.