సెకెండ్ వేవ్ లో ఇండియాలో కరోనా వ్యాప్తికి హద్దే లేకుండా పోతున్నట్టుగా ఉంది. ప్రజలకు పెద్దగా అవగాహన లేని సమయమే అయినప్పటికీ.. ఫస్ట్ వేవ్ లో కరోనా నంబర్లు రోజువారీగా లక్ష స్థాయిలో నమోదయ్యాయి. అయితే ప్రజలకు అవగాహన పెరిగినప్పటికీ.. జాగ్రత్త చర్యలు, మాస్కులు తప్పనిసరి అని అన్ని రకాల హెచ్చరికలూ జారీ అవుతున్నా, ఈ దశలో మాత్రం కరోనా విపరీత స్థాయి వ్యాపిస్తోంది.
ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షల స్థాయికి చేరింది. అధికారిక నంబర్లే ఇలా ఉంటే, అనధికారిక నంబర్లు, అసలు టెస్టులే చేయించుకోని వారి సంఖ్య ఎంతో ఊహించడం కూడా కష్టమే. ఈ క్రమంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశం గురించి అధ్యయనాలు విస్మయకరమైన విషయాలను చెబుతున్నాయి.
ఇండియాటుడే లో ప్రచురితం అయిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా జరగనుంది. ఎంతలా అంటే.. ఈ నెలాఖరుకే కరోనా రోజువారీ నంబర్లు విపరీత స్థాయికి చేరనున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. మహారాష్ట్రలో కరోనా ఇంకా పీక్ స్టేజీకి వెళ్తుందని ఆ అధ్యయనకర్తలు అంచనా వేస్తూ ఉన్నారు. వారి అంచనాల ప్రకారం.. దేశంలో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షల వరకూ చేరనుంది!
ప్రస్తుతం ఈ సంఖ్య రెండు లక్షల స్థాయిలో ఉండగా.. అతి త్వరలోనే రోజువారీ కేసుల సంఖ్య ఐదు లక్షల వరకూ చేరవచ్చని ఈ అధ్యయనం అంచనా వేయడం గమనార్హం! ఆ సమయంలో రోజువారీగా కరోనా కారణ మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతుందని ఈ అధ్యయన కర్తలు హెచ్చరిస్తున్నారు. వీరి అంచనాల ప్రకారం.. ఆ సమయంలో రోజువారీగా మూడు నుంచి నాలుగు వేల మంది కరోనా కారణంగా మరణిస్తారట!
ఇలా షాకింగ్ నంబర్లను చెబుతూ ఉంది ఈ పరిశోధన. మరి ఇంతకీ సెకెండ్ వేవ్ ఇలా పెరుగుతూ పోవడమేనా? అంటే.. అలాంటిదేమీ లేదని ఈ అధ్యయనం అంచనా వేయడం గమనార్హం. ఇది వరకూ సౌతాఫ్రికా, అమెరికా వంటి చోట్ల కూడా సెకెండ్ వేవ్ లో నంబర్లు భారీగా పెరిగినా, ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయని, ఇండియాలో కూడా అదే జరుగుతుందని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది.
రోజువారీ కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరినా ఆ తర్వాత సెకెండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టి తీరుతుందనేది ఈ అధ్యయనం అంచనా! ఇంతకీ ఎలా తగ్గుముఖం పడుతుంది? అంటే.. దాని గురించి మాత్రం వివరణలు ఏమీ లేవు. అద్భుతం చోటు చేసుకోవాలి, కరోనా నంబర్లు తగ్గుముఖం పట్టాలన్నట్టుగా ఈ అధ్యయనకర్తలు తమ అంచనాలను వెలువరించారు!