ప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ప్రధానంగా తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలు చాలా మొండి ప్రభుత్వాలని చెప్పొచ్చు. అవి ఏం చేయాలనుకున్నాయో ఆ పనులే చేస్తున్నాయి తప్ప సమస్యలపై ప్రజల ఆందోళనలను పట్టించుకోవడం లేదు.
జనం ఎన్ని రోజులు ఎన్ని రూపాల్లో ఆందోళన చేసినా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. చాలా విషయాల్లో ప్రభుత్వాల మొండితనం రుజువైంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతుల కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. సమస్య పరిష్కారమైందా ? మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకుందా ? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తరువాత ఎగ్గొట్టారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నారు. కానీ పాండిచ్చేరిలో బీజేపీ గెలిస్తే దానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దీన్ని గురించి ప్రశ్నిస్తే ఏమాత్రం సిగ్గు పడకుండా తుడిచేసుకుని పోయారు.
నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తామన్నారు. కానీ ఇవ్వకుండా తమిళనాడుకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిలో రాజధానిని ప్రతిపక్ష నాయకుడిగా సమర్ధించి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నారు. అమరావతిలో ఆందోళన నెలల తరబడి జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
ఏ విషయంలోనైనా సరే ఏపీ ప్రభుత్వం కోర్టు గడప తొక్కనిరోజు లేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మొండివాడే. ప్రజల ఆందోళనలను అసలు పట్టించుకోడు. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మొండితనం గురించి చెప్పుకోవాలంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి.
తెలంగాణా విషయానికొస్తే తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులే అనేక ప్రజా సమస్యల మీద ఆందోళనలు నిర్వహించారు. ధర్నాలు చేశారు. అసెంబ్లీ ముట్టడులు జరిగాయి. కేసీఆర్ దేన్నీ పట్టించుకోలేదు. తాను ఏవైతే చేయాలనుకున్నాడో ఆ పనులే చేశాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే … ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది.
ఖమ్మంలో సభ నిర్వహించినరోజే మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించింది. చెప్పిన ప్రకారమే ఇందిరా పార్కు వద్ద దీక్ష ప్రారంభించింది. కానీ కరోనా సాకుతో మొదటిరోజే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం లోటస్ పాండ్ లో దీక్ష కొనసాగిస్తోంది. ఈ దీక్ష తరువాత జిల్లాల్లో దీక్షలు సాగుతాయని చెప్పింది.
చెప్పిన పని చేసి తీరాల్సిందే అనేది వైఎస్ఆర్, ఆయన వారసుల సిద్ధాంతం. దాని ప్రకారమే ఆమె దీక్ష మొదలుపెట్టింది. దీన్నే వాళ్ళు విశ్వసనీయత అంటారు. ఇంతవరకు బాగానే ఉందిగానీ, పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో ఆమె దీక్ష ప్రారంభించింది. కరోనా భయంకరంగా వ్యాపిస్తోందని మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో ఆమె దీక్షకు ప్రజా స్పందన కరువైంది.
షర్మిల దీక్ష వల్ల కేసీఆర్ లో కదలిక వస్తుందని అనుకోవడం భ్రమ. కొమ్ములు తిరిగిన తెలంగాణా నాయకులనే ఆయన పట్టించుకోడు. అలాంటిది మొన్న ఈమధ్యన వచ్చిన షర్మిలను పట్టించుకుంటాడా ? ప్రస్తుతం ప్రజల ఫోకస్ అంతా కరోనా మీదనే ఉంది. జనం ఆస్పత్రుల చుట్టూ తిరగడంలో బిజీగా ఉన్నారు.
షర్మిల దీక్షను పట్టించుకోని జనం జిల్లాల్లో ఆమె అనుచరులు చేసే దీక్షలను పట్టించుకుంటారా ? అందులోనూ లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో షర్మిల దీక్ష గురించి ఎవరు ఆలోచిస్తారు? ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా పార్టీ పెట్టలేదు, పాలసీ లేదు, జెండా, అజెండా లేవు. ఏమీ లేకుండా ఓ వ్యక్తిగా ఆందోళన చేస్తే ఏం ఉపయోగం? కేసీఆర్ ఎలాగూ పట్టించుకోడు. కనీసం ప్రజాస్పందనైనా ఉండాలి కదా. షర్మిల తొందరపడిందేమోననిపిస్తోంది.