భలే తమాషాగా ఉంది బాసూ! ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమా రచయితలు, దర్శకులు ఎన్నెన్నో పాట్లు పడాల్సి వస్తోంది. ఈ తరం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని మాత్రమే ఆస్వాదిస్తోంది. పాత రోత…కొత్త వింత అని ఊరికే చెప్పడం లేదు. వారంలో కనీసం రెండుమూడు సినిమాలైనా విడుదలవుతున్నాయి. ఒక సినిమాలో ఉండే డైలాగ్స్, మరో సినిమాలో ఉండకుండా జాగ్రత్త పడాలి. అలా ఉంటే ఆ రచయిత, దర్శకుడి సినిమాలపై చులకన భావం ఏర్పడుతుంది.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన మలయాళీ రొమాంటిక్ థ్రిల్లర్ 'కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లైయాడిత్తాల్'. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' పేరుతో విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్, పాటలు, తమిళ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ దాన్ని మించి ఆకట్టుకుంటోంది.
‘ఇండియాలో ఆన్‌లైన్ ట్రేడ్‌కి వన్ ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు 10 కోట్లమంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పది కోట్లలో ఒక్కడు’ హీరో చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ మొదలైంది.
‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం’, ‘ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా’ అని హీరో, అతని స్నేహితులు చెప్పే కామెడీ డైలాగులలో ట్రైలర్ వావ్ అనిపిస్తోంది. ఈ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ అదరగొట్టడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.