బాబు అతి తెలివి: యువనేస్తంలో నయా మోసం

ఏదైనా పథకానికి దరఖాస్తు చేస్తున్నారు అంటే దానర్థం ఏంటి..? లబ్ధిదారుడిగా ప్రయోజనాలు పొందడం కోసమే కదా. ఆ పథకం తమకు అవసరం లేదనుకునేవాళ్లు అసలు దరఖాస్తు జోలికైనా వెళ్తారా? ఈ మాత్రం లాజిక్ తెలియక…

ఏదైనా పథకానికి దరఖాస్తు చేస్తున్నారు అంటే దానర్థం ఏంటి..? లబ్ధిదారుడిగా ప్రయోజనాలు పొందడం కోసమే కదా. ఆ పథకం తమకు అవసరం లేదనుకునేవాళ్లు అసలు దరఖాస్తు జోలికైనా వెళ్తారా? ఈ మాత్రం లాజిక్ తెలియక కాదు, తెలిసినా నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేసేందుకే చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్లో నింపాల్సిన దరఖాస్తులో 'గివ్ అప్' అనే ఆప్షన్ పెట్టింది. 

బాబుగారి టెక్నికల్ టీమ్ అతి తెలివికి ఇదో నిదర్శనం. నిరుద్యోగ భృతి మాకొద్దు అనుకునేవాళ్లు అసలు వెబ్ పోర్టల్ ని ఓపెన్ చేస్తారా? కుతూహలం కొద్దీ ఓపెన్ చేసినా దరఖాస్తు నింపాలని అనుకుంటారా? అలాంటప్పుడు అప్లికేషన్లో ఈ భృతి మాకొద్దు, స్వచ్ఛందంగా దీన్ని వదులుకుంటున్నాం అని ఆప్షన్ పెట్టడం ఎందుకు. ఆప్షన్ పెట్టారే అనుకోండి. పొరపాటున ఆ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఇక ఎప్పటికీ వారు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా చేశారు. 

అప్ డేట్స్ తెలుసుకుందామని ఆధార్ నెంబర్ తో మరోసారి సైట్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా మీరు నిరుద్యోగ భృతిని వదులుకున్నారనే మెసేజ్ వస్తుంది. దీంతో వేలాది మంది నిరుద్యోగులు షాక్ కి గురవుతున్నారు. దీనిపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. నిజాయితీతో స్పందిస్తే సర్కారు తమ అతితెలివిని అంగీకరించి ఆ ఆప్షన్ ని తొలగించాలి. అయితే పేరుగొప్ప మన ఐటీ నిపుణులు మాత్రం ఆప్షన్ ఎత్తివేయడం నామోషీగా భావించారు. 

గివ్ అప్ అనే ఆప్షన్ ని అలాగే కొనసాగిస్తూ పొరపాటున అప్లికేషన్ నింపుతూ ఆ ఆప్షన్ ని సెలక్ట్ చేసిన వారికి మరో అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. పొరపాటు చేసిన వాళ్లు 1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి తమ తప్పుని సరిచేసుకునే అవకాశం కల్పించాలని కోరాలట. కొన్ని వెరిఫికేషన్ల తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారట. 

ఈ తతంగంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి డిగ్రీ, డిప్లమో అర్హత, 35ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు సహా చాలామంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇలాంటి తలతిక్క ఆప్షన్లతో అసలైన నిరుద్యోగుల్ని పథకానికి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.