1946 ఇది ఒక పుస్తకం పేరు. ప్రమోద్‌కపూర్ రాశారు. చరిత్రలో కనిపించని నావికుల తిరుగుబాటు దీని ఇతివృత్తం.
ఫిబ్రవరి 22, 1946, శుక్రవారం. రాయల్ ఇండియన్ నేవీలో నావికుల తిరుగుబాటు జరిగింది. అధ్వాన్నమైన వర్కింగ్ కండీషన్స్, వివక్ష, దొరల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దాదాపు 20 వేల మంది 78 షిప్స్ స్వాధీనం చేసుకుని బ్రిటీష్ జెండాలు పీకి, కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్టు పార్టీల జెండాలు ఎగురవేశారు. ఊహించని ఉపద్రవానికి బ్రిటీష్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. వార్ షిప్స్, ఫైటర్ విమానాలు పంపి తిరుగుబాటుని అణిచివేసింది.
దాదాపు 700 మంది చనిపోయినట్టు, 1000 మందికి పైగా గాయపడినట్టు అంచనా. నావికులకి అండగా నిలిచిన పౌరులు చాలా మంది చనిపోయారు. ఇంత పెద్ద తిరుగుబాటుని ఎక్కడా రికార్డు చేయకుండా ఎందుకు వదిలేశారంటే కాంగ్రెస్ కానీ, ముస్లింలీగ్ కానీ నావికులకు మద్దతు ఇవ్వలేదు.
బ్రిటీష్ వాళ్లతో గొడవ పడకుండా స్వాతంత్ర్యం తెచ్చుకునే ఆలోచనలో వున్నప్పుడు బ్రిటీష్ వాళ్లు కూడా సానుకూలంగా వున్నప్పుడు ఈ తిరుగుబాటుకి మద్దతు అనవసరమని ఇద్దరూ అనుకున్నారు. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు లాభపడడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకని ఎలాంటి బంద్‌కి, సమ్మెలకి పిలుపు ఇవ్వలేదు.
అయితే మూడు రోజుల పాటు బొంబాయిలో వీధిపోరాటం జరిగింది. రిప్పన్ రోడ్, దాదర్, కల్బాదేవీలో బ్రిటీష్ సైనికులకి, పౌరులకి మధ్య యుద్ధమే జరిగింది.
జలియన్‌వాలాబాగ్ సంఘటనతో సమానమైన బలిదానం వున్న ఈ సంఘటనని చరిత్ర ఎందుకు మరిచిపోయిందని ప్రమోద్‌కపూర్ ప్రశ్న?
జీఆర్ మహర్షి