తిరుపతి ఉప పోరులో ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయని నేపథ్యంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంశం తెరపైకి వచ్చింది. పిండి కొద్ది రొట్టె అన్న చందంగా రాజకీయాల్లో స్థాయిని బట్టి ఓటు కోనుగోలు షరా మామూలైంది. ఓటర్లను రాజకీయ నేతలు ప్రలోభ పెట్టి ఓట్లు దండుకుంటే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు తాము ఖర్చు పెట్టిన సొమ్ము రాబట్టుకునే క్రమంలో దోపిడీకి తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ తరపున ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అధికార పార్టీ తమ వైపు తిప్పుకోవడం గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది.
రాజకీయ వ్యవస్థ డబ్బు, ఇతరత్రా ప్రలోభాలు, కులం, మతం తదితర అంశాలతో కలుషితమైందన్నది వాస్తవం. అయితే కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థపై విమర్శలు చేయడంతోనే తమ బాధ్యత తీరిందనే భావనతో ఉన్న వాళ్లే ఎక్కువ. ముఖ్యంగా డబ్బుతో సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో రాణించొచ్చనే ఆలోచన చేయడానికి కూడా సాహసించని రాజకీయ, సామాజిక పరిస్థితులు మన కళ్లెదుటే ఉన్నాయి. అయితే మనిషి అనుకుంటే ఏదీ అసాధ్యం కాదనే ఆశయంతో, జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై జనంలో చైతన్యం తెచ్చేందుకు టెలికం ఉద్యోగి పి.మాధవరెడ్డి గత కొన్నేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.
తాను ఏ రాజకీయాలనైతే కలలు కంటున్నారో, ఇప్పుడు అలాంటి పరిస్థితిని గుడ్డిలో మెల్లలాగా తిరుపతి ఉప పోరులో ఆయన చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై ఆయన ఆలోచనలు ఏంటో తెలుసుకుందాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పి.మాధవరెడ్డి వాసాపురం స్వస్థలం. వరంగల్ ఎన్ఐటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఉద్యోగ రీత్యా కేంద్ర ప్రభుత్వ సంస్థలో సేవలు. ప్రవృత్తి రీత్యా సామాజిక చైతన్యం కల్పించే ఆశయంతో ఎన్నికల వ్యవస్థలో మార్పు కోసం కృషి చేస్తున్నారు.
డబ్బే ప్రధానంగా రాజకీయాల్లో అసాంఘిక శక్తులు రాజ్యమేలుతుండడం తనను ఆవేదన గురి చేసిందని మాధవరెడ్డి అంటారు. అయితే కేవలం ఆవేదన చెందడమే కాకుండా, ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే తలంపుతో 2016, జూలై 31న హైదరాబాద్ వేదికగా ఓ సదస్సును ఏర్పాటు చేశారాయన. రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపుతుంది? ధన బలం, మదబలమే అడ్డంకి అయితే అడ్డగించడానికి తామున్నామనే నినాదంతో నిర్వహించిన సదస్సుకు 40 మంది వచ్చినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఇంతింతై అన్నట్టు… మాధవరెడ్డి సంకల్పం మంచిది కావడంతో పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు తోడయ్యారు.
ఈ క్రమంలో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నా, ప్రధాన సమస్య డబ్బు అని వెనక్కి తగ్గుతున్న వాళ్లకు ఆయన మంచి సలహాలు ఇచ్చేందుకు వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటి వరకు సొంతంగా 60 సదస్సులు నిర్వహించారు. అలాగే వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వందలాది సదస్సుల్లో ప్రసంగించారు. దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ, వివిధ రాజకీయ వేదికల మీద నుంచి తన ఆలోచనలను పంచుకున్నారు. ముంబయ్ ఐఐటీ, రాజస్థాన్‌లోని బిట్సి ఫిలానీలో, పుణెలోని ప్రసిద్ధ పొలిటికల్ ఇన్‌స్టిట్యూట్ ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా రాజకీయ ప్రముఖులు ప్రసంగించే వేదికల నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వాణిని వినిపించారు.
2017లో బ్రిటన్ పార్లమెంట్‌లో అనధికారిక సమావేశంలో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై ఆయన ప్రసంగించి ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఆయన పలు స్వచ్ఛంద సంస్థల ఆహ్వానం మేరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై అవగాహన కల్పించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్, స్వీడన్ తదితర దేశాల్లో పర్యటించారు. ప్రధానంగా ప్రజలతో మమేకం అయ్యే లీడర్లకు ఓటర్లను ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని చెబుతూ వస్తున్నారు. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వాళ్లు నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే ప్రచారం చేయాల్సిన, అలాగే డబ్బు, ఇతరత్రా ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెబుతారు.
50 కిలోమీటర్ల పరిధిలో, 100 గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ తాను చేసిన మంచి పనులను నాయకులు ఎందుకు చెప్పుకోలేక పోతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే నాయకులు చేసిన మంచి పనులేవీ లేవనే కదా అర్థం అని ఆయన అంటున్నారు. ఏ మీడియా లేని రోజుల్లో మహాత్మాగాంధీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని, అలాంటిది అన్ని రకాలుగా ప్రచార వ్యవస్థ అద్భుత పురోగతి సాధించిన ప్రస్తుత తరుణంలో ప్రజలకు నాయకులు దగ్గర కాలేకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నలను ఆయన సంధిస్తున్నారు.
ఏ గ్రామమైనా, పట్టణమైనా ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా అవే సమస్యల గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటని ఆయన అంటున్నారు. వీటిపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తే రాజకీయాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కనబరుస్తున్న వాళ్లకు తాను ప్రధానంగా చెప్పే అంశం… ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే అంతిమ పరిష్కారంగా సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రజలను మనం పట్టించుకుంటే, వారు కూడా అంతే అభిమానంతో ఆదరిస్తారని ఆయన చెబుతున్నారు.
రాజకీయాల్లో డబ్బు కాలుష్యం పోయి, స్వచ్ఛత రావాలంటే కొత్త తరం ముందుకు రావాలని ఆయన కోరారు. అలాంటి వాళ్లను ప్రోత్సహించేందుకే తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్‌పై ఊరూరూ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నట్టు మాధవరెడ్డి తెలిపారు. అయితే ఇదేమీ తాను కనుగొన్నది కాదని, ఎప్పటి నుంచో సమాజంలో ఉందన్నారు. దాన్ని కొనసాగింపుగానే తాను మాట్లాడుతున్నట్టు ఆయన తెలిపారు. గాంధీజీ ఫిలాసపీపై జీరో బడ్జెట్ పాలిటిక్స్ పునాదులు ఉన్నాయన్నారు.
రాజకీయాలంటే పారిశ్రామికవేత్తలు, రౌడీలు, ధనవంతుల సొత్తు కాదని, మనందరి ఆస్తి అని భావిస్తే , మెరుగైన సమాజాన్ని నిర్మించడం అసాధ్యం కాదనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు …రాజకీయ రంగంలో ఆదర్శంగా నిలిచిన వారి ప్రస్థానాన్ని పాఠాలుగా చెబుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మాధవరెడ్డి ఆశయం ఫలించి రాజకీయాలు సామాన్యులు, సేవాతత్పరుల సొంతం కావాలని ఆకాంక్షిద్దాం.