ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారు. సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవారు. బాధితులకు భరోసా ఇచ్చేవారు. అందులోనూ ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడంతో…దారిలోనే ఆయన్ను కలిసే అవకాశం ఉండేది. తమ గోడు చెప్పుకునే వెసలుబాటు కూడా ఉంది.
కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలన బాధ్యతల కారణంగా ప్రజల్ని కలవడం తక్కువైంది. దీంతో జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కర్నూల్ పర్యటనలో ఉన్న జగన్‌ను సుగాలి ప్రీతి కుటుంబం కలవడం, తమ గోడు చెప్పుకోవడం…జగన్ పాజిటివ్‌గా స్పందించిన ఘటన ప్రశంసలు అందుకుంటోంది.
కర్నూల్‌లో 2017లో పదో తరగతి విద్యార్థిని ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు హత్య చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటన మరుగున పడింది. అప్పట్లో ఈ కేసుపై నోరెత్తని బాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్….జగన్ సీఎం కాగానే చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఇటీవల కర్నూల్‌లో ర్యాలీ, బహిరంగ కూడా నిర్వహించాడు.
అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కర్నూల్ ఎస్పీ అప్పటికే నివేదిక సిద్ధం చేసి డీజీపీకి పంపారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రీతి తల్లితో పాటు కుటుంబ సభ్యులకు జగన్ నేరుగా చెప్పారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు.
ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టం చేశారు. తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై మరోసారి మాట్లాడేందుకు ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలంటూ తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రీతి కుటుంబ సభ్యుల సమస్యను నేరుగా వినడమే కాకుండా వారు కోరుకున్న విధంగా సీబీఐకి కేసు అప్పగించేందుకు సీఎం తీసుకున్న చొరవను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇలా అన్ని సమస్యలపై జగన్ స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో “జగన్ …మీ నుంచి కావాలి ఇలాంటి స్పందన” అని ప్రజలు అంటున్నారు.