పచ్చపత్రికలు చంద్రబాబును ఇలా ముంచేస్తాయా?

తెలుగు ప్రజలందరూ ‘పచ్చపత్రికలు’ అని ముద్దుపేరుతో పిలుచుకునే మీడియా సంస్థలు ప్రధానంగా రెండున్నాయి. ఆ రెండు పత్రికలను తెరిస్తే చాలు.. జగన్మోహన్ రెడ్డి మీద అచ్చంగా విషం కక్కడం కనిపిస్తూ ఉంటుంది. ఆ విషాన్ని…

తెలుగు ప్రజలందరూ ‘పచ్చపత్రికలు’ అని ముద్దుపేరుతో పిలుచుకునే మీడియా సంస్థలు ప్రధానంగా రెండున్నాయి. ఆ రెండు పత్రికలను తెరిస్తే చాలు.. జగన్మోహన్ రెడ్డి మీద అచ్చంగా విషం కక్కడం కనిపిస్తూ ఉంటుంది. ఆ విషాన్ని చూడగానే ఆ పత్రికలు ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. టైటిల్ చూడాల్సిన అవసరం ఉండదు. జగన్ కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ గోబెల్స్ ప్రచారం నిజానికి చంద్రబాబుకు మేలు చేయడం కోసమే అని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రచారం శ్రుతిమించితే చంద్రబాబును ముంచేసే ప్రమాదం కూడా ఉందని తెలుగుదేశం నాయకులే భావిస్తున్నారు. 

ఉదాహరణకు.. ఇప్పుడు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ‘గడపగడపకు’ కార్యక్రమం జరుగుతోంది. ఈ  పచ్చపత్రికలు చూస్తే గనుక.. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ విపరీతమైన నిరసనలు ఎదురవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అడుగడుగునా నిరసనలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గడపగడపకు కార్యక్రమం జరుగుతూ ఉంటే.. రోజుకు పట్టుమని పది నియోజకవర్గాల ప్రస్తావన కూడా లేకుండా.. కొన్ని సార్లు ఒకే ఒక్క నియోజకవర్గంలో వ్యక్తమైన వ్యతిరేకతను కూడా భూతద్దంలో చూపిస్తూ.. ఆ పత్రికల్లో కథనాలు వస్తుంటాయి. గడపగడపకు కార్యక్రమంలో వస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలు నీరాజనాలు పట్టిన ఘటనలు ఒక్కటి కూడా కనిపించవు. ఇంత పక్షపాత బుద్ధితో కథనాలు వెల్లువలా వస్తున్నాయి. 

వారి లక్ష్యం జగన్ మీద బురద చల్లడమే గనుక.. వారు అలాగే చెబుతారని అనుకోవచ్చు. కానీ ఈ ప్రచారం శ్రుతి మించేకొద్దీ.. తమ నాయకుడు చంద్రబాబునాయుడు రిలాక్స్ అయిపోతారేమో అనేది తెలుగుదేశం నాయకుల ఆలోచన, భయం.

రాష్ట్రంలో ఏ  మూల చూసినా వైసీపీ నాయకులకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. అని చంద్రబాబునాయుడు మురిసిపోతున్నారని.. పచ్చపత్రికలు మాత్రమే చదివి, అవి చెప్పే అబద్ధాలను మాత్రం అర్థం చేసుకుని మాట్లాడితే.. కొంప మునుగుతుందని తెలుగుదేశం నాయకులు భయపడుతున్నారు. 

ఎటూ ప్రజల్లో బీభత్సమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబు మురిసిపోయి రిలాక్స్ అయితే.. పార్టీ నట్టేట మునుగుతుందని పార్టీ శ్రేణుల్లో భయంగా ఉంది. పచ్చరాతలు నమ్మకుండా క్షేత్రస్థాయి నుంచి ఆయన వివరాలు తెలుసుకుని తదనుగుణంగా వ్యూహరచన చేసుకోవాలని అంటున్నారు.

ఇక్కడ చంద్రబాబు గానీ, పచ్చ మీడియా గానీ తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. పచ్చరాతలు జనంలో వ్యతిరేకత గురించి ఎన్ని చిల్లర రాతలైనా రాయవచ్చు గాక.. కానీ ఓట్లు వేసే క్షేత్రస్థాయి ప్రజల్లో వాస్తవాలు తెలుసు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొన్ని టీడీపీ గ్రామాలు, కొందరు టీడీపీ ప్రజలు తప్పకుండా ఉంటారు. వారు కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడానికి గోల చేస్తుంటారు. అలాంటి వాటిని మాత్రమే ఏరి పచ్చపత్రికలు ప్రచారం కల్పిస్తున్నాయి. 

ఇలాంటి ప్రచారాన్ని నమ్ముకుని చంద్రబాబు మురిసిపోతే.. ఆయనకే నష్టం అని పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి.

8 Replies to “పచ్చపత్రికలు చంద్రబాబును ఇలా ముంచేస్తాయా?”

Comments are closed.