జగన్ సభలకి జనం రావడం లేదు. వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీడియోలు కనిపిస్తున్నాయి. వాస్తవం ఏమంటే ప్రతి పత్రికకి కొన్ని పాలసీలు వుంటాయి. ఆ మేరకే రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు, డెస్క్ జర్నలిస్టులు పని చేస్తూ వుంటారు. మనకి అనుకూలమైన నాయకుడి సభకి లక్ష మంది వచ్చి సక్సెస్ అయితే పెద్ద ఫొటోని ఫస్ట్ పేజీలో వేస్తాం.
వెనుకటి రోజుల్లో అయితే ఒకే యాంగిల్లో అంతమంది జనం రారు కాబట్టి, రెండు ఫొటోలు తీసి Attach చేసి పబ్లిష్ చేసేవాళ్లు. అదే మనకి అంత ఇష్టం లేని నాయకుడి సభ అయితే ఒకే ఫొటోలో ఎంత మంది జనం కనిపిస్తే అంతే ఫొటో అతుకులుండవు. వార్త రాయడంలో కూడా అశేష జనవాహిని ఇలాంటి విశేషణాలుండవు.
సభ అంతంత మాత్రం జరిగితే వెనుకటి వరుసలు ఎలాగూ ఖాళీ ఉంటాయి కాబట్టి ఆ ఫొటోలు తీసి వేయడమే. అదే మనకు అనుకూల సభ అయితే ముందు వరుసలో ఎలాగూ నిండి వుంటాయి కాబట్టి ఆ ఫొటో వేయడమే. రెండూ సత్యాలే, వాస్తవాలే. ఎవరికి కావాల్సింది వాళ్లు ఎంచుకుంటారు. ఒకప్పుడు గీతలు కనీకనపడనట్టు వుండేవి. ఇప్పుడు చాలా క్లియర్‌గా వున్నాయి.
మామూలుగా ఎండాకాలంలో సభ జరిగితే జనం పెద్దగా రారు. ఏ పార్టీ వాళ్లైనా తోలాల్సిందే. వచ్చిన వాళ్లు ఎక్కువ సేపు వుండరు. వెళ్లిపోయే వాళ్లు పోతూనే వుంటారు. జనం వెళ్లిపోవడం అబద్ధమైతే సాక్షి కౌంటర్‌గా ఏది నిజం? అని రాసేది. ఇంకా రాసినట్టు లేదంటే కొంత నిజం వుండే వుంటుంది.
ఒకసారి గతంలోకి వెళ్దాం. గతం అర్థం కాకపోతే వర్తమానంలోని తప్పులు అర్థం కావు. పదవి కోల్పోయిన ఇందిరాగాంధీ బెంగళూరు నుంచి అనంతపురానికి కారులో 1978లో వచ్చారు. 12 గంటలు ఆలస్యంగా వచ్చినా ఆమెని చూడడానికి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి లక్షల మంది వచ్చారు. ఎటు చూసినా జనమే. 1983లో మళ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జనం ఆమె ప్రసంగానికి అడ్డు తగిలి అల్లరి చేశారు. కాంగ్రెస్‌పైన నిరసన అది.
1982లో NTR తిరుపతి వస్తే కనుచూపు మేర జనమే. అదే NTR 1989లో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సభ పెడితే జనం లేరు. పోలీసుల సంఖ్యే ఎక్కువుంది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవి కోసం ఎన్ని లక్షల మంది తిరుపతి సభకు వచ్చారో అందరికీ తెలుసు. రాత్రి 10 గంటలకి సభ ముగిస్తే తెల్లారే వరకూ తిరుపతి నుంచి బయటికి వెళ్లే అన్ని దారులు ట్రాఫిక్ జామ్. అదే చిరంజీవి రాజీనామా చేసి బైఎలక్షన్లో కాంగ్రెస్ ప్రచారానికి తిరుపతిలో సభ పెడితే ఆయన అభిమానులు తప్ప ఇంకెవరూ లేరు. చిరంజీవి పొలిటికల్ కెరీర్లోనే అత్యంత అధ్వాన్న సభ అది!
జగన్ సభలో జనం గురించి వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నట్టు పచ్చ మీడియా కల్పనే అయితే అబద్ధాన్ని చూసి భయపడడం అనవసరం. ఒకవేళ నిజమే అయితే అది జనం హెచ్చరిక. సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్న హెచ్చరిక.
గ్రౌండ్ రియాల్టీని గుర్తించని వాళ్లంతా చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోతారు.
జీఆర్ మహర్షి