కామ్రేడ్స్ తో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇది 2019 ఎన్నికల్లో జరిగింది. ఉభయ వామపక్షాలతో పవన్ కళ్యాణ్ నాడు ఏపీ అంతటా తిరిగారు. ప్రచారం కూడా నిర్వహించారు. మా కూటమిని గెలిపించమని ఏపీ జనాలను కోరారు. అయితే నాడు కామ్రెడ్స్ కి నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన సీట్లలో ఓడిపోయారు.
అది జరిగిన ఆరు నెలలకు బీజేపీతో ఆయన చెలిమి చేశారు. ఇక రెండేళ్ల క్రితం దాకా పవన్ని బీజేపీతో పొత్తు మీద విమర్శిస్తూ వచ్చిన కామ్రేడ్స్ ఈ మధ్య సైలెంట్ అయ్యాయి. ఇపుడు టోన్ కూడా మారుతోంది. ఇక డైరెక్ట్ గా పవన్ భేష్ అనేస్తున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామక్రిష్ణ.
ఆయన విశాఖ పర్యటనలో భాగంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీలోని రైతులను ఆదుకుంటున్నది పవన్ కళ్యాణే అని పొగిడారు. దీని భావమేని ఎర్రన్నలూ అంటే పొత్తుల ఎత్తులే అని జవాబు వస్తుందేమో. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ రోజుకీ బీజేపీతోనే దోస్తీలో ఉన్నారు.
ఇక బీజేపీ అంటే కామ్రేడ్స్ కి ఎంతటి ఒళ్లు మంట అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి పవన్ చూస్తే కామ్రెడ్స్ వైపు ఏమైనా చూస్తున్నారా అంటే ఆయన కొద్ది నెలల క్రితం అన్న ఒకే ఒక మాట వారిలో ఆశలు రేపింది అనుకోవాలి.
వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని పవన్ చెప్పిన మాటలతో పొత్తు మళ్లీ ఇటు తిరుగుతుందని భావిస్తున్నారులా ఉంది. మొత్తానికి పవన్ బీజేపీ చెంతన ఉండగానే కామ్రేడ్ రామక్రిష్ణకు తెగ నచ్చేస్తున్నారు అంటున్నారు.
అందుకే ఆయన జనసేనానిని పొగుడుతున్నారు అని అంటున్నారు. మరి రేపటి రోజున పవన్ కోరుకుంటున్న తీరున అన్ని పార్టీలు ఒక్కటిగా వైసీపీకి యాంటీగా నిలబడాలీ అంటే బీజేపీ అవతల ఉన్నా ఇవతల కామ్రేడ్స్ కూడా పొత్తు కూడుతారా అన్నదే చూడాలి. ఏది ఏమైనా సీపీఐ రామక్రిష్ణ మాత్రం చాలా కాలానికి పాత మిత్రుడిని మనసారా తలచుకున్నారు.