పొట్ట తగ్గాలంటే ఎక్సర్ సైజులు చేయాల్సిందే. మరి వ్యాయామం చేయకుండా పొట్ట తగ్గించడం సాధ్యమేనా? సాధ్యమే అంటున్నారు ఆహార నిపుణులు. సరైన పద్ధతుల్లో కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించడంతో పొట్టను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం
1. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి
తినే ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఏది తింటున్నా అందులో కార్బోహైడ్రేట్స్ స్థాయి (పిండిపదార్థం) ఎంత అనేది తెలుసుకొని తింటే మంచిది. రోజూ తినే అన్నం, చక్కెర, బంగాళాదుంపలు.. వీటన్నింటిలో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, ఫ్రూట్ జ్యూస్ లు ఆపేయాలి.
మరి వీటి స్థానంలో ఏం తినాలి? అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార ఉత్పత్తుల స్థానంలో ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాల్ని తీసుకోవాలి. వీటితో పాటు అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిని జీవన విధానంలో భాగం చేసుకోవాలి.
2. ప్రొటీన్లు పెంచాలి
భారతీయులు తినే ఆహారంలో ప్రొటీన్లు కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అసమతుల్యతను తగ్గించాలి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం మెరుగవుతుంది. ఆకలి తగ్గుతుంది.
బరువుకు సంబంధించిన హార్మోన్లకు ప్రొటీన్లు నియంత్రిస్తాయి. ప్రొటీన్లు జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. కాబట్టి తొందరగా ఆకలి అనిపించదు. పాలు, గుడ్లు, చికెన్, బ్రొకోలీ, బాదం, చేపలు.. ఇవన్నీ ప్రొటీన్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి.
3. గుడ్ ఫ్యాట్ తినాలి
మంచి కొవ్వు, చెడు కొవ్వు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ తేడాను స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది.
ఆరోగ్యకరమైన అన్-శాట్యురేటెడ్ కొవ్వులు కలిగిన అవకోడా, కొబ్బరి, ఆలివ్ నూనె, చేపలు, నట్స్ లాంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా కేర్ తీసుకోవాలి. ప్రపంచ ప్రామాణికాల ప్రకారం రోజువారీ ఆహారంలో 20 శాతం కొవ్వులు ఉండాలి. వాటిలో 50శాతం నేరుగా తినే పదార్థాలై ఉండాలి.
4. నిద్ర
మారిన జీవన పరిస్థితుల్లో పొట్ట రావడానికి మరో ప్రధాన కారణం నిద్ర లేమి. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా పొట్ట వస్తుంది. నిద్ర సరిగ్గా లేనప్పుడు సోడియం, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాల వైపు మొగ్గుచూపడం సహజం.
ఇది పొట్ట పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు.. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట పెరుగుతుంది. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా నిద్రపోతున్నామనేది ముఖ్యం. క్రమం తప్పకుండా కంటినిండా 5 గంటలు డీప్ స్లీప్ అయినా సరిపోతుంది.
5. ఒత్తిడిని జయించాలి
నిద్రలేమితో పాటు ఒత్తిడి కూడా పొట్ట పెరగడానికి కారణం. ఒత్తిడి వల్ల బరువు పెరుగుతున్న మహిళలు, పురుషుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కార్టిసాల్ అనే హార్మోన్ దీనికి ప్రధాన కారకం. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాని ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండడం కూడా చాలా అవసరం.
వీటితో పాటు మినిమం గ్యాప్స్ లో గాఢంగా శ్వాస తీసుకోవడం, పని మధ్య విశ్రాంతి తీసుకోవడం, పనుల్ని ప్రణాళిక ప్రకారం చేయడం, విటమిన్-సి తీసుకోవడం లాంటివి చేయాలి. వారానికి కనీసం 3-4 రోజులైనా వాకింగ్ చేస్తే మరీ మంచిది.
ఇలా చేయడం వల్ల సహజ పద్ధతుల్లో పొట్టను తగ్గించుకోవచ్చు. కాకపోతే దీనికి కాస్త టైమ్ పడుతుంది. ఫలితం కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి. అందుకే లైఫ్ స్టయిల్ లో వీటిని భాగం చేసుకోవాలని అంటారు. అప్పుడిక ఫలితం కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.