తమిళ 'అన్నియన్' హిందీ రీమేక్ వ్యవహారం రసవత్తరంగా మారింది. 16 యేళ్ల కిందటి ఈ సినిమాను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేయనున్నట్టుగా దర్శకుడు శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శంకర్ నుంచి అలా ప్రకటన వచ్చిందో లేదో అన్నియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేయడమూ తెలిసిన సంగతే. తను నిర్మించిన సినిమాను శంకర్ ఎలా రీమేక్ చేస్తాడన్నట్టుగా ఉంది రవిచంద్రన్ ప్రశ్న. ఇందుకు వెనువెంటనే శంకర్ కూడా సమాధానం ఇచ్చేశాడు.
'వెనక్కు తగ్గేది లేదు..' అని శంకర్ చెబుతున్నారిప్పుడు. ఈ విషయంలో ఆయన ఒక లాజిక్ కూడా చెప్పాడు. అన్నియన్ సినిమా టైటిల్ కార్డ్స్ లో స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విషయంలో తన పేరే పడుతుందని శంకర్ గుర్తు చేస్తున్నారు. ప్రేక్షకులు, సినిమా చూసే వాళ్లందరికీ జరిగిన అనౌన్స్ మెంట్ అది అని శంకర్ నొక్కి చెబుతున్నాడు. అంటే ఆ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో తన పేరు పడింది కాబట్టి, ఆ కథపై అన్ని రకాల రైట్స్ తనకే ఉంటాయనేది శంకర్ లాజిక్!
ఆ కథపై, స్క్రీన్ ప్లే పై హక్కులన్నీ తనవే అనేందుకు ఆధారం ఆ సినిమా టైటిల్ కార్డ్సే అని శంకర్ అంటున్నారు! ఇక ఈ విషయంలో రవిచంద్రన్ లేనిపోని రచ్చ చేయొద్దన్నట్టుగా కూడా శంకర్ స్పందించారు. అన్నియన్ విషయంలో రచయిత సుజాత ప్రమేయం ఉన్నా.. అది కేవలం మాటల వరకే అని శంకర్ అంటున్నారు. ఆ సినిమా తమిళ వెర్షన్ కు సుజాత మాటల రచయిత అని, ఆయన ప్రమేయం కూడా అంత వరకే అని శంకర్ చెబుతున్నారు.
అయితే..శంకర్ చెబుతున్న లాజిక్ ఎంత వరకూ చెల్లుతుందనేదే ఇక్కడ ప్రధానమైన సందేహం. సాధారణంగా సినిమాల రీమేక్ రైట్స్ ను నిర్మాతలే సొమ్ము చేసుకుంటూ ఉంటారు. చాలా రీమేక్ సినిమాల విషయంలో రచయితలకు మిగిలింది పేరు మాత్రమే! కొన్ని సందర్భాల్లో అది కూడా ఉండదు. తెలుగులో హిట్ అయిన బోలెడన్ని సినిమాలు రీమేక్ అయిన సందర్భాల్లో నిర్మాతలే వాటి రేట్లను ఫిక్స్ చేసి, సొమ్ము చేసుకుంటూ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
వాటి విషయంలో కథా రచయితలకూ, దర్శకులకూ ఏమైనా ఇచ్చారనే ఊసు కూడా ఉండదు. అయితే టైటిల్ కార్డ్స్ లో కథ, స్క్రీన్ ప్లే ల విషయంలో తన పేరే పడింది కాబట్టి, వాటి అమ్మకం హక్కులు తనవే అని శంకర్ కొత్త లాజిక్ చెబుతున్నారు. మరి ఈ లాజిక్ చట్టపరంగా చెల్లుతుందా? అనేది ఇంకా సందేహమే.
ఒకవేళ చెల్లుతుందంటే.. చాలా మంది దర్శక, రచయితలకు కొత్త హక్కు సంక్రమించినట్టే! కథను, స్క్రిప్ట్ ను నిర్మాతకు అమ్ముతున్నట్టుగా పత్రాలేవీ రాసుకోకపోతే.. రీమేక్ అయిన సినిమాల విషయంలో రచయితలకు కొత్త హక్కులు దక్కుతున్నట్టేనేమో!