కోతిపుండుని బ్రహ్మరాక్షసి చేయొద్దు

ఈ ఏప్రిల్ 14న సాక్షి దినపత్రికలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఒకటి ప్రచురించారు. అది వివాదాస్పదం అయింది. ఆ బొమ్మ వేసింది ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్. డాక్టర్ అంబేద్కర్ ని కేరికేచర్ గా వేసే…

ఈ ఏప్రిల్ 14న సాక్షి దినపత్రికలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఒకటి ప్రచురించారు. అది వివాదాస్పదం అయింది. ఆ బొమ్మ వేసింది ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్. డాక్టర్ అంబేద్కర్ ని కేరికేచర్ గా వేసే ప్రయత్నం చేశాడు శంకర్. అందులో అంబేద్కర్ ఆగ్రహంతో వున్నట్టు, లేదా మిడిగుడ్లతో చూస్తున్నట్టుగా వుంది.

ఇది చాలమందికి కోపకారణం అయింది. ముఖ్యంగా దళితుల మనోభావాలు గాయపడ్డాయి. దీన్ని తీవ్రమైన అవమానం అని దళిత సంఘాలు విమర్శించాయి. ఆర్టిస్టు, సంపాదకుడు, సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇది సమంజసమే అని అనుకుంటున్నా. ఈ దేశంలో పేదలు, ముఖ్యంగా దళితులు ప్రాణాధికంగా ప్రేమించే, గుండెల్లో దీపం పెట్టుకుని పూజించే మహా మేధావి అంబేద్కర్ బొమ్మ వేసేటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. అయితే డాక్టర్ అంబేద్కర్ బొమ్మని కావాలని, పని గట్టుకుని, అవమానించాలనే ఉద్దేశంతో వేసింది కాదు.

ఆర్ట్ లో ఇలస్ట్రేషన్, కార్టూన్, portrait, కేరికేచర్ అనే పద్ధతులు వుంటాయి. ఒక మనిషిలో వుండే, ప్రత్యేకంగా, కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాన్ని హైలైట్ చేస్తూ exaggerate చేస్తూ బొమ్మ వేయడాన్ని కేరికేచర్ అంటాం. ఉదాహరణకు ఇందిరా గాంధీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల కేరికేచర్లలో ముక్కుని బాగా సాగదీసి వేస్తారు. కార్ల్ మార్క్స్ ని అయితే జుట్టూ, గడ్డమూ గడ్డిమోపుల్లా వున్నట్టు వేయడం ఆనవాయితీ. చర్చిల్ ని మరీ లావుగా, ఫిడెల్ కాస్ట్రో ని పెద్ద చుట్టతో, గడ్డంతో మిలటరీ డ్రస్ లో abnormalగా వేయడం మనకి తెలుసు.

నల్గొండకి చెందిన ఆర్టిస్టు పామర్తి శంకర్ కార్టూనిస్ట్ మోహన్ ప్రియ శిష్యుడు. ఒక కల్లుగీత కార్మికుని కొడుకు. మోహన్ దగ్గర అయిదారు సంవత్సరాలు పని చేశాడు. వ్యక్తిగతంగా శంకర్ నాకు పాతికేళ్లకు పైగానే తెలుసు. మంచి ఆర్టిస్టు. సహృదయుడు. అందరితోనూ స్నేహంగా వుండే మనిషి. భేషజమూ, పొగరు లాంటివి ఏమాత్రమూ లేనివాడు. మోహన్, తన చుట్టూ వుండే అనేకమంది లాగానే శంకర్ పేదల పక్షపాతి. వార్త, జ్యోతి, సాక్షి దినపత్రికల్లో ఇన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నా శంకర్ మీద ఒక్క కంప్లయింటూ లేదు.

అంతెందుకు, కలేకూరి ప్రసాద్, లెల్లే సురేష్, మల్లెల వెంకటరావు, మద్దెల శాంతయ్య, తెనాలి వెంకటేశ్వరరావు, కవి శిఖామణి, అద్దంకి దయాకర్… వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు… ఇంకా అనేక మంది దళితులకు శంకర్ మంచి మిత్రుడు. కార్టూనిస్టుగా రాణిస్తూనే, కేరికేచరిస్టుగా అంతర్జాతీయ గుర్తింపు పొందినవాడు శంకర్. 2014లో వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు సాధించి, నెల్సన్ మండేలా కేరికేచర్ కి ఎనిమిది లక్షల రూపాయలు బహుమతి గెలుచుకున్నాడు.

గొప్ప కేరికేచర్లు, కార్టూన్లు వేసినందుకు 30కి పైగా అంతర్జాతీయ బహుమతులు పొందాడు. కేరికేచర్ల ఇంటర్నేషనల్ సెలక్షన్ కమిటీ (జూరీ) సభ్యునిగా అయిదుసార్లు ఎంపికై అరుదైన గౌరవాన్ని పొందినవాడు. ఆర్టిస్ట్ మోహన్ లాగే, ఈ దేశంలో పేదలు, దళితుల పక్షాన కచ్చితంగా నిలబడే మనిషి. ఎంతపెద్ద ఆర్టిస్టయినా ఒక్కోసారి బొమ్మ కుదరకపోవచ్చు. ఈ దేశంలో దళితుల పక్షాన మహోన్నత హిమవన్నగ శిఖరంలా నిలబడి, రాజీలేని పోరాటం చేసిన ఆదర్శమూర్తికి సంబంధించి క్షమాపణ చెప్పాలంటే “చెప్పను” అనేంతటి దురహంకారి కాదు శంకర్.

క్షమాపణ చెప్పడానికి, హృదయపూర్వకంగా మన్నించమని అడగడానికి శంకర్ కి ఎలాంటి అభ్యంతరమూ వుండదు  ( ఈ రోజు క్ష‌మాప‌ణ చెప్పారు). ఒక్కమాట నొక్కి చెప్పదలిచాను. శంకర్ నిరుపేదల పక్షాన, దళిత బహుజనుల పక్షాన నిక్కచ్చిగా నిలబడే మనిషి. శంకర్ మనవాడు. మన మిత్రుడు. ప్రజల మనిషి. గత పాతికేళ్లలో నిరుపేదలకూ, బాధితులకూ వ్యతిరేకంగా శంకర్ ఒక్కమాట మాట్లాడిన సందర్భం కూడా లేదు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వేయడం వెనక దురుద్దేశం లేదని మరోసారి చెబుతున్నా. అలాగే ‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళి గారు నాకు 30 ఏళ్లుగా తెలిసిన జర్నలిస్టు. నల్గొండ జిల్లాలో పేరున్న వామపక్ష నాయకుని కొడుకు. మురళి వెనకబడిన తరగతులకు (బీసీ) చెందినవాడు. చేయితిరిగిన సీనియర్ సంపాదకుడు. వినయ సంపన్నుడు. సంయమనం వున్న మనిషి. నూటికి నూరుశాతమూ పేదల పక్షపాతి. డాక్టర్ అంబేద్కర్ అన్నా, ఆయన రచనలన్నా అపారమైన గౌరవం వున్నవాడు. 

అంబేద్కర్ వంటి మహోన్నత మానవుణ్ణి అవమానించాల్సిన అవసరం మురళికి గానీ, శంకర్ కి గానీ లేనేలేదు. 30 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో రాణిస్తూ, గౌరవం పొందుతున్న వర్దెల్లి మురళి మా జర్నలిస్టులందరికీ విలువైన మిత్రుడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే మనిషి. ఈ మధ్యనే అరుణ్ సాగర్ 'ఉత్తమ జర్నలిస్ట్' పురస్కారం పొందాడు. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం పట్ల అవగాహన ఉన్నవాడు. అంబేద్కర్ వంటి మేరునగధీరుణ్ణి అవమానించో, కించపరిచో ఒక సంపాదకుడు మూటగట్టుకుపోయేదేమీ లేదు. దళితుల పట్ల గుండెనిండా సానుభూతి వున్నవాడే తప్ప మురళికి రవ్వంత వ్యతిరేకత కూడా లేదని నేను చెప్పగలను.

సంపాదకుడు మురళి, కార్టూనిస్టు శంకర్ నిరుపేదలు, బాధితులు, దళితుల పక్షాన త్రికరణశుద్ధిగా నిలబడే నిండయిన మనుషులు. బహుజనులకు అండగా ఉండే నిబద్ధత గల వాళ్ళు. వాళ్ళని అపార్థం చేసుకోవద్దు. ఈ దేశంలో దళితులకు ఇంకా పెద్ద సమస్యలున్నాయి. డాక్టర్ అంబేద్కర్ బొమ్మపై  ఉద్యమించాల్సిన అవసరం అయితే లేదు. కోతిపుండుని బ్రహ్మరాక్షసి చేయొద్దు. మనవాళ్ళని మనమే అనుమానించడం తగదు.

శంకర్ ఇప్పటిదాకా కొన్ని వందలమంది ప్రముఖుల కేరికేచర్లు వేశాడు. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, కేసిఆర్, చంద్రబాబు, మండేలా, చిరంజీవి, కాళోజీ… ఇలా ఎన్ని పేర్లయినా చెప్పొచ్చు. దళిత నేత కాన్షీరాం బొమ్మ వేసి ఆయన చేతికే యిచ్చినపుడు, కాన్షీరాం శంకర్ భుజం తట్టి, సంతకం పెట్టి యిచ్చారు. ఒకసారి హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన శంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని సినీనటుడు చిరంజీవి ప్రారంభించారు. సంతోషపడిన శంకర్, ఎంతో humble గా “నేను మీ అభిమానిని సార్” అన్నాడు. దానికి చిరంజీవి, “నేను మీ అభిమానిని శంకర్” అన్నారు. అదీ శంకర్ స్టేచర్!

ఒక పేద కుటుంబం నించివచ్చి, కఠోరమైన క్రమశిక్షణతో గొప్ప కార్టూనిస్టుగా, కేరికేచరిస్టుగా ఎదిగినవాడు. తనువంతా హృదయం వున్నవాడు. మన మిత్రుడు, మన బంధువు శంకర్. అలాగే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, సాక్షి అంత పెద్ద తెలుగు దినపత్రికకి సంపాదకుడు కాగలిగిన అసమాన ప్రతిభాసంపన్నుడు వర్దెల్లి మురళి.  అణగారిన జనం ఆత్మబంధువు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అభిమానించి, ఆరాధించి, ఆయన రచనలే మార్గదర్శక సూత్రాలుగా ముందడుగు వేస్తున్న మనం, మనవాళ్ళనే ద్వేషించడం తగదు. మన ఐక్యత చెక్కుచెదరకూడదు.

ఆఫ్టరాల్, మనుషులమే కదా. తప్పులు జరుగుతుంటాయ్. వాటిని దిద్దుకుందాం.  

జాషువా, శివసాగర్, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు లాంటి గొప్ప కవులు చూపించిన వెలుతురు దారుల్లో నడుద్దాం!

చిలికి చిలికి గాలివాన కాకుండా, ఈ చిన్న వివాదాన్ని పెద్ద మనసుతో పరిష్కరించుకుందాం!

TADI PRAKASH, CELL- 9704541559