సాక్షి అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ అంటే సాక్షి కుటుంబం అనేంతగా ఆ పత్రిక, చానల్ గుర్తింపు పొందాయి. అంతెందుకు సాక్షి పత్రికలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో, ఆయన సుభాషితం లేని రోజును ఊహించలేం. అలాగే సాక్షి చానల్‌లో ఆయన ఫొటో తప్పక ఉంటుంది. ఈ రోజు పత్రికే తీసుకుంటే…ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం అన్న వైఎస్ మాటలను ప్రముఖంగా ఇచ్చారు.
అలాంటిది వైఎస్సార్ ముద్దుల తనయ షర్మిల సాక్షి చానల్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరైనా కల కన్నారా? ఊహూ, ఎప్పటికీ అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనుకున్నవన్నీ జరగనవీ, అనుకోనివి జరిగేవే జీవితం అని పెద్దలు చక్కటి నిర్వచనం ఇచ్చారు. వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య వ్యవహారం ప్రస్తుతం అలాంటిదే.
తెలంగాణలో తనకంటూ ప్రత్యేక జెండా, ఎజెండాతో వైఎస్ షర్మిల దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఇటీవల ఖమ్మం సభా వేదిక మీద నుంచి ప్రకటించినట్టుగానే హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గరలోని ధర్నా చౌక్‌లోని ఉద్యోగాల భర్తీ కోరుతూ దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఆమె దీక్షకు సంబంధించి వివిధ చానళ్లు కవరేజ్ ఇచ్చేందుకు పోటీ పడ్డాయి.
ఈ క్రమంలో దీక్షకు అడ్డంకిగా ఉన్న చానళ్లను పక్కకు సర్దుకోవాలని కోరే సందర్భంలో సాక్షిని ఉద్దేశించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటో ఆమె మాటల్లోనే విందాం.
‘మీరట్ల చేస్తే ఎట్లమ్మా. మేము దీక్ష చేస్తున్నది మీ కోసమా? జనాల కోసమా? దయచేసి సహకరించండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. మధ్యలో ఉన్న ఐదు కెమెరాలను తీసి… కొంచెం ఇటు, కొంచెం అటు సైడ్ అయిపోండి. ఇక కవరేజ్ చేసింది చాల్లేమ్మా… ఎట్లా సాక్షి మా కవరేజీ ఇవ్వదుగా’ అని దెప్పి పొడిచారు.
షర్మిల మాటలకు అక్కడున్న మిగిలిన చానళ్ల ప్రతినిధులు, కెమెరామెన్లు గొల్లుమని నవ్వారు. సాక్షి చానల్ కెమెరా మెన్లు, జర్నలిస్టుల పరిస్థితి ఏడ్వలేక నవ్వాల్సి వచ్చింది. షర్మిల మాటలను పక్కనే ఉన్న మాతృమూర్తి విజయమ్మ విని, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కూతురిని వారిస్తున్నట్టుగా, చేత్తో తట్టడం గమనార్హం.
మొత్తానికి తన పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు సంబంధించి సాక్షి చానల్ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం ఆమె మాటల్లో ప్రతిబింబించింది. మనది అనుకున్న చానలే, తన కార్యక్రమాల విషయంలో విస్మరించినట్టు వ్యవహరించడం వల్లే షర్మిల నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొదుం రమణ