జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ నిద్ర నుంచి మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటు ఆంధ్రా, అటు తెలంగాణలో తన పార్టీ గుర్తు గాజు గ్లాసు తనకు దక్కకుండా పోయిన సందర్భంలో గుణపాఠం నేర్వాల్సిన తరుణమిది. కనీసం గుర్తును కూడా కాపాడుకోలేని దుర్భర స్థితి తన పార్టీకి ఎందుకు వచ్చిందో జనసేనాని అత్మావలోకనం చేసుకోవాల్సి ఉంది.
కేవలం వైఎస్ జగన్‌పై విద్వేషమే తనను ముఖ్యమంత్రి చేస్తుందన్న తప్పుడు భావన నుంచి బయటికి రావాల్సి ఉందన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం తన పార్టీ గుర్తును మరొకరికి ఎందుకు కేటాయించాల్సి వస్తున్నదో, కనీసం ఎన్ని కల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో తానెందుకు తలపడలేక పోతున్నారో పవన్ సమీక్షించుకోవాల్సిన సమయం ఇది.
నిన్న తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు మరో పార్టీకి కేటాయించినా, నేడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఎదురైన నేప థ్యంలో సీరియస్‌గా రాజకీయాలు చేయాలనుకుంటే పవన్‌కల్యాణ్ తప్పక సమీక్షించుకోవాల్సి వుంటుంది. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ …ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలను భుజాన మోసారు. వైఎస్ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే బీజేపీ -టీడీపీ కూటమికి తాను మద్దతు ఇచ్చానని పవన్‌కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఇతర పార్టీల తరపున ప్రచారం చేయడానికి కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నకు పవన్ నుంచి ఇంత వరకూ జవాబు లేదు. అలాంటప్పుడు తనకు నచ్చిన ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కండువా కప్పుకుంటే ఎవరూ ప్రశ్నించే అవకాశమే ఉండదు కదా! ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ గొప్పలు చెప్పుకునే జనసేనానే ప్రశ్నలకు గురి కావడం రాజకీయ విచిత్రం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పని చేసి పంతం నెగ్గించుకున్నారు. అయితే జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకున్నానన్న ఆనందంలో, తన లక్ష్యాన్ని పవన్ మరిచిపోయారు. కనీసం జనసేనకు నిర్మాణం చేయాలన్న సంగతినే విస్మరించారు. పార్టీ స్థాపించిన ఏడేళ్లు అవుతున్నా ఇంత వరకూ జనసేనకు గ్రామ, మండల, నియోజక వర్గ కమిటీలు లేకపోవడం దేనికి సంకేతం?
ప్రతి ఎన్నికకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటూ, రాజకీయ లోపాయికారి ఒప్పందాలతో తనను తాను పవన్ మోసగించు కున్నారు. తమ కోసం నిలిచే వారెవరు? అనే విషయమై ఏపీ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఒక పార్టీని తొక్కడానికి, ఇతర పార్టీలను పైకి లేపడానికి వచ్చే నేతలను పసిగట్టలేని అజ్ఞానంలో ప్రజలు లేరనే సంగతిని పవనే గ్రహించలేకపోయారు.
అందుకే నేడు తన పార్టీ గుర్తు తనది కాకుండా పోయినా… చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. సినిమాల్లో పవన్ హీరో కావచ్చు. కానీ రాజకీయాల్లో హీరో కావాలంటే నిబద్ధత చాటుకోవాలి. అది లేదని ప్రజలు గ్రహిస్తే, వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.
తమ అభిమాన హీరో సీఎం కావాలని పవన్ అభిమానులు కోరుకుంటే… పార్టీ గుర్తును కూడా పోగొట్టుకోవడం నిజంగా తీవ్ర నిరాశ కలిగించే అంశమే. ఇప్పటికైనా పవన్ తన ఆశయాలను, లక్ష్యాలను గుర్తెరిగి, అందుకు తగ్గట్టు తనను తాను మలుచుకోవాల్సిన అవసరం ఉంది.